Skip to content

Kings గురించి బైబిల్ వచనాలు

580 వచనాలు · 175 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఆ కాలంలో ఎలీషాకు జబ్బుచేసింది, దానిని బట్టి తర్వాత అతడు చనిపోతాడు. ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతన్ని చూడడానికి వచ్చి అతన్ని చూసి, “నా తండ్రీ! నా తండ్రీ! ఇశ్రాయేలు రథాలు, రౌతులు!” అని అంటూ ఏడ్చాడు.

  2. అతనితో ఎలీషా, “విల్లు, కొన్ని బాణాలు తీసుకో” అని చెప్పగా అతడు అలా చేశాడు.

  3. అతడు ఇశ్రాయేలు రాజుతో, “నీ చేతుల్లో విల్లును ఎక్కుపెట్టు” అన్నాడు. అతడు ఎక్కుపెట్టిన తర్వాత ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద ఉంచాడు.

  4. ఎలీషా, “తూర్పున ఉన్న కిటికీ తెరువు” అన్నాడు, అతడు తెరిచాడు. ఎలీషా, “బాణం విసురు” అన్నాడు, రాజు బాణం విసిరాడు. ఎలీషా, “ఇది యెహోవా విజయ బాణం, అరాము మీద విజయ బాణం! నీవు ఆఫెకు దగ్గర అరామీయులను పూర్తిగా నాశనం చేస్తావు” అని ప్రకటించాడు.

  5. తర్వాత అతడు, “బాణాలు చేత పట్టుకో” అన్నాడు, రాజు వాటిని తీసుకున్నాడు. ఎలీషా ఇశ్రాయేలు రాజుతో, “వాటితో నేలను కొట్టు” అన్నాడు. అతడు నేలను మూడుసార్లు కొట్టి ఆగాడు.

  6. దైవజనుడు అతని మీద కోప్పడి, “నీవు అయిదు లేదా ఆరు సార్లు కొట్టివుంటే, నీవు అరాము దేశాన్ని ఓడించి పూర్తిగా నాశనం చేసి ఉండేవాడివి. కాని, ఇప్పుడు దానిని మూడుసార్లు మాత్రమే ఓడిస్తావు” అని అన్నాడు.

  7. తర్వాత ఎలీషా చనిపోయాడు, అతన్ని సమాధి చేశారు. అయితే ప్రతి వసంతకాలంలో మోయాబు దోపిడి మూకలు దేశంలోకి వచ్చేవారు.

  8. ఒకసారి కొంతమంది ఇశ్రాయేలీయులు ఒక శవాన్ని సమాధి చేస్తుండగా అకస్మాత్తుగా దోపిడి మూకను చూసి ఆ మనిషి శవాన్ని ఎలీషా సమాధిలో పడేశారు. ఆ శవం ఎలీషా ఎముకలకు తగలగానే, ఆ మనిషి తిరిగి బ్రతికి లేచి తన కాళ్లమీద నిలబడ్డాడు.

  9. యెహోయాహాజు పరిపాలన అంతటిలో, అరాము రాజైన హజాయేలు ఇశ్రాయేలు ప్రజలను బాధించాడు.

  10. అయితే యెహోవా తాను అబ్రాహాము ఇస్సాకు యాకోబుతో చేసిన నిబంధనను బట్టి వారి మీద జాలిపడి దయ చూపారు. ఈనాటి వరకు యెహోవా వారిని తన సముఖం నుండి వెళ్లగొట్టడానికి ఇష్టపడలేదు.

  11. అరాము రాజైన హజాయేలు చనిపోయాడు, అతని తర్వాత అతని కుమారుడైన బెన్-హదదు రాజయ్యాడు.

  12. అప్పుడు యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు అంతకుముందు హజాయేలు యెహోయాహాజుతో యుద్ధం చేసి స్వాధీనం చేసుకున్న పట్టణాలను హజాయేలు కుమారుడైన బెన్-హదదు నుండి తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. మూడుసార్లు యెహోయాషు అతన్ని ఓడించి ఇశ్రాయేలు పట్టణాలను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు.

  13. ఇశ్రాయేలు రాజు యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు పరిపాలనలోని రెండవ సంవత్సరంలో యూదారాజు యోవాషు కుమారుడైన అమజ్యా పరిపాలన ఆరంభించాడు.

  14. అతడు రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై అయిదు సంవత్సరాలు, అతడు యెరూషలేములో ఇరవై తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు యెహోయద్దాను; ఆమె యెరూషలేముకు చెందినది.

  15. అతడు యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు, కాని తన పితరుడైన దావీదులా కాదు. అన్ని విషయాల్లో అతని తండ్రియైన యోవాషు మాదిరిని అనుసరించాడు.

  16. అయితే క్షేత్రాలు తొలగించబడలేదు; ప్రజలు ఇంకా ఆ స్థలాల్లో బలులు అర్పిస్తూ, ధూపం వేస్తూ వచ్చారు.

  17. రాజ్యం తన వశంలో స్థిరమైన తర్వాత అతడు రాజైన తన తండ్రిని చంపిన ఆ అధికారులను చంపించాడు.

  18. అయితే అతడు ఆ హంతకుల సంతానాన్ని చంపలేదు. మోషే వ్రాసిన ధర్మశాస్త్రంలో, “తల్లిదండ్రులు తమ పిల్లల కోసం మరణశిక్ష పొందుకోవద్దు, లేదా వారి తల్లిదండ్రుల కోసం పిల్లలు మరణశిక్ష పొందుకోవద్దు; ప్రతి ఒక్కరూ తమ సొంత పాపం కోసం చనిపోతారు” అని యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం అతడు చేశాడు.

  19. అమజ్యా ఉప్పు లోయలో యుద్ధం చేసి పదివేలమంది ఎదోమీయులను చంపి, సెల ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని దానికి యొక్తియేలు అనే పేరు పెట్టాడు. ఈనాటికి దాని పేరు అదే.

  20. తర్వాత అమజ్యా ఇశ్రాయేలు రాజూ యెహు మనుమడును యెహోయాహాజు కుమారుడునైన యెహోయాషు దగ్గరకు దూతలను పంపి, “మనం యుద్ధంలో ఒకరితో ఒకరు తలపడదాం, రండి” అని సవాలు చేశాడు.

  21. అయితే ఇశ్రాయేలు రాజైన యెహోయాషు యూదా రాజైన అమజ్యాకు ఇలా జవాబిచ్చాడు: “లెబానోను అడవిలోని ముళ్ళపొద ఒకటి లెబానోను దేవదారుకు, ‘నీ కుమార్తెను నా కుమారునికి భార్యగా ఇవ్వు’ అని సందేశం పంపిందట. అప్పుడు లెబానోను అడవి మృగం ఒకటి ఆ వైపుకు వచ్చి ఆ ముళ్ళను త్రొక్కి పాడుచేసింది.

  22. నీవు ఎదోమును ఓడించి గర్విస్తున్నావు, నీ విజయంతో తృప్తిపడి ఇంటి దగ్గరే ఉండు. నీవు ఎందుకు నీతో పాటు యూదావారు నాశనమవడానికి కారణమవుతావు?”

  23. అయితే అమజ్యా వినలేదు, కాబట్టి ఇశ్రాయేలు రాజైన యెహోయాషు దాడి చేశాడు. అతడు, యూదా రాజైన అమజ్యా, యూదాకు చెందిన బేత్-షెమెషు దగ్గర ఒకరినొకరు ఎదుర్కొన్నారు.

  24. ఇశ్రాయేలు చేతిలో యూదా ఓడిపోయింది, ప్రతి ఒక్కరు తమ ఇళ్ళకు పారిపోయారు.

  25. ఇశ్రాయేలు రాజైన యెహోయాషు బేత్-షెమెషులో అహజ్యా మనుమడు, యోవాషు కుమారుడు, యూదా రాజైన అమజ్యాను పట్టుకున్నాడు. అప్పుడు యెహోయాషు యెరూషలేముకు వచ్చి ప్రాకారాన్ని, ఎఫ్రాయిం ద్వారం నుండి మూల ద్వారం వరకు దాదాపు నాలుగు వందల మూరలు పడగొట్టాడు.