కంటెంట్‌కు వెళ్లండి

circa AD 95

The Revelation

John's vision on Patmos unveils the cosmic victory of the Lamb over evil and the final restoration of all creation.

404 వచనాలు · 1 గ్రంథం చేర్చబడింది

  1. ప్రకటన 16:19సుమారు క్రీ.శ. 96

    ప్రసిద్ధిగాంచిన ఆ గొప్ప పట్టణం మూడు భాగాలుగా చీలిపోయింది, దేశాల పట్టణాలు కుప్పకూలాయి. దేవుడు బబులోను మహాపట్టణాన్ని జ్ఞాపకం చేసుకుని తన ఉగ్రత అనే మద్యంతో నిండిన పాత్రను ఆమెకు ఇచ్చారు.

  2. ప్రకటన 16:20సుమారు క్రీ.శ. 96

    అప్పుడు ప్రతి ద్వీపం పారిపోయింది, పర్వతాలు కనబడలేదు.

  3. ప్రకటన 16:21సుమారు క్రీ.శ. 96

    ఆకాశం నుండి మనుష్యుల మీద భారీ వడగండ్లు పడ్డాయి. ఆ వడగండ్లు ఒక్కొక్కటి సుమారు నలభై అయిదు కిలోల బరువు ఉన్నాయి. ఆ వడగండ్ల తెగులు చాలా భయంకరంగా ఉండడంతో ఆ దెబ్బలకు తట్టుకోలేక ప్రజలు దేవుని దూషించారు.

  4. ప్రకటన 17:1సుమారు క్రీ.శ. 96

    ఏడు పాత్రలను పట్టుకుని ఉన్న ఏడుగురు దేవదూతల్లో ఒక దేవదూత వచ్చి నాతో, “ఇక్కడకు రా, అనేక జలాల మీద కూర్చుని ఉన్న మహావేశ్యకు విధించబడిన శిక్షను నీకు చూపిస్తాను.

  5. ప్రకటన 17:2సుమారు క్రీ.శ. 96

    భూ రాజులు ఆ వేశ్యతో వ్యభిచరించారు, ఆమె వ్యభిచారమనే మద్యంతో భూనివాసులందరు మత్తులయ్యారు” అని చెప్పాడు.

  6. ప్రకటన 17:3సుమారు క్రీ.శ. 96

    అప్పుడు ఆ దేవదూత నన్ను ఆత్మలో ఎడారిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఒక స్త్రీ ఎరుపు రంగులో ఉన్న మృగం మీద కూర్చుని ఉండడం నేను చూశాను. ఆ మృగం నిండా దైవదూషణ పేర్లు ఉన్నాయి; దానికి ఏడు తలలు, పది కొమ్ములు ఉన్నాయి.

  7. ప్రకటన 17:4సుమారు క్రీ.శ. 96

    ఆ స్త్రీ ఊదా, ఎరుపురంగు వస్త్రాలను ధరించి, మెరిసే బంగారం, విలువైన రాళ్లు, ముత్యాలతో అలంకరించబడి ఉంది. ఆమె తన చేతితో ఒక బంగారు పాత్ర పట్టుకుని ఉంది. ఆ పాత్ర ఆమె చేసిన అసహ్యమైన పనులు, వ్యభిచారమనే మురికితో నిండి ఉంది.

  8. ప్రకటన 17:5సుమారు క్రీ.శ. 96

    ఆమె నుదిటి మీద వ్రాసి ఉన్న పేరులో ఒక రహస్యం ఉంది: “మహా బబులోను పట్టణం, వేశ్యలకు తల్లి భూమి మీద జరిగే ప్రతి అసహ్యమైన కార్యానికి తల్లి.”

  9. ప్రకటన 17:6సుమారు క్రీ.శ. 96

    ఈ స్త్రీ దేవుని పరిశుద్ధ ప్రజల రక్తాన్ని అనగా యేసు హతసాక్షుల రక్తాన్ని త్రాగి మత్తులో ఉండడం నేను చూశాను. నేను ఆమెను చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యపడ్డాను.

  10. ప్రకటన 17:7సుమారు క్రీ.శ. 96

    అప్పుడు ఆ దేవదూత నాతో, “నీవెందుకు ఆశ్చర్యపడుతున్నావు? హతసాక్షుల స్వారీ చేసిన ఏడు తలలు పది కొమ్ములు కలిగిన మృగానికి సంబంధించిన రహస్యాన్ని నేను నీకు తెలియజేస్తాను” అని చెప్పాడు.

  11. ప్రకటన 17:8సుమారు క్రీ.శ. 96

    నీవు చూసిన ఆ మృగం ఒకప్పుడు ఉండేది కాని ఇప్పుడు లేదు. అది అగాధం నుండి పైకి వచ్చి నాశనమై పోవడానికి సిద్ధంగా ఉన్నది. ఆ మృగం ఇంతకుముందు ఉండేది, కానీ ఇప్పుడు లేదు. అది మళ్ళీ వస్తుంది కాబట్టి సృష్టికి పునాది వేయబడక ముందు నుండి జీవగ్రంథంలో పేర్లు వ్రాయబడని భూనివాసులందరు ఆ మృగాన్ని చూసి ఆశ్చర్యపడతారు.

  12. ప్రకటన 17:9సుమారు క్రీ.శ. 96

    ఈ విషయాన్ని గుర్తించడానికి జ్ఞానంగల మనస్సు అవసరం. ఆ స్త్రీ కూర్చుని ఉన్న ఏడు తలలు ఏడు కొండలు.

  13. ప్రకటన 17:10సుమారు క్రీ.శ. 96

    ఆ ఏడు తలలు ఏడుగురు రాజులను సూచిస్తున్నాయి. వారిలో అయిదుగురు పడిపోయారు, ఒక రాజు యేలుతున్నాడు, మరొక రాజు ఇంకా రాలేదు. కాని అతడు వచ్చినప్పుడు అతడు కేవలం కొంతకాలమే యేలుతాడు.

  14. ప్రకటన 17:11సుమారు క్రీ.శ. 96

    ఇంతకుముందు ఉండి ఇప్పుడు లేని ఆ మృగమే ఎనిమిదవ రాజు. ఆ మృగమే ఏడుగురిలో ఒకడు, అతడు తన నాశనం కోసమే రాబోతున్నాడు.

  15. ప్రకటన 17:12సుమారు క్రీ.శ. 96

    నీవు చూసిన పది కొమ్ములు పదిమంది రాజులు. వారు ఇంకా రాజ్యాన్ని పొందలేదు, కాని మృగంతో పాటు కలిసి ఒక గంట సమయం రాజుల్లా యేలడానికి వారికి అధికారం ఇవ్వబడుతుంది.

  16. ప్రకటన 17:13సుమారు క్రీ.శ. 96

    వీరు ఒకే ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. వీరు తమ శక్తిని, అధికారాన్ని మృగానికి ఇస్తారు.

  17. ప్రకటన 17:14సుమారు క్రీ.శ. 96

    ఈ రాజులందరూ మృగంతో పాటు కలిసి గొర్రెపిల్లకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తారు కాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు కాబట్టి ఆయన వారందరి మీద విజయం పొందుతాడు. ఆయనతో పాటు ఆయనచే పిలువబడిన వారు, ఏర్పరచబడినవారు ఆయనను నమ్మకంగా వెంబడించినవారు ఉంటారు.

  18. ప్రకటన 17:15సుమారు క్రీ.శ. 96

    అప్పుడు ఆ దేవదూత నాతో, “ఆ వేశ్య కూర్చుని ఉన్న ఆ జలాలే ప్రజలు, జనసమూహాలు, దేశాలు, వివిధ భాషలు మాట్లాడేవారు.

  19. ప్రకటన 17:16సుమారు క్రీ.శ. 96

    నీవు చూసిన ఆ మృగం ఆ పది కొమ్ములు ఆ వేశ్యను ద్వేషిస్తాయి. అవి ఆమెను దిక్కులేని దానిగా, దిగంబరిగా చేయడానికి ఆమెను తీసుకొస్తాయి. అవి ఆమె మాంసాన్ని తిని, ఆమె శరీరాన్ని అగ్నితో కాల్చివేస్తాయి.

  20. ప్రకటన 17:17సుమారు క్రీ.శ. 96

    ఎందుకంటే దేవుడు ముందుగానే పలికిన మాటలు నెరవేరే వరకు వారు తమ రాజ్యాధికారాన్ని ఆ మృగానికి అప్పగించడానికి అంగీకరించడం ద్వారా ఆయన ఉద్దేశాలు పూర్తయ్యే వరకు దేవుడు దీన్ని వారి హృదయాల్లో ఉంచారు.

  21. ప్రకటన 17:18సుమారు క్రీ.శ. 96

    నీవు చూసిన ఆ స్త్రీ భూరాజులను యేలుతున్న ఆ మహా పట్టణం” అని చెప్పాడు.

  22. ప్రకటన 18:1సుమారు క్రీ.శ. 96

    తర్వాత మరొక దేవదూత పరలోకం నుండి క్రిందికి దిగి రావడం నేను చూశాను; అతనికి గొప్ప అధికారం ఉంది, అతని వెలుగుతో భూమి ప్రకాశించింది.

  23. ప్రకటన 18:2సుమారు క్రీ.శ. 96

    అతడు గొప్ప స్వరంతో ఇలా అన్నాడు, “బబులోను మహా పట్టణం కూలిపోయింది! కూలిపోయింది! అది దయ్యాలు సంచరించే స్థలంగా, ప్రతి దుష్ట ఆత్మలు సంచరించే స్థలంగా, ప్రతి అపవిత్ర పక్షి సంచరించే స్థలంగా, ప్రతి మలినమైన అసహ్యమైన క్రూరమృగాలు సంచరించే స్థలంగా మారింది.

  24. ప్రకటన 18:3సుమారు క్రీ.శ. 96

    ఎందుకంటే ఆమె వ్యభిచార మద్యాన్ని త్రాగి దేశాలన్నీ మత్తులయ్యాయి. భూలోక రాజులు ఆమెతో వ్యభిచరించారు. భూలోక వర్తకులు ఆమె ఇచ్చే అధిక విలాసాలతో ధనికులయ్యారు.”

  25. ప్రకటన 18:4సుమారు క్రీ.శ. 96

    అప్పుడు పరలోకంలో నుండి మరొక స్వరం వినిపించింది: “ ‘నా ప్రజలారా! మీరు ఆమె పాపాల్లో భాగం పంచుకోకుండా’ ఆమెకు సంభవించే ఏ కీడు మీ మీదికి రాకుండా, ఆమెలో నుండి బయటకు రండి;