Skip to content

Judgments గురించి బైబిల్ వచనాలు: Upon Eli's house

23 వచనాలు · 91 కోణాలు

Upon Eli's house గురించి వచనాలు

  1. తర్వాత ఒక దైవజనుడు ఏలీ దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, “యెహోవా చెప్పే మాట ఇదే: ‘నీ పూర్వికుల కుటుంబం ఈజిప్టులో ఫరో క్రింద ఉన్నప్పుడు నన్ను నేను వారికి బయలుపరచుకోలేదా?

  2. అతడు నా సన్నిధిలో నాకు యాజకునిగా ఉండి ఏఫోదు ధరించి, నా బలిపీఠం దగ్గరకు వెళ్లి ధూపం వేయడానికి ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటిలో నుండి నేను నీ పూర్వికున్ని ఏర్పరచుకున్నాను. ఇశ్రాయేలీయులు అర్పించిన హోమబలులన్నిటిని నీ పూర్వికుని కుటుంబానికి ఇచ్చాను.

  3. నా నివాసం కోసం నేను నిర్దేశించిన నా బలిని, అర్పణను ఎందుకు తృణీకరిస్తున్నారు? నా ప్రజలైన ఇశ్రాయేలీయులు అర్పించే ప్రతి అర్పణలో శ్రేష్ఠమైన భాగాలతో క్రొవ్వెక్కేలా చేసుకుని ఎందుకు నీవు నా కంటే నీ కుమారులను ఎక్కువగా గౌరవిస్తున్నావు?’

  4. “కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా, ‘నీ కుటుంబం, నీ పితరుల కుటుంబం నా సన్నిధిలో నిత్యం సేవ చేస్తారని నేను వాగ్దానం చేశాను’ అని చెప్పారు కాని ఇప్పుడు యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు: ‘అది నా నుండి దూరమవును గాక! నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించేవారు తృణీకరించబడతారు.

  5. వృద్ధాప్యం వచ్చేవరకు ఎవరూ దానిలో ఉండకుండ నేను నీ బలాన్ని నీ యాజక కుటుంబ బలాన్ని తగ్గించే సమయం రాబోతుంది,

  6. నా నివాసంలో అపాయం రావడం నీవు చూస్తావు. ఇశ్రాయేలుకు మేలు జరిగినప్పటికీ, మీ కుటుంబంలో ఎవరూ వృద్ధాప్యానికి చేరుకోరు.

  7. నా బలిపీఠం దగ్గర ఎవరూ సేవ చేయకుండా నేను నాశనం చేసే నీ వారి వలన నీ కళ్ళు మసకబారతాయి, నీ బలం క్షీణించిపోతుంది. నీ సంతానమంతా యవ్వన వయస్సులో ఉండగానే చస్తారు.

  8. “ ‘మీ ఇద్దరు కుమారులు హొఫ్నీ ఫీనెహాసులకు ఏమి జరుగుతుందో తెలియడానికి ఒక సూచనగా వారిద్దరు ఒకేరోజున చనిపోతారు.

  9. తర్వాత నా హృదయంలో, మనస్సులో ఉన్నదాని ప్రకారం చేసే నమ్మకమైన యాజకుడిని నా కోసం నేను లేవనెత్తుతాను. నేను అతని యాజక కుటుంబాన్ని స్థిరపరుస్తాను, వారు ఎల్లప్పుడూ నా అభిషిక్తుని ఎదుట సేవ చేస్తారు.

  10. అప్పుడు మీ కుటుంబంలో మిగిలిన ప్రతి ఒక్కరూ వచ్చి ఒక వెండి ముక్క కోసం రొట్టె కోసం అతని ముందు నమస్కరించి, “నాకు తినడానికి ఆహారం లేక కష్టంగా ఉంది, నన్ను ఏదైనా యాజక సేవలో నియమించండి” ’ అని వేడుకుంటారు.”

  11. కాబట్టి ఫిలిష్తీయులు యుద్ధం చేశారు, ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరు తమ గుడారాలకు పారిపోయారు. అప్పుడు భయంకరమైన వధ జరిగింది; ఇశ్రాయేలీయులలో ముప్పైవేలమంది సైనికులు చనిపోయారు.

  12. దేవుని మందసం స్వాధీనం చేసుకోబడింది, ఏలీ ఇద్దరు కుమారులైన హొఫ్నీ, ఫీనెహాసులు చనిపోయారు.

  13. ఆ రోజే ఒక బెన్యామీనీయుడు యుద్ధభూమిలో నుండి పరుగెత్తుకుని వచ్చి చినిగిన బట్టలతో తలమీద దుమ్ముతో షిలోహులోనికి వచ్చాడు.

  14. అతడు వచ్చేటప్పటికి, ఏలీ మార్గం ప్రక్కన తన కుర్చీలో చూస్తూ కూర్చున్నాడు, ఎందుకంటే అతని హృదయం దేవుని మందసాన్ని గురించిన భయంతో నిండింది. ఆ వ్యక్తి పట్టణంలోకి ప్రవేశించి జరిగిన విషయం చెప్పగానే పట్టణమంతా కేకలు వేసింది.

  15. ఏలీ ఆ కేకలు విని, “ఈ కేకలకు అర్థమేంటి?” అని అడిగాడు. ఆ వ్యక్తి వెంటనే ఏలీ దగ్గరకు వచ్చి విషయం చెప్పాడు.

  16. ఏలీకి తొంభై ఎనిమిది సంవత్సరాల వయస్సు, అతనికి చూపు మందగించి చూడలేకపోయేవాడు.

  17. అతడు ఏలీతో, “యుద్ధభూమి నుండి వచ్చినవాన్ని నేనే, ఈ రోజే నేను యుద్ధంలో నుండి పరుగెత్తుకొని వచ్చాను” అని చెప్పాడు. అప్పుడు ఏలీ, “నా కుమారుడా, ఏమి జరిగింది?” అని అడిగాడు.

  18. అందుకు ఆ వార్త తెచ్చిన అతడు, “ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ముందు నిలబడలేక పారిపోయారు. సైన్యంలో అనేకమంది చంపబడ్డారు. నీ ఇద్దరు కుమారులైన హొఫ్నీ ఫీనెహాసులు కూడా చంపబడ్డారు. దేవుని మందసాన్ని శత్రువులు స్వాధీనం చేసుకున్నారు” అని చెప్పాడు.

  19. దేవుని మందసం గురించి అతడు చెప్పగానే, ఏలీ గుమ్మం దగ్గర ఉన్న తన కుర్చీమీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాడు. ఎందుకంటే అతడు ముసలివాడు, భారీకాయుడు. అతడు నలభై సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు.

  20. ఏలీ కోడలైన ఫీనెహాసు భార్య ప్రసవ సమయం దగ్గరపడిన గర్భవతి. దేవుని మందసాన్ని శత్రువులు స్వాధీనం చేసుకున్నారని, తన మామ, తన భర్త చనిపోయారని ఆమె విని, పురిటినొప్పులు వచ్చి, మోకాళ్లమీద కూలబడి ప్రసవించింది. ఆమె ఆ పురిటినొప్పులు తట్టుకోలేకపోయింది.

  21. ఆమె చనిపోతుండగా, అక్కడ నిలబడి ఉన్న స్త్రీలు ఆమెతో, “భయపడకు, నీకు కుమారుడు పుట్టాడు” అని చెప్పారు, కాని ఆమె జవాబు ఇవ్వలేదు, ఆ మాటలు పట్టించుకోలేదు.

  22. ఆమె దేవుని మందసాన్ని శత్రువులు స్వాధీనం చేసుకున్నారని, తన మామ, తన భర్త చనిపోయారని తెలుసుకొని, “ఇశ్రాయేలీయులలో నుండి మహిమ వెళ్లిపోయింది” అని అంటూ తన కుమారునికి ఈకాబోదు అని పేరు పెట్టింది.

  23. “దేవుని మందసాన్ని శత్రువులు స్వాధీనం చేసుకోవడం వలన, ఇశ్రాయేలీయులలో నుండి మహిమ వెళ్లిపోయింది” అని ఆమె చెప్పింది.