కంటెంట్‌కు వెళ్లండి

circa 1380–1050 BC

The Judges & Ruth

Israel cycles through rebellion, oppression, and rescue under charismatic leaders—culminating in Ruth's faithful love story.

703 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. న్యాయాధిపతులు 6:31సుమారు క్రీ.పూ. 1245

    యోవాషు తన చుట్టూ చేరి గొడవ చేస్తున్న గుంపుతో, “మీరు బయలు పక్షాన ఉన్నారా? అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారా? వాని పక్షాన వాదించేవారు తెల్లవారక ముందే చావాలి! ఒకవేళ బయలు నిజంగా దేవుడైతే, ఎవరైనా తన బలిపీఠం పడగొట్టినప్పుడు తాను పోరాడతాడు కదా” అని చెప్పాడు.

  2. న్యాయాధిపతులు 6:32సుమారు క్రీ.పూ. 1245

    గిద్యోను బయలు బలిపీఠాన్ని పడగొట్టాడు కాబట్టి ఆ రోజున అతనికి యెరుబ్-బయలు అని పేరు పెట్టి, “బయలును అతనితో వాదించుకోని” అని అన్నారు.

  3. న్యాయాధిపతులు 6:33సుమారు క్రీ.పూ. 1245

    మిద్యానీయులందరు, అమాలేకీయులందరు, ఇతర తూర్పున ఉన్న ప్రజలందరూ కలిసివచ్చి యొర్దాను దాటి యెజ్రెయేలు లోయలో బస చేశారు.

  4. న్యాయాధిపతులు 6:34సుమారు క్రీ.పూ. 1245

    అప్పుడు యెహోవా ఆత్మ గిద్యోను మీదికి రాగా, అతడు బూర ఊది అబీయెజెరు వంశస్థులను తనను వెంబడించుమని పిలుపునిచ్చాడు.

  5. న్యాయాధిపతులు 6:35సుమారు క్రీ.పూ. 1245

    అతడు మనష్షే వారి దగ్గరికి దూతను పంపి తనను కలవమని చెప్పాడు, అలాగే ఆషేరు, జెబూలూను, నఫ్తాలి వారి దగ్గరకు కూడా దూతలను పంపాడు.

  6. న్యాయాధిపతులు 6:36సుమారు క్రీ.పూ. 1245

    గిద్యోను దేవునితో, “మీరు వాగ్దానం చేసినట్టు నా ద్వారా ఇశ్రాయేలును రక్షించాలనుకుంటే,

  7. న్యాయాధిపతులు 6:37సుమారు క్రీ.పూ. 1245

    చూడండి, నేను నూర్పిడి కళ్ళం మీద గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడి నేలంతా పొడిగా ఉంటే, మీరు చెప్పినట్టు నా ద్వారా మీరు ఇశ్రాయేలును రక్షిస్తారని గ్రహిస్తాను” అన్నాడు.

  8. న్యాయాధిపతులు 6:38సుమారు క్రీ.పూ. 1245

    అలాగే జరిగింది. గిద్యోను మరుసటిరోజు ప్రొద్దున లేచి ఆ బొచ్చు మీద ఉన్న మంచును పిండినప్పుడు ఓ పాత్ర నిండా నీళ్లు వచ్చాయి.

  9. న్యాయాధిపతులు 6:39సుమారు క్రీ.పూ. 1245

    అప్పుడు గిద్యోను దేవునితో, “నా మీద కోప్పడకండి, ఇంకొక్కటే అడుగుతాను. గొర్రెబొచ్చుతో ఇంకొక పరీక్షకు నన్ను అనుమతించండి. అయితే ఈసారి గొర్రెబొచ్చు పొడిగా ఉండి నేలంతా మంచు పడాలి” అన్నాడు.

  10. న్యాయాధిపతులు 6:40సుమారు క్రీ.పూ. 1245

    ఆ రాత్రి దేవుడు అలానే చేశారు. నేలంతా మంచు పడింది కాని బొచ్చు పొడిగా ఉంది.

  11. న్యాయాధిపతులు 7:1సుమారు క్రీ.పూ. 1245

    అప్పుడు యెరుబ్-బయలు, అనగా గిద్యోను, అతని మనుష్యులందరు పెందలకడనే లేచి హరోదు బుగ్గ దగ్గర గుడారాలు వేసుకున్నారు. మిద్యానీయుల శిబిరం లోయలో మోరె కొండ దగ్గర వారికి ఉత్తరాన ఉంది.

  12. న్యాయాధిపతులు 7:2సుమారు క్రీ.పూ. 1245

    యెహోవా గిద్యోనుతో, “నీతో ఎక్కువ మంది మనుష్యులు ఉన్నారు కాబట్టి నేను మిద్యానును వారి చేతులకు అప్పగించను. ఒకవేళ అప్పగిస్తే వారు, ‘మా బాహుబలమే మమ్మల్ని రక్షించింది’ అని ఇశ్రాయేలీయులు అతిశయిస్తారు.

  13. న్యాయాధిపతులు 7:3సుమారు క్రీ.పూ. 1245

    కాబట్టి నీవు, ‘ఎవరు భయంతో వణకుతున్నారో, వారు వెంటనే గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్లవచ్చు అని ప్రకటించు’ ” అని చెప్పారు. అప్పుడు ఇరవైరెండువేలమంది తిరిగి వెళ్లిపోగా పదివేలమంది మిగిలారు.

  14. న్యాయాధిపతులు 7:4సుమారు క్రీ.పూ. 1245

    మరల యెహోవా గిద్యోనుతో, “మనుష్యులు ఇంకా ఎక్కువే ఉన్నారు. వారిని నీళ్ల దగ్గరకు తీసుకెళ్లు అక్కడ నీకోసం వారిని పరీక్షిస్తాను. ‘ఇతడు నీతో వెళ్తాడు’ అని నేను చెప్తే అతడు వెళ్లాలి; ఒకవేళ ‘ఇతడు నీతో వెళ్లడు’ అని నేను చెప్తే అతడు వెళ్లకూడదు” అని ఆజ్ఞాపించారు.

  15. న్యాయాధిపతులు 7:5సుమారు క్రీ.పూ. 1245

    కాబట్టి గిద్యోను మనుష్యులను నీళ్ల దగ్గరకు తీసుకుని వెళ్లాడు. అక్కడ యెహోవా అతనితో, “కుక్క గతుకునట్లు తన నాలుకతో నీళ్లను గతికే వారిని త్రాగడానికి మోకాళ్లమీద ఉన్నవారిని వేరు చేయి” అన్నారు.

  16. న్యాయాధిపతులు 7:6సుమారు క్రీ.పూ. 1245

    వారిలో చేతితో నోటికందించుకొని కుక్కల్లా గతికిన వారు మూడువందలమంది. మిగితా అందరు మోకాళ్లమీద వంగి నీళ్లు త్రాగారు.

  17. న్యాయాధిపతులు 7:7సుమారు క్రీ.పూ. 1245

    అప్పుడు యెహోవా గిద్యోనుతో, “గతికిన మూడువందల మనుష్యులతో నేను మిమ్మల్ని రక్షించి, మిద్యానీయులను మీ చేతులకు అప్పగిస్తాను. మిగిలినవారం తిరిగి వెళ్లిపోవాలి” అని ఆజ్ఞాపించారు.

  18. న్యాయాధిపతులు 7:8సుమారు క్రీ.పూ. 1245

    కాబట్టి గిద్యోను మిగితా ఇశ్రాయేలీయులను ఇంటికి పంపించాడు, అయితే మూడువందలమంది మనుష్యులు ఆహారాన్ని, బూరలను పట్టుకున్నారు. మిద్యాను దండు అతనికి క్రింద లోయలో దిగారు.

  19. న్యాయాధిపతులు 7:9సుమారు క్రీ.పూ. 1245

    ఆ రాత్రి యెహోవా గిద్యోనుతో, “నీవు లేచి మిద్యాను దండుపై దాడి చేయి, నేను నీ చేతులకు వారిని అప్పగిస్తున్నాను.

  20. న్యాయాధిపతులు 7:10సుమారు క్రీ.పూ. 1245

    ఒకవేళ దాడి చేయడానికి నీవు భయపడితే, నీ పనివాడైన పూరాయుతో వెళ్లు,

  21. న్యాయాధిపతులు 7:11సుమారు క్రీ.పూ. 1245

    వారు ఏం చెప్పుకుంటున్నారో విను. తర్వాత దండుపై దాడి చేయడానికి నీకు ధైర్యం వస్తుంది” అన్నారు. కాబట్టి అతడు, అతని పనివాడైన పూరా ఆ పాళెంలో ఉన్న స్థావరాల దగ్గరకు వెళ్లారు

  22. న్యాయాధిపతులు 7:12సుమారు క్రీ.పూ. 1245

    మిద్యానీయులు, అమాలేకీయులు, ఇతర తూర్పు జనాంగాలు లెక్కకు మిడతలవలె లోయలో విడిది చేశారు. వారి ఒంటెలు సముద్రతీరంలో ఇసుక రేణువుల్లా లెక్కించలేనంత ఉన్నాయి.

  23. న్యాయాధిపతులు 7:13సుమారు క్రీ.పూ. 1245

    గిద్యోను వచ్చినప్పుడు ఒక వ్యక్తి తాను కనిన కలను తన స్నేహితునికి చెబుతూ, “నాకు ఒక కల వచ్చింది. గుండ్రని యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోకి దొర్లుకుంటు వెళ్లి బలంగా గుడారానికి తగలగానే గుడారం తలక్రిందులై కూలిపోయింది” అని అన్నాడు.

  24. న్యాయాధిపతులు 7:14సుమారు క్రీ.పూ. 1245

    అతని స్నేహితుడు జవాబిస్తూ, “అది ఇశ్రాయేలీయుడైనా యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమే గాని ఇంకొకటి కాదు. దేవుడు మిద్యానీయుల దండు అంతటిని అతని చేతులకు అప్పగించారు” అన్నాడు.

  25. న్యాయాధిపతులు 7:15సుమారు క్రీ.పూ. 1245

    గిద్యోను ఆ కలను దాని భావాన్ని విని తలవంచి నమస్కరించి ఇశ్రాయేలు దండు దగ్గరకు తిరిగివెళ్లి, “లేవండి, యెహోవా మిద్యానీయుల సైన్యాన్ని మీకు అప్పగించారు” అని చెప్పాడు.