కంటెంట్‌కు వెళ్లండి

Church (2) గురించి బైబిల్ వచనాలు

158 వచనాలు · 7 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ప్రజలను సమకూర్చండి, సమావేశాన్ని ప్రతిష్ఠించండి; పెద్దలను రప్పించండి, పిల్లలను సమకూర్చండి, చంటి పిల్లలను కూడా తీసుకురండి. పెళ్ళికుమారుడు తన గదిని పెళ్ళికుమార్తె తన పెద్ద గదిని విడిచి రావాలి.

  2. యెహోవా ఎదుట సేవచేసే యాజకులు మంటపానికి బలిపీఠానికి మధ్య నిలబడి ఏడ్వాలి. వారు, “యెహోవా! మీ ప్రజలను కనికరించండి. మీ స్వాస్థ్యమైన వారిని అవమాన పడనివ్వకండి వారు దేశాల మధ్య హేళన చేయబడకూడదు. ‘వీరి దేవుడు ఎక్కడ?’ అని ప్రజలు ఎందుకు అనుకోవాలి?”

  3. అయితే ఆయన వారిని, “మరి మీరు ఏమనుకుంటున్నారు?” అని అడిగారు.

  4. అందుకు సీమోను పేతురు, “నీవు క్రీస్తువు, సజీవుడైనా దేవుని కుమారుడవు” అని చెప్పాడు.

  5. అందుకు యేసు, “యోనా కుమారుడా సీమోను, నీవు ధన్యుడవు, రక్తమాంసములున్న వారి ద్వారా నీకు తెలియపరచబడలేదు, కానీ పరలోకంలో ఉన్న నా తండ్రి ఈ సంగతిని నీకు తెలియజేశారు.

  6. నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, దాని ముందు పాతాళలోక ద్వారాలు నిలువలేవని నేను నీతో చెప్తున్నాను.

  7. వీటి కంటే మీమీద ఎక్కువ భారం మోపకూడదని పరిశుద్ధాత్మకు, మాకు అనిపించిన విషయాలు ఏమనగా:

  8. విగ్రహాలకు అర్పించిన ఆహారాన్ని తినడం, రక్తం తినడం, గొంతును నులిమి చంపిన జంతువుల మాంసం తినడం, లైంగిక అనైతికత సంబంధాలను మానుకోవాలి. వీటికి దూరంగా ఉండి జాగ్రత్త పడితే మీకు మేలు కలుగుతుంది. మీకు క్షేమం కలుగును గాక.

  9. నా సహోదరీ సహోదరులారా, మీలో కలహాలు ఉన్నాయని క్లోయె ఇంటివారిలో కొందరు నాకు తెలియజేశారు.

  10. నేను చెప్పేది ఏంటంటే: మీలో “నేను పౌలును అనుసరిస్తున్నానని” ఒకరు, “నేను అపొల్లోను అనుసరిస్తున్నానని” వేరొకరు, “నేను కేఫాను అనుసరిస్తున్నానని” మరొకరు, “నేను క్రీస్తును అనుసరిస్తున్నానని” మరి ఇంకొకరు చెప్పుకుంటున్నారని విన్నాను.

  11. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కోసం సిలువ వేయబడ్డాడా? మీరు పౌలు పేరట బాప్తిస్మం పొందారా?

  12. మీరు ఇంకా లోకస్థులుగానే ఉన్నారు. మీలో అసూయ, కొట్లాటలు ఉన్నాయి. కాబట్టి మీరు శరీర స్వభావంతో సాధారణ మానవుల్లా జీవించడం లేదా?

  13. మీలో, “నేను పౌలును అనుసరిస్తున్నాను” అని ఒకరు, “నేను అపొల్లోను అనుసరిస్తున్నాను” అని ఇంకొకరు చెప్పుకుంటూ ఉన్నప్పుడు మీరు సాధారణ మానవుల్లా లేరా?

  14. మొదటి విషయం, మీరు దేవుని సంఘంగా ఒకచోట చేరినప్పుడు మీలో విభేదాలు ఉన్నాయని నేను విన్నాను. ఇది కొంతవరకు నిజమని నేను నమ్ముతున్నాను.

  15. మీలో ఎవరు దేవుని ఆమోదం పొందారో తెలియడానికి మీ మధ్యలో అభిప్రాయ భేదాలు ఉండవలసిందే.

  16. ఎందుకంటే నేను వచ్చినపుడు నేను కోరుకున్నట్లుగా మీరు ఉండకపోవచ్చు, అలాగే మీరు కోరుకున్నట్లుగా నేను ఉండకపోవచ్చు. అక్కడ కలహాలు, అసూయలు, క్రోధాలు, కక్షలు, వదంతులు, గుసగుసలు, గర్వం, అల్లర్లు ఉంటాయేమోనని భయపడుతున్నాను.

  17. మరల నేను వచ్చినప్పుడు దేవుడు మీ ముందు నన్ను చిన్నబుచ్చుకునేలా చేస్తాడేమోనని భయపడుతున్నాను, అంతేగాక గతంలో పాపం చేసి జరిగించిన అపవిత్రత, లైంగిక పాపం, పోకిరి చేష్టల గురించి పశ్చాత్తాపం చెందని వారి గురించి కూడ నేను దుఃఖపడాల్సి వస్తుందేమో అని భయపడుతున్నాను.

  18. దేవుడు సమస్తాన్ని క్రీస్తు పాదాల క్రింద ఉంచి, సమస్తానికి పైన సంఘానికి ఆయనను శిరస్సుగా నియమించారు.

  19. సంఘం అనగా ఆయన శరీరం; సమస్తాన్ని పూర్తిగా నింపుతున్న ఆయన యొక్క పరిపూర్ణత.

  20. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయిగా అపొస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడియున్నారు.

  21. ఆ కట్టడమంతా ఆయనలో ఒకటిగా అమర్చబడి ప్రభువులో పరిశుద్ధాలయంగా వృద్ధిపొందుతూ ఉంది.

  22. ఈ విధంగా ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాసస్థలంగా కట్టబడుతున్నారు.

  23. క్రీస్తు సంఘానికి శిరస్సై ఉన్నట్లుగా భర్త భార్యకు శిరస్సై ఉన్నాడు. ఆయన శిరస్సుగా తన శరీరానికి రక్షకుడై ఉన్నారు.

  24. సంఘం క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ భర్తలకు లోబడాలి.

  25. క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి దాని కోసం తనను తాను అప్పగించుకున్నట్లుగా, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి.