Journey of Israel Through The Desert గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
మోషే బయటకు వెళ్లి యెహోవా చెప్పిందంతా ప్రజలకు తెలియజేశాడు. డెబ్బైమంది గోత్ర పెద్దలను తెచ్చి మందిరం చుట్టూ నిలబెట్టాడు.
అప్పుడు యెహోవా మేఘంలో దిగివచ్చి అతనితో మాట్లాడారు. అతనిపై ఉన్న ఆత్మ శక్తిలో కొంత ఆ డెబ్బై గోత్ర పెద్దలపై ఉంచినప్పుడు ఆత్మ వారిమీద నిలిచి వారు ప్రవచించారు అయితే, తర్వాత ఎన్నడు ప్రవచించలేదు.
అయితే, ఇద్దరు, శిబిరంలోనే ఉండిపోయారు. వారి పేర్లు ఎల్దాదు, మేదాదు. వారు గోత్ర పెద్దలలో ఉన్నవారే, కానీ గుడారం బయటకు వెళ్లలేదు. అయినప్పటికీ ఆత్మ వారి మీద ఉంది, వారు శిబిరంలో ప్రవచించారు.
ఒక యువకుడు మోషే దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి, “ఎల్దాదు, మేదాదు శిబిరంలో ప్రవచిస్తున్నారు” అని చెప్పాడు.
నూను కుమారుడైన యెహోషువ, యవ్వనకాలం నుండి మోషే దగ్గరే ఉన్నవాడు, అతడు మాట్లాడుతూ, “మోషే, నా ప్రభువా, వారిని ఆపండి!” అని అన్నాడు.
కానీ మోషే అతనితో, “నా పక్షంగా నీవు అసూయపడుతున్నావా? నేనైతే యెహోవా ప్రజలంతా ప్రవక్తలు కావాలని, యెహోవా తన ఆత్మ వారందరి మీద ఉంచాలని కోరతాను!” అని జవాబిచ్చాడు.
తర్వాత మోషే, ఇశ్రాయేలు గోత్ర పెద్దలు, శిబిరానికి తిరిగి వెళ్లారు.
యెహోవా ఆజ్ఞ ప్రకారం మోషే వారిని పారాను ఎడారి నుండి పంపాడు. వారందరు ఇశ్రాయేలీయుల నాయకులు.
వారి పేర్లు ఇవి: రూబేను గోత్రం నుండి, జక్కూరు కుమారుడైన షమ్మూయ;
షిమ్యోను గోత్రం నుండి, హోరీ కుమారుడైన షాపాతు;
యూదా గోత్రం నుండి యెఫున్నె కుమారుడైన కాలేబు;
ఇశ్శాఖారు గోత్రం నుండి, యోసేపు కుమారుడైన ఇగాలు;
ఎఫ్రాయిం గోత్రం నుండి, నూను కుమారుడైన హోషేయ;
బెన్యామీను గోత్రం నుండి, రాఫు కుమారుడైన పల్తీ;
జెబూలూను గోత్రం నుండి, సోది కుమారుడైన గదీయేలు;
మనష్షే (యోసేపు గోత్రం) గోత్రం నుండి, సూసీ కుమారుడైన గద్దీ;
దాను గోత్రం నుండి, గెమలి కుమారుడైన అమ్మీయేలు;
ఆషేరు గోత్రం నుండి, మిఖాయేలు కుమారుడైన సెతూరు;
నఫ్తాలి గోత్రం నుండి, వోఫ్సీ కుమారుడైన నహబీ;
గాదు గోత్రం నుండి, మాకీ కుమారుడైన గెయుయేలు.
ఇవి వాగ్దాన దేశాన్ని చూడడానికి మోషే పంపిన వారి పేర్లు. (నూను కుమారుడైన హోషేయకు మోషే యెహోషువ అని పేరు పెట్టాడు.)
మోషే వారిని కనాను దేశాన్ని పరిశీలించమని పంపినప్పుడు, అతడు ఇలా చెప్పాడు, “మీరు దక్షిణ మార్గం గుండా వెళ్లి, కొండసీమ వైపు వెళ్లండి.
ఆ దేశం ఎలా ఉందో, అందులోని ప్రజలు బలవంతులా, బలహీనులా, తక్కువగా ఉన్నారా, ఎక్కువగా ఉన్నారా అని చూడండి.
వారు ఎలాంటి భూమిలో నివసిస్తున్నారు? అది మంచిదా చెడ్డదా? వారు ఎలాంటి పట్టణాల్లో నివసిస్తున్నారు? అవి కోటగోడలు లేనివా? లేదా కోటగోడలు కలవా?
ఆ దేశపు మట్టి ఎలా ఉంది? అది సారవంతమైనదా కాదా? అక్కడ చెట్లున్నాయా లేవా? అక్కడి పండ్లలో కొన్ని తీసుకురావడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నించండి.” (అది ప్రథమ ద్రాక్షపండ్ల కాలము.)