కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. జెఫన్యా 1:1సుమారు క్రీ.పూ. 630

    ఇది యూదా రాజైన ఆమోను కుమారుడు యోషీయా పాలనలో జెఫన్యాకు యెహోవా నుండి వచ్చిన వాక్కు. జెఫన్యా కూషీ కుమారుడు, కూషీ గెదల్యా కుమారుడు, గెదల్యా అమర్యా కుమారుడు, అమర్యా హిజ్కియాకు కుమారుడు.

  2. జెఫన్యా 1:2సుమారు క్రీ.పూ. 630

    “భూమి మీద ఏమీ మిగలకుండా నేను సమస్తాన్ని తుడిచివేస్తాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  3. జెఫన్యా 1:3సుమారు క్రీ.పూ. 630

    “మనుష్యులను మృగాలను తుడిచివేస్తాను; ఆకాశంలో ఎగిరే పక్షులను, సముద్రంలోని చేపలను తుడిచివేస్తాను, దుర్మార్గులను పడిపోయేలా చేసే విగ్రహాలను తుడిచివేస్తాను.” “నేను మానవజాతి అంతటిని భూమి మీద ఉండకుండా చేస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  4. జెఫన్యా 1:4సుమారు క్రీ.పూ. 630

    “యూదా వారి మీద, యెరూషలేములో నివసిస్తున్న వారందరి మీద నా చేయి చాపుతాను. ఈ స్థలంలో మిగిలి ఉన్న బయలు దేవత ఆరాధికులను ఆ విగ్రహాన్ని పూజించేవారి పూజారుల పేర్లతో సహా నిర్మూలిస్తాను.

  5. జెఫన్యా 1:5సుమారు క్రీ.పూ. 630

    మిద్దెమీద ఎక్కి ఆకాశ నక్షత్ర సమూహాన్ని పూజించేవారిని, యెహోవా పేర మోలెకు దేవత పేర మొక్కి ఒట్టు వేసుకునేవారిని నేను నాశనం చేస్తాను.

  6. జెఫన్యా 1:6సుమారు క్రీ.పూ. 630

    యెహోవాను అనుసరించకుండా ప్రక్కకు తిరిగినవారిని ఆయనను వెదకకుండ, ఆయన దగ్గర విచారణ చేయనివారిని నాశనం చేస్తాను.”

  7. జెఫన్యా 1:7సుమారు క్రీ.పూ. 630

    ప్రభువైన యెహోవా దినం సమీపించింది, కాబట్టి ఆయన సన్నిధిలో మౌనంగా ఉండండి. యెహోవా బలి సిద్ధం చేశారు; తాను ఆహ్వానించిన వారిని ఆయన పవిత్రపరిచారు.

  8. జెఫన్యా 1:8సుమారు క్రీ.పూ. 630

    “యెహోవా ఏర్పరచిన బలి దినాన నేను అధికారులను, రాజకుమారులను, విదేశీయుల్లా దుస్తులు వేసుకున్నవారందరిని శిక్షిస్తాను.

  9. జెఫన్యా 1:9సుమారు క్రీ.పూ. 630

    ఆ రోజున, ఇంటి గుమ్మం దాటివచ్చి, తమ దేవతల మందిరాన్ని హింసతో మోసంతో నింపేవారందరినీ నేను శిక్షిస్తాను.

  10. జెఫన్యా 1:10సుమారు క్రీ.పూ. 630

    “ఆ దినాన యెరూషలేములో ఉన్న చేప ద్వారం నుండి ఏడుపు, పట్టణ దిగువ భాగం నుండి రోదన, కొండల దిక్కునుండి గొప్ప నాశనం వస్తుంది, అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  11. జెఫన్యా 1:11సుమారు క్రీ.పూ. 630

    వర్తక ప్రాంతంలో నివసించేవారలారా! రోదించండి; నీ వర్తకులంతా తుడిచివేయబడతారు, వెండితో వ్యాపారం చేసేవారంతా నాశనం చేయబడతారు.

  12. జెఫన్యా 1:12సుమారు క్రీ.పూ. 630

    ఆ కాలంలో నేను దీపాలు పట్టుకుని యెరూషలేమును సోదా చేస్తాను, మడ్డి మీద నిలిచిన ద్రాక్షరసం లాంటివారై ‘యెహోవా మేలు గాని కీడు గాని ఏదీ చేయడు’ అనుకుంటూ, ఆత్మసంతృప్తితో ఉన్నవారిని నేను శిక్షిస్తాను.

  13. జెఫన్యా 1:13సుమారు క్రీ.పూ. 630

    వారి ధనం దోపిడి అవుతుంది, వారి ఇల్లు పాడవుతాయి. వారు ఇళ్ళు కట్టుకున్నా వాటిలో నివసించలేరు; వారు ద్రాక్షతోటలు నాటినా వాటి ద్రాక్షరసం త్రాగలేరు.”

  14. జెఫన్యా 1:14సుమారు క్రీ.పూ. 630

    యెహోవా మహాదినం సమీపంగా ఉంది, అది ఆసన్నమై త్వరగా రాబోతుంది. యెహోవా దినాన ఏడ్పు భయంకరంగా ఉంటుంది; ఆ దినాన బలాఢ్యులు ఘోరంగా ఏడుస్తారు.

  15. జెఫన్యా 1:15సుమారు క్రీ.పూ. 630

    ఆ దినం ఉగ్రత దినం; బాధ, వేదన కలుగుతుంది. అది నాశనం, ధ్వంసం, చీకటి అంధకారం కమ్మే దినం, మబ్బులు, గాఢాంధకారం కమ్మే రోజు.

  16. జెఫన్యా 1:16సుమారు క్రీ.పూ. 630

    ప్రాకార పట్టణాల దగ్గర ఎత్తైన గోపురాల దగ్గర యుద్ధఘోష, బాకానాదం వినబడే రోజు.

  17. జెఫన్యా 1:17సుమారు క్రీ.పూ. 630

    “ప్రజలు యెహోవాకు విరోధంగా పాపం చేశారు, కాబట్టి మనుష్యులందరి మీదికి నేను బాధను రప్పించగా వారు గ్రుడ్డివారిలా తడుముకుంటారు. వారి రక్తం దుమ్ములా, వారి మాంసం పెంటలా పారవేయబడుతుంది.

  18. జెఫన్యా 1:18సుమారు క్రీ.పూ. 630

    యెహోవా ఉగ్రత దినాన వారి వెండి బంగారాలు వారిని తప్పించలేవు.” ఆయన రోషాగ్ని చేత లోకమంతా దగ్దమవుతుంది, ఆయన హఠాత్తుగా భూనివాసులందరినీ సర్వనాశనం చేయబోతున్నారు.

  19. జెఫన్యా 2:1సుమారు క్రీ.పూ. 630

    సిగ్గుమాలిన దేశమా, సమకూడండి, మిమ్మల్ని మీరు సమకూర్చుకొండి

  20. జెఫన్యా 2:2సుమారు క్రీ.పూ. 630

    శాసనం అమలులోకి రాకముందే ఆ దినం గాలికి కొట్టుకుపోయే పొట్టులా కనుమరుగు కాక ముందే, యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకముందే, యెహోవా ఉగ్రత దినం మీ మీదికి రాకముందే సమకూడండి.

  21. జెఫన్యా 2:3సుమారు క్రీ.పూ. 630

    దేశంలోని సమస్త దీనులారా, ఆయన ఆజ్ఞను పాటించేవారలారా, యెహోవాను వెదకండి. నీతిని వెదకండి, దీనత్వాన్ని వెదకండి; యెహోవా కోప్పడే దినాన బహుశ మీకు ఆశ్రయం దొరకవచ్చు.

  22. జెఫన్యా 2:4సుమారు క్రీ.పూ. 630

    గాజా విడిచిపెట్టబడుతుంది, అష్కెలోను పాడైపోతుంది. మధ్యాహ్న సమయంలో అష్డోదు ఖాళీ చేయబడుతుంది, ఎక్రోను పట్టణం పెళ్ళగించబడుతుంది.

  23. జెఫన్యా 2:5సుమారు క్రీ.పూ. 630

    సముద్రతీరాన కాపురమున్న కెరేతీయులారా! మీకు శ్రమ. ఫిలిష్తీయ ప్రజలు కాపురమున్న కనాను దేశమా! యెహోవా వాక్కు నీకు వ్యతిరేకంగా ఉంది, “నీలో ఎవరూ మిగలకుండా నేను నిన్ను నాశనం చేస్తాను” అని ఆయన అంటున్నారు.

  24. జెఫన్యా 2:6సుమారు క్రీ.పూ. 630

    సముద్రతీరాన ఉన్న దేశం, గొర్రెల కాపరులకు పచ్చికబయళ్లుగా అవుతుంది; బావులు, మందల కోసం దొడ్లు ఉంటాయి.

  25. జెఫన్యా 2:7సుమారు క్రీ.పూ. 630

    ఆ ప్రాంతం యూదా వంశంలో మిగిలిన వారికి స్వాధీనం అవుతుంది. వారి దేవుడు యెహోవా వారి పట్ల శ్రద్ధ చూపిస్తారు, వారు బందీలుగా వెళ్లిన స్థలాల నుండి ఆయన వారిని రప్పిస్తారు. వారు ఆ ప్రాంతంలో తమ మందలు మేపుతారు. సాయంకాల సమయంలో అష్కెలోను ఇళ్ళలో పడుకుంటారు.