కంటెంట్‌కు వెళ్లండి

circa 1050–1010 BC

Samuel & King Saul

Israel demands a king; Samuel anoints Saul, whose disobedience leads to his rejection as God chooses a man after his own heart.

810 వచనాలు · 1 గ్రంథం చేర్చబడింది

  1. 1 సమూయేలు 19:7సుమారు క్రీ.పూ. 1062

    అప్పుడు యోనాతాను దావీదును పిలిచి అన్ని సంగతులను అతనికి చెప్పి, దావీదును సౌలు దగ్గరకు తీసుకువచ్చినప్పుడు గతంలో ఉన్నట్లే దావీదు అతని దగ్గర ఉన్నాడు.

  2. 1 సమూయేలు 19:8సుమారు క్రీ.పూ. 1062

    మరొకసారి యుద్ధం వచ్చినప్పుడు దావీదు వెళ్లి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారిని ఓడించి చాలామందిని చంపినప్పుడు వారు అతని దగ్గర నుండి పారిపోయారు.

  3. 1 సమూయేలు 19:9సుమారు క్రీ.పూ. 1062

    యెహోవా దగ్గర నుండి దురాత్మ సౌలు మీదికి వచ్చింది. అప్పుడు సౌలు చేతిలో ఈటె పట్టుకుని తన ఇంట్లో కూర్చున్నాడు. దావీదు సితారా వాయిస్తుండగా,

  4. 1 సమూయేలు 19:10సుమారు క్రీ.పూ. 1062

    సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు వ్రేలాడదీయాలనుకుని ఈటె విసిరాడు. దావీదు ప్రక్కకు తప్పుకోగా సౌలు విసిరిన ఈటె గోడకు గుచ్చుకుంది. దావీదు ఆ రాత్రే తప్పించుకుని పారిపోయాడు.

  5. 1 సమూయేలు 19:11సుమారు క్రీ.పూ. 1062

    ఉదయానే దావీదును చంపాలని అతన్ని పట్టుకోమని చెప్పి సౌలు అతని ఇంటికి దూతలను పంపించాడు. అయితే దావీదు భార్యయైన మీకాలు, “ఈ రాత్రి నీవు పారిపోయి ప్రాణం కాపాడుకోకపోతే రేపు నిన్ను చంపేస్తారు” అని హెచ్చరించి,

  6. 1 సమూయేలు 19:12సుమారు క్రీ.పూ. 1062

    మీకాలు దావీదును కిటికీ గుండా క్రిందకు దింపితే అతడు తప్పించుకుని పారిపోయాడు.

  7. 1 సమూయేలు 19:13సుమారు క్రీ.పూ. 1062

    తర్వాత మీకాలు ఒక విగ్రహాన్ని తీసుకువచ్చి మంచం మీద పెట్టి తల దగ్గర మేక వెంట్రుకలు ఉంచి దుప్పటితో దానిని కప్పింది.

  8. 1 సమూయేలు 19:14సుమారు క్రీ.పూ. 1062

    సౌలు దావీదును పట్టుకోడానికి దూతలను పంపినప్పుడు మీకాలు, “అతడు అనారోగ్యంగా ఉన్నాడు” అని చెప్పింది.

  9. 1 సమూయేలు 19:15సుమారు క్రీ.పూ. 1062

    సౌలు దావీదును చూడడానికి మళ్ళీ దూతలను పంపుతూ వారితో, “అతన్ని మంచంతో సహా తీసుకురండి నేను అతన్ని చంపుతాను” అన్నాడు.

  10. 1 సమూయేలు 19:16సుమారు క్రీ.పూ. 1062

    అయితే ఆ దూతలు లోపలికి వచ్చి చూసినప్పుడు తల దగ్గర మేక వెంట్రుకలు ఉన్న ఒక విగ్రహం మంచం మీద కనబడింది.

  11. 1 సమూయేలు 19:17సుమారు క్రీ.పూ. 1062

    అప్పుడు సౌలు, “నా శత్రువు తప్పించుకునేలా అతన్ని పంపించివేసి ఎందుకు నన్ను మోసం చేశావు?” అని మీకాలును అడిగాడు. అందుకు మీకాలు, “నేనెందుకు నిన్ను చంపాలి? నన్ను వెళ్లనివ్వు” అని దావీదు తనతో అన్నాడని సౌలుతో చెప్పింది.

  12. 1 సమూయేలు 19:18సుమారు క్రీ.పూ. 1062

    అలా దావీదు తప్పించుకుని పారిపోయి రామాలో ఉన్న సమూయేలు దగ్గరకు వచ్చి సౌలు తనకు చేసినదంతా అతనికి చెప్పాడు. అప్పుడు అతడు అతనితో పాటు సమూయేలు బయలుదేరి నాయోతుకు వచ్చి అక్కడ నివసించారు.

  13. 1 సమూయేలు 19:19సుమారు క్రీ.పూ. 1062

    దావీదు రామా దగ్గర నాయోతులో ఉన్నాడని సౌలుకు వార్త వచ్చినప్పుడు,

  14. 1 సమూయేలు 19:20సుమారు క్రీ.పూ. 1062

    దావీదును పట్టుకోడానికి సౌలు దూతలను పంపాడు. వారు వచ్చి అక్కడ ప్రవక్తలు గుంపుగా చేరి ప్రవచించడం వారికి నాయకునిగా సమూయేలు నిలబడి ఉండడం చూసినప్పుడు దేవుని ఆత్మ సౌలు పంపిన సైనికుల మీదికి వచ్చి వారు కూడా ప్రవచించడం మొదలుపెట్టారు.

  15. 1 సమూయేలు 19:21సుమారు క్రీ.పూ. 1062

    ఈ సంగతి విన్న సౌలు మరి కొంతమందిని పంపించగా వారు కూడా ప్రవచించడం మొదలుపెట్టారు. సౌలు మూడవసారి కూడా దూతలను పంపాడు గాని వారు కూడా ప్రవచిస్తూ ఉన్నారు.

  16. 1 సమూయేలు 19:22సుమారు క్రీ.పూ. 1062

    చివరిగా, తానే రామాకు బయలుదేరి వెళ్లి సేకు దగ్గర ఉన్న పెద్ద బావి దగ్గరకు వచ్చి, “సమూయేలు, దావీదు ఎక్కడ ఉన్నారు?” అని అడిగాడు. వారు అతనితో, “రామా దగ్గర ఉన్న నాయోతులో ఉన్నారు” అని చెప్పారు.

  17. 1 సమూయేలు 19:23సుమారు క్రీ.పూ. 1062

    అతడు రామా దగ్గర ఉన్న నాయోతుకు వచ్చినప్పుడు దేవుని ఆత్మ అతని మీదికి కూడా వచ్చినందున అతడు నాయోతు చేరుకునేంత వరకు ప్రవచిస్తూనే నడిచాడు.

  18. 1 సమూయేలు 19:24సుమారు క్రీ.పూ. 1062

    అతడు తన వస్త్రాలను తీసివేసి సమూయేలు ఎదుటనే ప్రవచించాడు. అతడు ఆ రోజు రాత్రి పగలు పై బట్ట లేకుండా పడి ఉన్నాడు. అందువల్లనే, “సౌలు కూడా ప్రవక్తల్లో ఉన్నాడా?” అనే సామెత పుట్టింది.

  19. 1 సమూయేలు 20:1సుమారు క్రీ.పూ. 1062

    తర్వాత దావీదు రామాలోని నాయోతు నుండి పారిపోయి యోనాతాను దగ్గరకు వచ్చి, “నేనేమి చేశాను? నా నేరమేంటి? నా ప్రాణం తీయడానికి వెదికేంతగా నీ తండ్రి పట్ల నేను చేసిన పాపమేంటి?” అని అడిగాడు.

  20. 1 సమూయేలు 20:2సుమారు క్రీ.పూ. 1062

    అందుకు యోనాతాను, “నీవలా ఎప్పుడూ మాట్లాడకు! నా తండ్రి చిన్న పనైనా పెద్ద పనైనా నాకు చెప్పకుండా చేయడు. నా తండ్రి ఈ విషయం నా దగ్గర ఎందుకు దాస్తాడు?” అన్నాడు.

  21. 1 సమూయేలు 20:3సుమారు క్రీ.పూ. 1062

    అప్పుడు దావీదు, “నేను నీ దయ పొందానని నీ తండ్రికి ఖచ్చితంగా తెలుసు కాబట్టి అతడు ‘యోనాతాను బాధపడతాడు కాబట్టి అతనికి తెలియకూడదు’ అని అనుకుని ఉంటాడు. అయితే సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, నిజంగా నాకు మరణానికి మధ్య ఒక్క అడుగు మాత్రమే ఉంది” అని ప్రమాణం చేసి చెప్పాడు.

  22. 1 సమూయేలు 20:4సుమారు క్రీ.పూ. 1062

    యోనాతాను, “నీకోసం నేను ఏం చేయాలో చెప్పు అది నేను చేస్తాను” అని దావీదుతో చెప్పాడు.

  23. 1 సమూయేలు 20:5సుమారు క్రీ.పూ. 1062

    అందుకు దావీదు యోనాతానుతో, “రేపు అమావాస్య, అప్పుడు నేను తప్పకుండా రాజుతో పాటు కలిసి భోజనం చేయాలి; కాని ఎల్లుండి సాయంత్రం వరకు పొలంలో దాక్కోడానికి నాకు అనుమతి ఇవ్వు.

  24. 1 సమూయేలు 20:6సుమారు క్రీ.పూ. 1062

    నీ తండ్రీ నేను లేనని గమనించినప్పుడు నీవు అతనితో, ‘దావీదు వంశంవారు ప్రతి సంవత్సరం బలి అర్పించడం ఆనవాయితీగా వస్తుంది కాబట్టి అతడు తన ఊరైన బేత్లెహేముకు వెళ్లడానికి నా అనుమతి కోసం నన్ను బ్రతిమాలాడు’ అని చెప్పు.

  25. 1 సమూయేలు 20:7సుమారు క్రీ.పూ. 1062

    అప్పుడు అతడు, ‘అలాగే’ అని చెప్తే నీ సేవకుడనైన నేను క్షేమము. కానీ ఒకవేళ అతడు నా మీద తీవ్రంగా కోపపడితే అతడు నాకు హాని చేసే ఉద్దేశం కలిగి ఉన్నట్లు నీవు తెలుసుకుంటావు.