కంటెంట్‌కు వెళ్లండి

Liberality గురించి బైబిల్ వచనాలు

149 వచనాలు · 55 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్నవారితో, “నా తండ్రి ఆశీర్వాదం పొందిన వారలారా; రండి! లోకం సృజింపబడినప్పటి నుండి మీ కోసం సిద్ధపరచి ఉంచిన మీ వారసత్వ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి.

  2. ఎందుకంటే, నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టారు, నేను దప్పికతో ఉన్నప్పుడు మీరు నాకు త్రాగడానికి ఇచ్చారు. నేను పరదేశిగా ఉన్నప్పుడు మీరు నన్ను మీ ఇంట్లోకి చేర్చుకొన్నారు.

  3. నాకు బట్టలు లేనప్పుడు మీరు నాకు బట్టలు ఇచ్చారు. నేను రోగిగా ఉన్నప్పుడు మీరు నన్ను చూసుకున్నారు. నేను చెరసాలలో ఉన్నప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి నన్ను పరామర్శించారు” అని చెప్తాడు.

  4. “అప్పుడు ఆ నీతిమంతులు, ‘ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలితో ఉన్నావని చూసి ఆహారం పెట్టాం? ఎప్పుడు దప్పికతో ఉన్నావని చూసి నీ దాహం తీర్చాము?

  5. ఎప్పుడు నీవు పరదేశివని చూసి నిన్ను మా ఇంట్లోకి చేర్చుకున్నాము? ఎప్పుడు బట్టలు లేకపోవడం చూసి బట్టలు ఇచ్చాము?

  6. ఎప్పుడు నిన్ను రోగిగా చూసి లేదా చెరసాలలో చూసి పరామర్శించాము?’ అని ఆయనను అడుగుతారు.

  7. “అందుకు ఆ రాజు, ‘ఈ నా సహోదర సహోదరీలలో బహు అల్పులైనవారికి చేశారు కాబట్టి, నాకు చేసినట్లే అని ఖచ్చితంగా మీతో చెప్తున్నాను’ అని వారితో అంటాడు.

  8. కాని ఒక బీద విధవరాలు వచ్చి రెండు చిన్న కాసులను ఆ పెట్టెలో వేసింది.

  9. యేసు తన శిష్యులను దగ్గరకు పిలిచి, “నేను మీతో నిజంగా చెప్తున్న, కానుక పెట్టెలో అందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసింది.

  10. వారందరు తమకు కలిగిన సమృద్ధిలో నుండి కొంత వేశారు, కాని ఈమె తన పేదరికం నుండి తన జీవనాధారమంతా వేసింది” అని అన్నారు.

  11. అందుకు జనసమూహం, “అయితే మేము ఏమి చేయాలి?” అని అడిగారు.

  12. అందుకు యోహాను, “రెండు చొక్కాలు ఉన్నవాడు ఏమిలేని వానికి ఇవ్వాలి, ఆహారం కలవాడు కూడా అలాగే చేయాలి” అన్నాడు.

  13. మీ ఆస్తులను అమ్మి బీదలకు ఇవ్వండి. మీ కోసం పాతగిల్లని డబ్బు సంచులను ఏర్పరచుకోండి, పరలోకంలో ధనం ఎప్పటికీ తరిగిపోదు, అక్కడ ఏ దొంగ సమీపించలేడు, ఏ చిమ్మెట కొట్టివేయలేదు.

  14. ఎందుకంటే ఎక్కడ మీ ధనం ఉంటుందో, అక్కడే మీ హృదయం ఉంటుంది.

  15. ప్రభువు ప్రజల కోసం కానుక పోగుచేయడం గురించి గలతీయలోని సంఘాలకు నేను ఏమి చేయమని చెప్పానో మీరు కూడా అది చేయాలి.

  16. ప్రతి వారంలో మొదటి రోజున మీలో ప్రతి ఒక్కరు మీ సంపాదన బట్టి కొంత ధనాన్ని ప్రక్కన పెట్టి దాచి ఉంచండి. దానివల్ల నేను వచ్చినపుడు కానుకలు సేకరించాల్సిన అవసరం ఉండదు.

  17. నేను వచ్చిన తర్వాత, మీరు ఆమోదించిన వారికి నేను పరిచయ పత్రికలను ఇచ్చి, మీ కానుకలతో వారిని యెరూషలేముకు పంపుతాను.

  18. సహోదరీ సహోదరులారా, మాసిదోనియా ప్రాంతంలోని సంఘాలకు అనుగ్రహించబడిన దేవుని కృప గురించి మీరు తెలుసుకోవాలని మేము కోరుతున్నాము.

  19. చాలా తీవ్రమైన పరీక్షల మధ్యలో కూడా అత్యధికమైన ఆనందాన్ని వారు పొందారు, వారు నిరుపేదలైనా విస్తారమైన దాతృత్వాన్ని కలిగి ఉన్నారు.

  20. ఎందుకంటే, తాము ఇవ్వగలిగిన దానికన్నా, తమ సామర్థ్యాన్ని మించి వారు ఇచ్చారని నేను సాక్ష్యమిస్తాను.

  21. ప్రభువు ప్రజలకు పరిచర్య చేయడంలో పాలుపంచుకునే ఆధిక్యత అత్యవసరమని వారు మమ్మల్ని బ్రతిమాలారు.

  22. వారు మా అంచనాలను అధిగమించారు: మొదటిగా తమను తాము ప్రభువుకు అర్పించుకున్నారు, ఆ తర్వాత దేవుని చిత్తాన్ని బట్టి మాకు కూడ తమను అర్పించుకున్నారు.

  23. అయితే మీరు విశ్వాసంలో, వాక్యంలో, జ్ఞానంలో, ఆసక్తిలో, మాపై మీకు గల ప్రేమలో శ్రద్ధలో ఎలా వృద్ధి చెందుతున్నారో అలాగే మీరు ధారాళంగా ఇవ్వడంలో కూడా వృద్ధిచెందేలా చూసుకోండి.

  24. ఆజ్ఞాపించి మీకు చెప్పడం లేదు, కాని సహాయం చేయడంలో ఇతరుల ఆసక్తితో పోల్చి మీ ప్రేమ ఎంత నిజమైనదో పరీక్షించాలనుకుంటున్నాను.

  25. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప ఎలాంటిదో మీకు తెలుసు. ఆయన ధనవంతుడైనా తన పేదరికం ద్వారా మిమ్మల్ని ధనవంతులను చేయడానికి మీ కోసం ఆయన పేదవానిగా అయ్యారు.