కంటెంట్‌కు వెళ్లండి

David

968 వచనాలు · 40 కుటుంబ సభ్యులు

David ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. తన డాలు మోసేవాడు తనకు ముందు నడుస్తుండగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదుకు దగ్గరగా వచ్చి,

  2. ఎర్రగా, అందంగా ఉన్న దావీదును చూసి చిన్నపిల్లవాడని అతన్ని పట్టించుకోలేదు.

  3. అతడు దావీదుతో, “కర్ర తీసుకుని నా మీదికి వస్తున్నావు నేనేమైనా కుక్కనా?” అని చెప్పి తన దేవుళ్ళ పేరట దావీదును శపించాడు.

  4. ఆ ఫిలిష్తీయుడు దావీదుతో, “నా దగ్గరకు రా, నీ మాంసాన్ని పక్షులకు మృగాలకు వేస్తాను!” అన్నాడు.

  5. అందుకు దావీదు ఆ ఫిలిష్తీయునితో, “నీవు కత్తి ఈటె బల్లెం తీసుకుని నా మీదికి వస్తున్నావు కాని నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యాల దేవుడును సైన్యాల అధిపతియైన యెహోవా పేరట నేను నీ మీదికి వస్తున్నాను.

  6. ఆ ఫిలిష్తీయుడు దావీదుపై దాడి చేయడానికి ముందుకు రాగానే దావీదు అతన్ని ఎదుర్కోడానికి సైన్యం వైపు పరుగెత్తి వెళ్లాడు.

  7. దావీదు తన సంచిలో నుండి ఒక రాయి తీసి వడిసెలలో పెట్టి విసిరి ఆ ఫిలిష్తీయుని నుదిటి మీద కొట్టాడు. ఆ రాయి అతని నుదిటి లోపలికి చొచ్చుకొని పోగా గొల్యాతు నేలపై బోర్లాపడ్డాడు.

  8. అలా దావీదు ఆ ఫిలిష్తీయుని కేవలం ఒక వడిసెల ఒక రాయితో జయించాడు; తన చేతిలో కత్తి లేకుండానే ఆ ఫిలిష్తీయుని పడగొట్టాడు.

  9. అప్పుడు దావీదు పరుగెత్తుకొని వెళ్లి ఆ ఫిలిష్తీయుని మీద నిలబడి వాని ఒరలో ఉన్న కత్తిని తీసి ఆ కత్తితోనే వాని చంపి, వాని తల నరికివేశాడు. ఫిలిష్తీయులు తమ వీరుడు చనిపోవడం చూసి పారిపోయారు.

  10. దావీదు ఆ ఫిలిష్తీయుని తలను యెరూషలేముకు తీసుకువచ్చాడు. ఫిలిష్తీయుని ఆయుధాలను తన సొంత డేరాలో ఉంచాడు.

  11. దావీదు ఆ ఫిలిష్తీయుని ఎదుర్కోడానికి వెళ్లడం చూసి సౌలు తన సేనాధిపతియైన అబ్నేరును పిలిచి, “అబ్నేరూ, ఈ యువకుడు ఎవరి కుమారుడు” అని అడిగాడు. అందుకు అబ్నేరు, “రాజా, నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నాకు తెలియదు” అన్నాడు.

  12. దావీదు ఫిలిష్తీయుని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతన్ని పిలిచి ఫిలిష్తీయుని తల అతని చేతిలో ఉండగానే దావీదును సౌలు దగ్గరకు తీసుకువచ్చాడు.

  13. సౌలు అతన్ని, “చిన్నవాడా, నీవెవరి కుమారుడవు?” అని అడిగాడు. అందుకు దావీదు, “నేను నీ సేవకుడు బేత్లెహేమీయుడైన యెష్షయి కుమారుడను” అని సమాధానమిచ్చాడు.

  14. దావీదు సౌలుతో మాట్లాడడం పూర్తయిన తర్వాత యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయింది. యోనాతాను దావీదును ప్రాణానికి ప్రాణంగా భావించి అతన్ని ప్రేమించాడు.

  15. యోనాతాను దావీదును తన ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి అతడు దావీదుతో ఒక నిబంధన చేసుకున్నాడు.

  16. యోనాతాను తాను కప్పుకుని ఉన్న వస్త్రాన్ని, దానితో పాటు తన కత్తిని విల్లును నడికట్టును తీసి దావీదుకు ఇచ్చాడు.

  17. దావీదు సౌలు తనను పంపిన ప్రతి చోటుకు వెళ్లి, విజయం సాధించేవాడు కాబట్టి సౌలు అతనికి సైన్యంలో ఉన్నత స్థానాన్ని ఇచ్చాడు. అది సైనికులందరికి, సౌలు అధికారులకు సంతోషం కలిగించింది.

  18. దావీదు ఫిలిష్తీయుని చంపి తిరిగి వస్తున్నప్పుడు, ఇశ్రాయేలు పట్టణాలలోని స్త్రీలందరు చాలా ఆనందంతో తంబురలు వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడుతూ నాట్యం చేస్తూ రాజైన సౌలును కలుసుకోడానికి ఎదురువచ్చారు.

  19. ఆ స్త్రీలు నాట్యం చేస్తూ వాయిద్యాలు వాయిస్తూ, “సౌలు వేయిమందిని దావీదు పదివేలమందిని చంపారు” అని పాడారు.

  20. ఆ మాటలు సౌలుకు నచ్చలేదు కాబట్టి అతడు చాలా కోపం తెచ్చుకుని, “వారు దావీదుకు పదివేలమంది, నాకు వేయిమంది అంటున్నారు; రాజ్యం కాకుండా అతడు మరేం తీసుకోగలడు?” అనుకున్నాడు.

  21. అప్పటినుండి సౌలు దావీదును అసూయతో చూడడం మొదలుపెట్టాడు.

  22. తర్వాత రోజు దేవుని దగ్గర నుండి దురాత్మ ఒకటి సౌలు మీదికి బలంగా వచ్చి అతడు ఇంట్లో ప్రవచిస్తున్నప్పుడు దావీదు ఎప్పటిలాగానే వీణ పట్టుకుని వాయించాడు. సౌలు చేతిలో ఒక ఈటె ఉంది.

  23. సౌలు, “దీనితో నేను దావీదును గోడకు వ్రేలాడదీస్తాను” అని తనలో తాను అనుకుని దావీదు మీదికి ఈటె విసిరాడు కాని దావీదు రెండు సార్లు తప్పించుకున్నాడు.

  24. యెహోవా తనను విడిచిపెట్టి దావీదుకు తోడుగా ఉండడం చూసి సౌలు దావీదుకు భయపడ్డాడు.

  25. యెహోవా దావీదుకు తోడుగా ఉన్నారు కాబట్టి అతడు చేసిన వాటన్నిటిలో విజయాన్ని సాధించాడు.