కంటెంట్‌కు వెళ్లండి

Paul గురించి బైబిల్ వచనాలు

619 వచనాలు · 103 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. “ ‘ప్రభువా, నేను ఏమి చేయాలి?’ అని అడిగాను. “అప్పుడు ‘నీవు లేచి, దమస్కు పట్టణంలోనికి వెళ్లు, అక్కడ నీవు ఏమి చేయాలని నేను నిర్ణయించానో నీకు తెలియజేస్తాను’ అని చెప్పాడు.

  2. ప్రకాశమానమైన ఆ వెలుగు నన్ను గ్రుడ్డివానిగా చేసినందుకు, నాతో ఉన్నవారు నా చేతిని పట్టుకుని దమస్కు పట్టణంలోనికి నడిపించారు.

  3. “అక్కడ అననీయ అనే ఒక వ్యక్తి నన్ను చూడడానికి వచ్చాడు. అతడు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ యూదులందరి చేత మంచి పేరు పొందిన భక్తిపరుడు.

  4. అతడు నా ప్రక్కన నిలబడి, ‘సహోదరుడా సౌలు చూపుపొందుకో!’ అన్నాడు. వెంటనే నేను అతన్ని చూడగలిగాను.

  5. “అప్పుడు అతడు, ‘మన పితరుల దేవుడు తన చిత్తాన్ని తెలుసుకోవడానికి, నీతిమంతుని చూడడానికి ఆయన నోటి మాటలను వినడానికి నిన్ను ఎన్నుకున్నాడు.

  6. నీవు చూసి వినిన దాని గురించి ప్రజలందరికి చెప్పే సాక్షిగా ఉంటావు.

  7. నీవు ఇంకా దేనికోసం ఎదురు చూస్తున్నావు? లేచి, ప్రభువు పేరున ప్రార్థనచేసి, బాప్తిస్మం పొంది నీ పాపాలను కడిగివేసుకో అని చెప్పాడు.’

  8. “నేను యెరూషలేముకు తిరిగివచ్చి, దేవాలయంలో ప్రార్థిస్తున్నప్పుడు, నేను స్వాప్నిక స్థితిలోనికి వెళ్లి,

  9. ప్రభువు నాతో మాట్లాడడం చూశాను. ఆయన, ‘త్వరగా! నీవు వెంటనే యెరూషలేమును విడిచి వెళ్లు, ఎందుకంటే, నా గురించి నీవు ఇచ్చే సాక్ష్యం ఇక్కడి ప్రజలు అంగీకరించరు’ అని చెప్పారు.

  10. “అందుకు నేను, ‘ప్రభువా, నేను ఒక సమాజమందిరం నుండి మరొక సమాజమందిరానికి వెళ్తూ, నిన్ను నమ్మినవారిని చెరసాలలో వేయించి హింసించానని నీకు తెలుసు.

  11. నీకోసం హతసాక్షిగా చనిపోయిన స్తెఫెను రక్తం చిందినప్పుడు నేను అక్కడే నిలబడి దానికి సమ్మతించి, అతన్ని చంపిన వారి వస్త్రాలకు కాపలాగా ఉన్నానని తెలుసు కదా’ అన్నాను.

  12. “అప్పుడు ప్రభువు నాతో, ‘నీవు వెళ్లు, నేను నిన్ను వీరినుండి దూరంగా యూదేతరుల దగ్గరకు పంపిస్తాను’ అని చెప్పారు.”

  13. పౌలు చెప్పిందంతా ఆ ప్రజలు విని, “వీనిని భూమి మీద ఉండకుండ చేయండి! ఇలాంటివాడు బ్రతుక కూడదు!” అని బిగ్గరగా కేకలు వేశారు.

  14. ఇతడు దైవదూషణ చేస్తున్నాడని కేకలువేస్తూ తమ వస్త్రాలను విసిరివేస్తూ, దుమ్మెత్తి ఆకాశంలోనికి పోస్తున్నప్పుడు,

  15. సైన్యాధిపతి పౌలును సైనిక కోటలోకి తీసుకెళ్లి, ప్రజలు అతని గురించి ఎందుకు అలా కేకలు వేస్తున్నారో తెలుసుకోవడానికి అతన్ని కొరడాలతో కొట్టించి, విచారించమని ఆదేశించాడు.

  16. వారు అతన్ని కొరడాలతో కొట్టడానికి ఈడ్చుకొని వెళ్తున్నప్పుడు, అక్కడ నిలబడి ఉన్న శతాధిపతితో పౌలు, “ఏ నేరం నిరూపించకుండానే ఒక రోమీయుని కొరడాలతో కొట్టించడం మీకు న్యాయమేనా?” అన్నాడు.

  17. అది విన్న ఆ శతాధిపతి, తన అధిపతి దగ్గరకు వెళ్లి అతనితో, “మీరేమి చేస్తున్నారు? ఈ వ్యక్తి రోమీయుడు” అని చెప్పాడు.

  18. ఆ అధిపతి పౌలు దగ్గరకు వెళ్లి, “నీవు రోమీయుడవా?” అని అడిగాడు. “అవును, నేను రోమీయుడనే” అని సమాధానం ఇచ్చాడు.

  19. అప్పుడు ఆ అధిపతి, “నేను నా రోమా పౌరసత్వాన్ని పొందడానికి ఎంతో వెల చెల్లించాను” అన్నాడు. దానికి పౌలు, “నేను పుట్టుకతోనే రోమీయుడను” అని సమాధానం చెప్పాడు.

  20. అతన్ని విచారణ చేయబోయేవారు వెంటనే అతన్ని విడిచిపెట్టారు. గొలుసులతో బంధించిన పౌలు రోమీయుడని తెలుసుకొన్న తర్వాత అధిపతి కూడా భయపడ్డాడు.

  21. ఆ అధిపతి పౌలు ఎందుకు యూదులచేత నిందింపబడుతున్నాడో సరిగా తెలుసుకోవాలనుకున్నాడు. మరుసటిరోజు అతన్ని విడిచిపెట్టి, ముఖ్య యాజకులను యూదుల న్యాయసభ సభ్యులందరిని సమావేశమవ్వమని ఆదేశించి పౌలును వారి ముందు నిలబెట్టాడు.

  22. పౌలు న్వాయసభ వారిని సూటిగా చూసి, “నా సహోదరులారా, ఈ రోజు వరకు నేను నా మంచి మనస్సాక్షితో దేవుడు నాకు ఇచ్చిన కర్తవ్యాన్ని పూర్తి చేశాను” అని చెప్పాడు.

  23. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ, పౌలుకు దగ్గరగా నిలబడి ఉన్నవానితో, అతని నోటి మీద కొట్టమని ఆదేశించాడు.

  24. అప్పుడు పౌలు అతనితో, “ఓ సున్నం కొట్టిన గోడా, దేవుడు నిన్ను కొడతాడు! ధర్మశాస్త్రం ప్రకారం నాకు తీర్పు తీర్చడానికి అక్కడ కూర్చుని, నన్ను కొట్టమని ఆదేశించి నీవు ధర్మశాస్త్ర ఆజ్ఞలను అతిక్రమిస్తున్నావు!” అన్నాడు.

  25. పౌలుకు దగ్గరగా నిలబడినవారు, “దేవుని ప్రధాన యాజకుని విమర్శించడానికి నీకెంత ధైర్యం!” అన్నారు.