Skip to content

Armies గురించి బైబిల్ వచనాలు

207 వచనాలు · 77 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఆ ఫిలిష్తీయుడు నలభైరోజుల వరకు ప్రతి ఉదయం సాయంత్రం వచ్చి నిలబడేవాడు.

  2. యెష్షయి తన కుమారుడైన దావీదును పిలిచి, “నీ అన్నల కోసం ఒక ఏఫా వేయించిన గోధుమలు, ఈ పది రొట్టెలను తీసుకుని శిబిరంలో ఉన్న నీ అన్నల దగ్గరకు తొందరగా వెళ్లు.

  3. అలాగే ఈ పది జున్నుముక్కలు తీసుకెళ్లి వారి సేనాధిపతికి ఇవ్వు. నీ అన్నల క్షేమాన్ని తెలుసుకొని రా.

  4. వారు సౌలుతో ఉన్నారు; ఇశ్రాయేలీయులందరు ఏలహు లోయలో ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తున్నారు” అని చెప్పి పంపించాడు.

  5. దావీదు ఉదయాన్నే లేచి ఒక కాపరికి గొర్రెలు అప్పగించి ఆ వస్తువులను తీసుకుని యెష్షయి తనకు చెప్పిన ప్రకారం బయలుదేరి వెళ్లాడు. అయితే అతడు యుద్ధభూమి దగ్గరకు వచ్చేసరికి సైన్యమంతా బారులు తీరి నినాదాలు చేస్తూ యుద్ధభూమికి వస్తున్నారు.

  6. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులు ఒకరికి ఎదురుగా ఒకరు నిలబడి యుద్ధానికి సిద్ధపడుతున్నారు.

  7. దావీదు తాను తెచ్చిన వస్తువులను సామాన్లు భద్రపరిచేవానికి అప్పగించి పరుగెత్తి వెళ్లి యుద్ధభూమిలో ఉన్న తన అన్నలను వారి క్షేమం అడిగాడు.

  8. అతడు వారితో మాట్లాడుతుండగా గాతుకు చెందిన ఫిలిష్తీయుడైన గొల్యాతు అనే శూరుడు ఫిలిష్తీయుల సైన్యంలో నుండి వచ్చి రోజు చేసినట్లే ఆ రోజు కూడా సవాలు చేస్తూ ఉండగా దావీదు విన్నాడు.

  9. ఇశ్రాయేలీయులందరు అతన్ని చూసి చాలా భయపడి అతని దగ్గర నుండి పారిపోయారు.

  10. ఇశ్రాయేలీయులలో ఒకడు, “వస్తున్న ఆ వ్యక్తిని చూశారా, ఇశ్రాయేలీయులను ఎదిరించడానికే అతడు వస్తున్నాడు. అయితే అతన్ని చంపినవాన్ని రాజు గొప్ప ధనవంతునిగా చేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి అతని కుటుంబం ఇశ్రాయేలులో పన్నులు కట్టే అవసరం లేకుండ చేస్తారు” అని చెప్పాడు.

  11. అప్పుడు దావీదు తన దగ్గర నిలబడినవారిని, “సజీవుడైన దేవుని సైన్యాన్ని ఎదిరించడానికి సున్నతిలేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటివాడు? వానిని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ అవమానాన్ని తొలగించిన వానికి ఏ బహుమతి ఇస్తారు?” అని అడిగాడు.

  12. అందుకు ఆ సైనికులు, “వానిని చంపినవానికి ఇలా చేస్తారు” అని అతనికి చెప్పారు.

  13. దావీదు వారితో మాట్లాడిన మాటలు అతని పెద్దన్న ఏలీయాబు విని దావీదు మీద కోప్పడి అతనితో, “నీవు ఇక్కడకు ఎందుకు వచ్చావు? అరణ్యంలో ఉన్న ఆ చిన్న గొర్రెల మందను ఎవరికి అప్పగించావు? నీకు ఎంత అహంకారమో నీది ఎంత చెడ్డ హృదయమో నాకు తెలుసు! యుద్ధం చూడడానికే గదా నీవు వచ్చావు” అన్నాడు.

  14. అందుకు దావీదు, “నేనేమి చేశాను? నేనేమి మాట్లాడకూడదా?” అని అడిగి,

  15. అతని దగ్గర నుండి వెళ్లి మరొకరిని మరలా అదే ప్రశ్న అడిగాడు. వారు కూడా అదే జవాబిచ్చారు.

  16. దావీదు మాటలు విన్న మరికొందరు వాటిని సౌలుకు చెప్పినప్పుడు అతడు దావీదును పిలిపించాడు.

  17. దావీదు సౌలుతో, “ఈ ఫిలిష్తీయుని చూసి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. మీ సేవకుడనైన నేను వెళ్లి వానితో పోరాడతాను” అన్నాడు.

  18. అందుకు సౌలు దావీదుతో, “ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోరాడటానికి నీ బలం సరిపోదు. నీవు ఇంకా చిన్నపిల్లవాడివి! అతడు చిన్నప్పటి నుండే యుద్ధవీరుడు” అని చెప్పాడు.

  19. అందుకు దావీదు సౌలుతో, “మీ సేవకుడనైన నేను నా తండ్రి గొర్రెలను కాస్తుండగా ఒక సింహం ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకుపోతుంటే,

  20. నేను దానిని తరిమి చంపి దాని నోటిలో నుండి ఆ గొర్రెను విడిపించాను. అది నా మీద దాడి చేసినప్పుడు దాని గడ్డం పట్టుకుని కొట్టి చంపాను.

  21. మీ సేవకుడనైన నేను సింహాన్ని ఎలుగుబంటిని చంపాను. సజీవుడైన దేవుని సైన్యాలను అవమానిస్తున్న ఈ సున్నతిలేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక దానిలా అవుతాడు.

  22. దావీదు ఇంకా మాట్లాడుతూ, సింహపు పంజానుండి ఎలుగుబంటి చేతిలో నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపిస్తారు” అన్నాడు. అప్పుడు సౌలు, “వెళ్లు, యెహోవా నీకు తోడుగా ఉంటారు” అని దావీదుతో అన్నాడు.

  23. సౌలు తన యుద్ధ వస్త్రాలను, యుద్ధకవచాన్ని దావీదుకు తొడిగించి ఇత్తడి శిరస్త్రాణం అతని తలపై పెట్టాడు.

  24. దావీదు ఆ యుద్ధకవచం వేసుకుని కత్తి పట్టుకుని నడవడానికి ప్రయత్నించాడు కాని అవి అతనికి అలవాటు లేకపోవడం వలన అతడు నడవలేకపోయాడు. అందుకతడు, “ఇవి నాకు అలవాటు లేదు కాబట్టి వీటితో నేను వెళ్లలేను” అని సౌలుతో చెప్పి వాటిని తీసివేశాడు.

  25. అతడు తన చేతికర్రను పట్టుకుని ఏటిలో నుండి అయిదు సన్నని రాళ్లు ఏరుకుని తన దగ్గర ఉన్న చిన్న సంచిలో వేసుకుని తన వడిసెల పట్టుకుని ఆ ఫిలిష్తీయుని దగ్గరకు వెళ్లాడు.