కంటెంట్‌కు వెళ్లండి

Kings గురించి బైబిల్ వచనాలు

580 వచనాలు · 175 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అతడు దేవుని పేరిట తనతో ప్రమాణం చేయించిన రాజైన నెబుకద్నెజరు మీద కూడా తిరుగుబాటు చేశాడు. అతడు మెడవంచని వాడై తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరగలేదు.

  2. ఇంకా, యాజకుల నాయకులందరు, ప్రజలందరు ఇతర దేశాల అసహ్యమైన ఆచారాలన్నిటిని అనుసరించి, యెరూషలేములో ఆయన ప్రతిష్ఠించిన యెహోవా మందిరాన్ని అపవిత్రం చేస్తూ మరింతగా నమ్మకద్రోహులయ్యారు.

  3. వారి పూర్వికుల దేవుడైన యెహోవా తన ప్రజల మీద, తన నివాసస్థలం మీద జాలిపడి, వారికి తన దూతల ద్వారా పదే పదే సందేశాలు పంపించారు.

  4. కానీ వారు దేవుని దూతలను ఎగతాళి చేశారు, ఆయన మాటలను తృణీకరించారు, ఆయన ప్రజలపైకి నివారించలేని యెహోవా ఉగ్రత వచ్చేవరకు వారు ఆయన ప్రవక్తలను అపహాస్యం చేశారు.

  5. యెహోవా వారి మీదికి బబులోనీయుల రాజును రప్పించారు. అతడు వారి పరిశుద్ధాలయంలో వారి యువకులను కత్తితో చంపాడు. యువకులను గాని యువతులను గాని వృద్ధులను గాని బలహీనులను గాని విడిచిపెట్టలేదు. దేవుడు వారందరినీ నెబుకద్నెజరు చేతికి అప్పగించారు.

  6. అతడు యెహోవా మందిరం నుండి పెద్దవి చిన్నవి అని తేడా లేకుండా అన్ని వస్తువులను, యెహోవా మందిరం నిధులు, రాజు నిధులు, అతని అధికారుల నిధులన్నింటిని బబులోనుకు తీసుకెళ్లాడు.

  7. వారు దేవుని ఆలయానికి నిప్పంటించి యెరూషలేము గోడలను పడగొట్టారు; వారు రాజభవనాలన్నిటిని తగలబెట్టి, అక్కడ విలువైన ప్రతీదానిని నాశనం చేశారు.

  8. ఖడ్గం నుండి తప్పించుకున్న వారిని అతడు బబులోనుకు బందీలుగా తీసుకెళ్లాడు. పర్షియా రాజ్యం అధికారంలోకి వచ్చేవరకు వారు అక్కడే ఉండి అతనికి అతని కుమారులకు దాసులుగా ఉన్నారు.

  9. దేశం తన సబ్బాతు దినాలను ఆనందంగా గడిపింది; యిర్మీయా చెప్పిన యెహోవా వాక్కు నెరవేరేలా డెబ్బై సంవత్సరాలు పూర్తయ్యే వరకు అది పాడైన సమయమంతా విశ్రాంతి తీసుకుంది.

  10. “పర్షియా రాజైన కోరెషు చెప్పేది ఇదే: “ ‘పరలోకపు దేవుడైన యెహోవా నాకు భూమిపై ఉన్న అన్ని రాజ్యాలను ఇచ్చారు. యూదాలోని యెరూషలేములో తనకు మందిరాన్ని నిర్మించడానికి నన్ను నియమించారు.

  11. మీ మధ్య ఉన్న ఆయన ప్రజల్లో ఎవరైనా యూదాలోని యెరూషలేముకు వెళ్లి మందిరాన్ని నిర్మించవచ్చు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా, యెరూషలేములో ఉన్న దేవుడైన వారి దేవుడు వారికి తోడుగా ఉండును గాక.

  12. మిగిలి ఉన్నవారు ఇప్పుడు ఏ ప్రాంతంలో నివసిస్తున్నారో ఆ ప్రాంతం ప్రజలు వారికి వెండి, బంగారాలను, సామాగ్రిని, పశువులను యెరూషలేములోని దేవుని ఆలయానికి స్వేచ్ఛార్పణలు ఇవ్వాలి.’ ”

  13. అప్పుడు రాజైన దర్యావేషు ఆదేశించగా వారు బబులోను ఖజానాలోని రాజ్య దస్తావేజులన్ని పరిశోధించారు.

  14. మాదీయ ప్రాంతంలో ఉన్న ఎక్బతానా కోటలో ఒక గ్రంథపుచుట్ట దొరికింది. దాని మీద ఇలా వ్రాసి ఉంది: వ్రాతపూర్వక సందేశము:

  15. రాజైన కోరెషు పాలనలో మొదటి సంవత్సరంలో యెరూషలేములోని దేవుని దేవాలయం గురించి రాజు జారీ చేసిన శాసనం: బలులు అర్పించే స్థలంగా మందిరాన్ని తిరిగి కట్టాలి, దాని పునాదులు వేయాలి. దాని ఎత్తు అరవై మూరలు, వెడల్పు అరవై మూరలు ఉండాలి.

  16. పెద్ద రాళ్లతో మూడు వరుసలు, క్రొత్త కలపతో ఒక వరుస పెట్టి కట్టాలి. దానికయ్యే ఖర్చు రాజ్య ఖజానా నుండి చెల్లించాలి.

  17. అంతేకాక, నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయం నుండి బబులోనుకు తీసుకువచ్చిన దేవుని ఆలయానికి సంబంధించిన వెండి బంగారు వస్తువులను తిరిగి యెరూషలేము దేవాలయానికి తీసుకెళ్లి వాటి స్థానాల్లో పెట్టాలి; వాటిని దేవుని మందిరంలోనే ఉంచాలి.

  18. అందుకు ఇప్పుడు, యూఫ్రటీసు నది అవతల అధిపతియైన తత్తెనై, షెతర్బోజ్నయి వారి సహోద్యోగులు దీనికి దూరంగా ఉండాలి.

  19. దేవుని ఆలయ పనికి ఆటంకం కలిగించకూడదు. యూదుల అధిపతిని, యూదుల పెద్దలను దేవుని మందిరాన్ని దాని స్థానంలో కట్టనివ్వండి.

  20. అంతేకాక, దేవుని మందిరాన్ని తిరిగి కట్టడానికి ఈ యూదుల పెద్దలకు మీరు అందించవలసిన సహాయం గురించి కూడా నేను మీకు ఆదేశం ఇస్తున్నాను: యూఫ్రటీసు నది అవతల నుండి రాజ ఖజానాకు వచ్చిన పన్నుల నుండి వారి ఖర్చులన్నిటిని చెల్లించాలి, తద్వారా వారి పని ఆగదు.

  21. వారికి అవసరమైన వాటిని అనగా పరలోక దేవునికి దహనబలులు అర్పించడానికి దూడలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలు యెరూషలేములోని యాజకులు అడిగే గోధుమలు, ఉప్పు, ద్రాక్షరసం, ఒలీవనూనె, ప్రతిరోజు క్రమం తప్పకుండా వారికి అందించాలి.

  22. తద్వారా వారు బలులు అర్పించి పరలోక దేవుని సంతోషపరచి రాజు, అతని కుమారుల క్షేమం గురించి ప్రార్థిస్తారు.

  23. అంతేకాక, నా ఆదేశం ఏంటంటే, ఎవరైనా ఈ ఆజ్ఞ పాటించకపోతే వారి ఇంటి నుండి దూలాన్ని తీసి దానికి వారిని ఉరితీయాలి. ఈ నేరం బట్టి వారి ఇంటిని చెత్తకుప్పగా చేయాలి.

  24. ఏ రాజైన ఏ ప్రజలైనా ఈ ఆజ్ఞను మీరి యెరూషలేములోని దేవుని మందిరాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తే తన నామాన్ని అక్కడ ఉంచిన దేవుడు వారిని పడగొట్టును గాక. దర్యావేషు అనే నేను ఆదేశిస్తున్నాను. దీనిని ఖచ్చితంగా శ్రద్ధతో పాటించాలి.

  25. కాబట్టి, రాజులారా, తెలివిగా ఉండండి; భూమిని పాలించేవారలారా, మిమ్మల్ని సరిచేసుకోండి.