Skip to content

Parables గురించి బైబిల్ వచనాలు

452 వచనాలు · 74 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. నీ కుమారుడనని అనిపించుకునే అర్హత కూడా నాకు లేదు, నన్ను నీ పనివారిలో ఒకనిగా పెట్టుకో అని చెప్తాను’ అనే ఆలోచనతో లేచి,

  2. అతని తండ్రి దగ్గరకు వెళ్లాడు. “వాడు ఇంకా దూరంగా ఉండగానే, వాని తండ్రి వాన్ని చూసి, వానిపై జాలిపడి, పరుగెత్తుకొని వచ్చి వాని కౌగిలించుకుని వాని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు.

  3. “అప్పుడు వాడు తన తండ్రితో, ‘నాన్నా, నీకు పరలోకానికిని విరోధంగా నేను పాపం చేశాను. ఇప్పటినుండి నేను నీ కుమారుడను అని అనిపించుకోడానికి కూడా అర్హున్ని కాను’ అని అన్నాడు.

  4. “కాని వాని తండ్రి తన పనివారితో, ‘త్వరగా! విలువైన వస్త్రాలను తెచ్చి ఇతనికి ధరింపచేయండి, వీని చేతికి ఉంగరం పెట్టి, కాళ్లకు చెప్పులను తొడిగించండి.

  5. ఒక క్రొవ్విన దూడను తెచ్చి వధించండి. మనం విందు చేసుకుని ఆనందిద్దాము.

  6. ఈ నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికాడు, వీడు తప్పిపోయి దొరికాడు’ అని అన్నాడు. అలా వారందరు అతనితో ఆనందించడం మొదలుపెట్టారు.

  7. “ఆ సమయంలో, పెద్ద కుమారుడు పొలం నుండి ఇంటికి వస్తున్నాడు. అతడు ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు, సంగీత నాట్యాల ధ్వని వినిపించింది.

  8. అప్పుడు అతడు తన పనివారిలో ఒకన్ని పిలిచి, ‘ఇంట్లో ఏం జరుగుతోంది?’ అని అడిగాడు.

  9. అందుకు ఆ పనివాడు, ‘నీ తమ్ముడు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాడని నీ తండ్రి సంతోషంతో విందు చేయడానికి క్రొవ్విన దూడను వధించాడు’ అని చెప్పాడు.

  10. “దానితో పెద్ద కుమారుడు కోప్పడి ఇంట్లోకి వెళ్లడానికి ఇష్టపడలేదు. కాబట్టి అతని తండ్రి బయటకు వచ్చి అతన్ని ఇంట్లోకి రమ్మని బ్రతిమాలాడు.

  11. కాని అతడు తన తండ్రితో, ‘చూడు, ఇన్ని సంవత్సరాల నుండి నీకు దాస్యం చేస్తూ వచ్చాను, నీ మాటను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. అయినా నా స్నేహితులతో కలిసి సంతోషించడానికి ఒక చిన్న మేకపిల్లను కూడా నీవు ఎప్పుడు నాకు ఇవ్వలేదు.

  12. కానీ నీ చిన్నకుమారుడు నీ ఆస్తినంతా వేశ్యలతో తిరిగి పాడుచేసి, ఇంటికి తిరిగి వస్తే వీని కోసం క్రొవ్విన దూడను వధించి విందు చేస్తున్నావా?’ అని అన్నాడు.

  13. “అందుకు అతని తండ్రి, ‘నా కుమారుడా, నీవు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నావు, నాకున్నదంతా నీదే.

  14. కాని ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాడు, అతడు తప్పిపోయి దొరికాడు కాబట్టి మనం సంతోషించి ఆనందించాలి’ అని చెప్పాడు.”

  15. యేసు తన శిష్యులతో మాట్లాడుతూ ఈ విధంగా చెప్పారు: “ఒక ధనవంతుని దగ్గర ఒక గృహనిర్వాహకుడు ఉన్నాడు. వాడు అతని ఆస్తిని పాడు చేస్తున్నాడని వాని మీద నేరారోపణ ఉంది.

  16. కాబట్టి ఆ ధనవంతుడు వానిని లోపలికి పిలిపించి వానితో, ‘నీ గురించి నేను వింటుంది ఏమి? నిన్ను గృహనిర్వాహక పని నుండి తొలగిస్తున్నాను కాబట్టి నీవు లెక్కలన్నీ అప్పగించాలి’ అన్నాడు.

  17. “ఆ గృహనిర్వాహకుడు తనలో తాను, ‘ఇప్పుడు నేను ఏమి చేయాలి? నా యజమాని నన్ను ఉద్యోగం నుండి తీసేస్తాడు, నేను త్రవ్వే పని చేయలేను, భిక్షమెత్తాలంటే నాకు సిగ్గు.

  18. కాబట్టి ఇక్కడ నా ఉద్యోగం పోయినా ప్రజలు నన్ను తమ ఇళ్ళకు ఆహ్వానించేలా ఏం చేయాలో నాకు తెలుసు!’ అని అనుకున్నాడు.

  19. “కాబట్టి అతడు, తన యజమానికి బాకీ ఉన్న ప్రతివారిని పిలిపించాడు. మొదటి వానిని, ‘నా యజమానికి నీవెంత బాకీ ఉన్నావు?’ అని అడిగాడు.

  20. “అందుకు వాడు, ‘మూడు వేల లీటర్ల నూనె’ అని జవాబిచ్చాడు. “వెంటనే ఆ గృహనిర్వాహకుడు వానితో, ‘నీ చీటి తీసుకుని, పదిహేను వందల లీటర్లు అని వ్రాసుకో’ అన్నాడు.

  21. “ఆ తర్వాత రెండవ వానిని, ‘నీవెంత బాకీ ఉన్నావు?’ అని అడిగాడు. “అందుకు వాడు, ‘వంద టన్నుల గోధుమలు’ అని చెప్పాడు. “కాబట్టి అతడు వానితో, ‘నీవు నీ చీటిలో ఎనభై టన్నులని వ్రాసుకో’ అన్నాడు.

  22. “ఈ విషయాన్ని విన్న ధనవంతుడు ఆ యజమాని మోసగాడైనా కానీ యుక్తిగా నడుచుకొన్నాడని వానిని మెచ్చుకొన్నాడు. ఈ లోకసంబంధులు తమ తరాన్ని బట్టి చూస్తే వెలుగు సంబంధుల కంటే యుక్తిగా వ్యవహరిస్తున్నారు.

  23. “ఊదా రంగు సన్నని నారబట్టలను ధరించుకొని, ప్రతిరోజు విలాసంగా జీవించే ఒక ధనవంతుడు ఉండేవాడు.

  24. వాని ఇంటి వాకిటనే శరీరమంతా కురుపులు ఉన్న లాజరు అనే పేరుగల ఒక పేదవాడు ఉండేవాడు.

  25. వాడు ఆ ధనవంతుని బల్ల నుండి పడే రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకోవాలని చూసేవాడు. కుక్కలు వచ్చి వాని కురుపులను నాకేవి.