Skip to content

Judge గురించి బైబిల్ వచనాలు

91 వచనాలు · 6 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. “రాత్రివేళ ఈమె తన కుమారుని మీదికి దొర్లింది, వాడు చనిపోయాడు.

  2. కాబట్టి మధ్యరాత్రి ఈమె లేచి, మీ దాసురాలైన నేను పడుకోని ఉన్నప్పుడు, నా ప్రక్కన ఉన్న నా కుమారుని తీసుకుని తన ప్రక్కన పెట్టుకొని, చనిపోయిన తన కుమారుని నా ప్రక్కన పెట్టింది.

  3. ప్రొద్దున నా కుమారునికి పాలు ఇవ్వడానికి చూస్తే వాడు చనిపోయి ఉన్నాడు! అయితే నేను ఉదయకాలపు వెలుగులో గమనించి చూస్తే, వాడు నేను జన్మనిచ్చిన వాడు కాదు.”

  4. ఇంకొక స్త్రీ అన్నది, “లేదు! బ్రతికి ఉన్నవాడు నా కుమారుడు; చనిపోయినవాడు నీ వాడు.” మొదటి స్త్రీ అన్నది, “లేదు! చనిపోయినవాడు నీ వాడు; బ్రతికి ఉన్నవాడు నావాడు.” ఇంకా రాజు ముందు వారు వాదించుకున్నారు.

  5. రాజు అన్నాడు, “ఈమె అంటుంది, ‘నా కుమారుడు బ్రతికి ఉన్నాడు, నీ కుమారుడు చనిపోయాడు’ ఆమె అంటుంది, ‘లేదు! నీ కుమారుడు చనిపోయాడు, నావాడు బ్రతికి ఉన్నాడు.’ ”

  6. అప్పుడు రాజు అన్నాడు, “నాకొక ఖడ్గం తీసుకురండి.” కాబట్టి వారు ఖడ్గం రాజు దగ్గరకు తెచ్చారు.

  7. అప్పుడు రాజు వారికి ఇలా ఆదేశించాడు: “బ్రతికి ఉన్న బిడ్డను రెండు ముక్కలు చేసి, ఈమెకు సగం ఆమెకు సగం ఇవ్వండి.”

  8. అందుకు బ్రతికి ఉన్న శిశువు యొక్క తల్లి తన కుమారుని పట్ల జాలితో కరిగిపోయి రాజుతో అన్నది, “దయచేసి, నా ప్రభువా, ఆమెకు బ్రతికి ఉన్న శిశువును ఇచ్చేయండి! అతన్ని చంపకండి!” అయితే ఇంకొక స్త్రీ అన్నది, “అతడు నీకు గాని, నాకు గాని దక్కకూడదు. అతన్ని రెండు ముక్కలు చేయండి!”

  9. అప్పుడు రాజు తన తీర్పు ఇచ్చాడు: “బ్రతికి ఉన్న శిశువును మొదటి స్త్రీకి ఇవ్వండి. అతన్ని చంపకండి; ఆమె అతని తల్లి.”

  10. రాజు ఇచ్చిన తీర్పు గురించి ఇశ్రాయేలీయులందరు విన్నప్పుడు, రాజును ఎంతో గౌరవించారు, ఎందుకంటే తీర్పు తీర్చడానికి దేవుని దగ్గరనుండి అతడు జ్ఞానం పొందుకున్నాడని వారు గ్రహించారు.

  11. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బాలుని తల్లితో ఇలా అన్నాడు, “యెహోవా కరువు రప్పిస్తున్నారు, అది ఈ దేశంలో ఏడు సంవత్సరాల పాటు ఉంటుంది కాబట్టి నీవు, నీ కుటుంబం బయలుదేరి మీకు అనువైన చోటికి వెళ్లి కొంతకాలం ఉండండి.”

  12. దైవజనుడు చెప్పినట్టు ఆ స్త్రీ చేసింది. ఆమె, ఆమె కుటుంబం, ఫిలిష్తీయ దేశానికి వెళ్లి అక్కడ ఏడు సంవత్సరాలు నివసించారు.

  13. ఏడు సంవత్సరాలు ముగిసిన తర్వాత, ఆమె ఫిలిష్తీయ దేశం నుండి తిరిగి వచ్చింది, తన ఇల్లు భూమి కోసం మనవి చేసుకోవడానికి ఆమె రాజు దగ్గరకు వెళ్లింది.

  14. ఆ సమయంలో, దైవజనుని సేవకుడైన గేహజీతో రాజు మాట్లాడుతూ, “ఎలీషా చేసిన గొప్పకార్యాలు నాకు చెప్పు” అన్నాడు.

  15. ఎలీషా ఎలా చచ్చినవాన్ని బ్రతికించాడో గేహజీ రాజుకు చెప్తూ ఉండగానే, అతడు బ్రతికించిన బాలుని తల్లి తన ఇల్లు అలాగే భూమి కోసం రాజుకు మనవి చేసుకోవడానికి వచ్చింది. గేహజీ, “నా ప్రభువా, రాజా, ఈవిడే ఆ స్త్రీ, ఇతడే ఎలీషా బ్రతికించిన ఈ స్త్రీ కుమారుడు” అని అన్నాడు.

  16. రాజు దాని గురించి ఆమెను అడిగినప్పుడు, ఆమె ఆ విషయం వివరించింది. అప్పుడు రాజు ఆమె కోసం ఒక అధికారిని నియమించి, “ఆమెకు చెందినదంతా, ఆమె దేశం విడిచి వెళ్లిన రోజు నుండి ఇప్పటివరకు ఆమె భూమివల్ల వచ్చిన రాబడితో సహా ఆమెకు ఇప్పించు” అని అతనికి చెప్పాడు.

  17. యూదా దేశంలో కోటగోడలు గల అన్ని పట్టణాల్లో అతడు న్యాయాధిపతులను నియమించాడు.

  18. అతడు వారితో ఇలా అన్నాడు, “మీరు ఏమి చేస్తున్నారో జాగ్రత్తగా పరిశీలించండి, ఎందుకంటే మీరు కేవలం మనుష్యుల కోసం కాదు, మీరు ఎప్పుడు తీర్పు ఇచ్చినా మీకు తోడుగా ఉన్న యెహోవా కోసం తీర్పు ఇస్తున్నారు.

  19. యెహోవా భయం మీమీద ఉండాలి. జాగ్రత్తగా తీర్పు తీర్చండి, ఎందుకంటే మన దేవుడైన యెహోవా అన్యాయం చేయరు, పక్షపాతం చూపించరు, లంచం తీసుకోరు.”

  20. యెహోషాపాతు, యెరూషలేములో కూడా కొంతమంది లేవీయులను, యాజకులను ఇశ్రాయేలీయుల కుటుంబ పెద్దలను యెహోవా ధర్మశాస్త్రాన్ని బోధించడానికి, వివాదాలను పరిష్కరించడానికి నియమించాడు. వారు యెరూషలేములో నివసించారు.

  21. అతడు వారికి ఈ ఆజ్ఞలు జారీ చేశాడు: “యెహోవాయందు భయం కలిగి, మీరు నమ్మకంగా యధార్థహృదయంతో సేవ చేయాలి.

  22. పట్టణాల్లో నివసించే మీ ప్రజలు మీ దగ్గరకు తెచ్చే ప్రతి ఫిర్యాదు అంటే అది హత్యకు సంబంధించినవైనా లేదా ధర్మశాస్త్రం, ఆజ్ఞలు, శాసనాలు, నిబంధనలకు సంబంధించిన ఇతర విషయాలైనా, వారు యెహోవాకు వ్యతిరేకంగా ఏ పాపం చేయవద్దని మీరు వారిని హెచ్చరించాలి; లేకపోతే ఆయన కోపం మీ మీదికి మీ ప్రజలమీదికి వస్తుంది. ఇలా చేస్తే, మీరు అపరాధులు కారు.

  23. సంగీత దర్శకునికి. “నిర్మూలం చేయకు” అనే రాగం మీద పాడదగినది. దావీదు శ్రేష్ఠమైన కీర్తన. పాలకులారా, నిజంగా మీరు న్యాయంగా మాట్లాడతారా? మీరు మనుష్యులకు న్యాయంగా తీర్పు తీరుస్తారా?

  24. లేదు, మీ హృదయంలో అన్యాయం చేస్తున్నారు, దేశంలో హింసను పెంచుతున్నారు.

  25. సొలొమోను కీర్తన. ఓ దేవా, రాజుకు మీ న్యాయాన్ని, రాకుమారునికి మీ నీతిని ప్రసాదించండి.