కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. హోషేయ 5:12సుమారు క్రీ.పూ. 780

    నేను ఎఫ్రాయిం వారికి చిమ్మెట పురుగులా ఉన్నాను, యూదా ప్రజలకు కుళ్లు పట్టించే తెగులుగా ఉంటాను.

  2. హోషేయ 5:13సుమారు క్రీ.పూ. 780

    “ఎఫ్రాయిం తన రోగాన్ని, యూదా తన పుండ్లను చూసుకున్నప్పుడు, ఎఫ్రాయిం అష్షూరు వైపు తిరిగి గొప్ప రాజును సహాయం కోరాడు. అయితే అతడు నిన్ను బాగుచేయలేదు, నీ పుండ్లను స్వస్థపరచలేదు.

  3. హోషేయ 5:14సుమారు క్రీ.పూ. 780

    ఎందుకంటే నేను ఎఫ్రాయిముకు సింహంలా యూదాకు కొదమసింహంలా ఉంటాను. నేను వారిని ముక్కలుగా చీల్చి వెళ్లిపోతాను; వారిని మోసుకెళ్తాను, వారిని కాపాడేవారెవరూ ఉండరు.

  4. హోషేయ 5:15సుమారు క్రీ.పూ. 780

    వారు తమ అపరాధం ఒప్పుకుని నన్ను వెదికే వరకు నేను నా స్థలానికి తిరిగి వెళ్తాను, వారు తమ దురవస్థలో నన్ను తీవ్రంగా వెదకుతారు.”

  5. హోషేయ 6:1సుమారు క్రీ.పూ. 780

    “రండి, మనం యెహోవా దగ్గరకు తిరిగి వెళ్దాము. ఆయన మనల్ని ముక్కలుగా చీల్చారు కాని ఆయనే మనల్ని బాగుచేస్తారు; ఆయన మనల్ని గాయపరచారు కాని ఆయన మన గాయాలను కడతారు.

  6. హోషేయ 6:2సుమారు క్రీ.పూ. 780

    రెండు రోజుల తర్వాత ఆయన మనల్ని బ్రతికిస్తారు, ఆయన సన్నిధిలో మనం బ్రతికేటట్టు, మూడవ రోజున ఆయన మనల్ని పునరుద్ధరిస్తారు.

  7. హోషేయ 6:3సుమారు క్రీ.పూ. 780

    మనం యెహోవా గురించి తెలుసుకుందాం; ఆయనను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సూర్యోదయం ఎంత నిశ్చయమో, ఆయన ప్రత్యక్షమవ్వడం అంతే నిశ్చయం; ఆయన శీతాకాలం వర్షాల్లా, భూమిని తడిపే తొలకరి వానలా దగ్గరకు వస్తారు.”

  8. హోషేయ 6:4సుమారు క్రీ.పూ. 780

    “ఎఫ్రాయిమూ, నిన్ను నేనేం చేయాలి? యూదా, నిన్ను నేనేం చేయాలి? మీ ప్రేమ ప్రొద్దున వచ్చే పొగమంచులా, ఉదయకాలపు మంచులా అదృశ్యమవుతుంది.

  9. హోషేయ 6:5సుమారు క్రీ.పూ. 780

    కాబట్టి నా ప్రవక్తల ద్వారా మిమ్మల్ని ముక్కలు చేశాను, నా నోటిమాటల ద్వారా మిమ్మల్ని చంపాను, అప్పుడు నా తీర్పులు మెరుపులా ప్రకాశిస్తాయి.

  10. హోషేయ 6:6సుమారు క్రీ.పూ. 780

    ఎందుకంటే నేను దయను కోరుతున్నాను బలిని కాదు, దహనబలుల కంటే దేవుని గురించిన జ్ఞానం నాకు ఇష్టము.

  11. హోషేయ 6:7సుమారు క్రీ.పూ. 780

    ఆదాములా వారు నా నిబంధనను మీరారు; వారు నాకు నమ్మకద్రోహం చేశారు.

  12. హోషేయ 6:8సుమారు క్రీ.పూ. 780

    గిలాదు దుర్మార్గుల పట్టణం, దానిలో రక్తపు అడుగుజాడలు ఉన్నాయి.

  13. హోషేయ 6:9సుమారు క్రీ.పూ. 780

    బందిపోటు దొంగల్లా మాటున పొంచి ఉన్నట్లు, యాజకుల గుంపు పొంచి ఉంది; షెకెము మార్గంలో వారు హత్య చేస్తారు, దుర్మార్గపు కుట్రలు చేస్తూ ఉంటారు.

  14. హోషేయ 6:10సుమారు క్రీ.పూ. 780

    నేను ఇశ్రాయేలులో ఘోరమైన విషయాన్ని చూశాను: అక్కడ ఎఫ్రాయిం వ్యభిచారానికి అప్పగించుకుంది, ఇశ్రాయేలు అపవిత్రపరచబడింది.

  15. హోషేయ 6:11సుమారు క్రీ.పూ. 780

    “నేను నా ప్రజలను మునుపటి స్థితికి తీసుకువచ్చినప్పుడు, “యూదా వారలారా, మీ కోసం కూడా కోత సిద్ధంగా ఉంది.

  16. హోషేయ 7:1సుమారు క్రీ.పూ. 780

    నేను ఇశ్రాయేలును స్వస్థపరిచేటప్పుడు, ఎఫ్రాయిం పాపాలు బహిర్గతం అవుతున్నాయి, సమరయ నేరాలు బయటపడుతున్నాయి. వారు మోసం చేస్తూనే ఉంటారు, దొంగలు ఇళ్ళలో చొరబడతారు, బందిపోటు దొంగలు వీధుల్లో దోచుకుంటారు;

  17. హోషేయ 7:2సుమారు క్రీ.పూ. 780

    అయితే వారి చెడు పనులన్నీ నేను జ్ఞాపకం చేసుకుంటానని వారు గ్రహించరు. వారి పాపాలు వారిని చుట్టుముట్టాయి; అవి ఎప్పుడూ నా ఎదుటే ఉన్నాయి.

  18. హోషేయ 7:3సుమారు క్రీ.పూ. 780

    “వారు తమ దుష్టత్వంతో రాజును, వారి అబద్ధాలతో అధిపతులను సంతోషపరుస్తారు.

  19. హోషేయ 7:4సుమారు క్రీ.పూ. 780

    వారంతా వ్యభిచారులు, పొయ్యిలా మండుతూ ఉంటారు, వంటమనిషి ముద్ద పిసికిన తర్వాత అది పొంగే వరకు వేడి చేసిన పొయ్యివంటి వారు.

  20. హోషేయ 7:5సుమారు క్రీ.పూ. 780

    మన రాజు పండుగ దినాన, అధిపతులు ద్రాక్ష మద్యం మత్తులో ఉంటారు. అతడు అపహాసకులతో చేతులు కలుపుతాడు.

  21. హోషేయ 7:6సుమారు క్రీ.పూ. 780

    వారి హృదయాలు పొయ్యివంటివి; కుట్రతో వారు అతన్ని సమీపిస్తారు. రాత్రంతా వారి కోపాగ్ని రగులుతూ ఉంటుంది; ఉదయాన అది మండే అగ్నిలా ప్రజ్వలిస్తుంది.

  22. హోషేయ 7:7సుమారు క్రీ.పూ. 780

    వారంతా పొయ్యిలా వేడిగా ఉన్నారు; వారు తమ పాలకులను మ్రింగివేస్తారు వారి రాజులందరూ కూలిపోతారు, వారిలో ఏ ఒక్కడు నన్ను ప్రార్థించడు.

  23. హోషేయ 7:8సుమారు క్రీ.పూ. 780

    “ఎఫ్రాయిం దేశాలతో కలిసిపోతుంది; ఎఫ్రాయిం తిరిగేయని అప్పం లాంటిది.

  24. హోషేయ 7:9సుమారు క్రీ.పూ. 780

    విదేశీయులు అతని బలాన్ని లాగేస్తారు, కాని అతడు గ్రహించడు. అతని తలమీద నెరసిన వెంట్రుకలు ఉంటాయి, కాని అతడు గమనించడు.

  25. హోషేయ 7:10సుమారు క్రీ.పూ. 780

    ఇశ్రాయేలు అహంకారం అతనికి విరుద్ధంగా సాక్ష్యం ఇస్తుంది, కాని ఇదంతా జరిగినా కూడా అతడు తన దేవుడైన యెహోవా వైపు తిరగడం లేదు, ఆయనను వెదకడం లేదు.