Skip to content

Parables గురించి బైబిల్ వచనాలు

452 వచనాలు · 74 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. “అందుకే నేను మీకు చెప్తున్న: అడగండి మీకు ఇవ్వబడుతుంది; వెదకండి మీకు దొరుకుతుంది; తట్టండి మీకు తలుపు తీయబడుతుంది.

  2. “బలవంతుడైనవాడు ఆయుధాలను ధరించుకొని, తన ఇంటిని కాపల కాస్తున్నప్పుడు, అతని ఆస్తి భద్రంగా ఉంటుంది.

  3. “ఎవ్వరూ దీపాన్ని వెలిగించి దానిని చాటుగా ఉండే చోటులో లేదా పాత్ర క్రింద పెట్టరు. దానికి బదులు లోపలికి వచ్చే వారికి వెలుగిచ్చేలా, దానిని దీపస్తంభం మీద పెడతారు.

  4. నీ కన్ను నీ దేహానికి దీపం. నీ కళ్లు ఆరోగ్యంగా ఉంటే, దేహమంతా వెలుగుతో నిండి ఉంటుంది. కాని అవి అనారోగ్యంగా ఉన్నప్పుడు, నీ దేహమంతా చీకటితో నిండి ఉంటుంది.

  5. నీలో ఉన్న దేన్ని నీవు వెలుగు అనుకుంటున్నావో అది నిజానికి చీకటి కాకుండా చూసుకో.

  6. కాబట్టి, నీ దేహంలో ఏ భాగం చీకటి కాకుండా నీ దేహమంతా వెలుగు మయమైతే, నీ మీద దీపం వెలుగుతున్నప్పుడు ఎలా ఉంటుందో అలా నీ దేహమంతా వెలుగుమయమై ఉంటుంది” అని చెప్పారు.

  7. ఇంకా ఆయన వారికి ఈ ఉపమానం చెప్పారు: “ఒక ధనవంతుని పొలం సమృద్ధిగా పంట పండింది.

  8. అప్పుడు అతడు తనలో తాను అనుకున్నాడు, ‘నేను ఏమి చేయాలి? ఈ పంటంతటిని నిల్వ చేసుకోవడానికి నాకు స్ధలం చాలదు.’

  9. “అప్పుడతడు, ‘నేను ఇలా చేస్తాను. ఇప్పుడున్న కొట్లను పడగొట్టి, పెద్ద కొట్లను కట్టించి వాటిలో నా ధాన్యాన్ని సమకూర్చుకుంటాను.

  10. నా ఆత్మతో నేను ఇలా అనుకుంటాను, “అనేక సంవత్సరాలకు సరిపడినంత విస్తారమైన ధాన్యం నీకోసం సమకూర్చి ఉంచాను. జీవితాన్ని తేలికగా తీసుకో; తిను, త్రాగు, సంతోషంగా ఉండు” ’ అని అనుకున్నాడు.

  11. “కాని దేవుడు అతనితో, ‘ఓయీ బుద్ధిహీనుడా! ఈ రాత్రే నీ ప్రాణం పోతే, నీకోసం నీవు సిద్ధపరచుకొన్నది ఎవరిదవుతుంది?’

  12. “దేవునిలో ధనవంతుడు కాకుండా తమ కోసం సమకూర్చుకొనేవారి స్థితి ఇలా ఉంటుంది” అని చెప్పారు.

  13. ఆయన జనసమూహంతో ఇలా అన్నారు: “పడమర వైపు నుండి మబ్బులు రావడం చూసినప్పుడు మీరు వెంటనే, ‘వాన కురవబోతుంది’ అని అంటారు, అలాగే వాన కురుస్తుంది.

  14. అలాగే దక్షిణపు గాలి వీచినప్పుడు, ‘వేడిగా ఉండబోతుంది’ అని అంటారు, అది అలాగే ఉంటుంది.

  15. వేషధారులారా! భూమి, ఆకాశం యొక్క వాతావరణ సంకేతాలను ఎలా అర్థం చేసుకోవాలో మీకు తెలుసు. అలాంటప్పుడు ప్రస్తుత కాలాలను ఎలా అర్థం చేసుకోవాలో మీకు తెలియకపోవడమేంటి?

  16. “ఏది సరియైనదో మీ అంతట మీరే ఎందుకు విమర్శించుకోలేరు?

  17. తర్వాత ఆయన ఈ ఉపమానం చెప్పారు: “ఒక మనుష్యుడు తన ద్రాక్షతోటలో ఒక అంజూర చెట్టును పెంచుతున్నాడు, అతడు వెళ్లి పండ్ల కోసం ఆ చెట్టును చూశాడు కాని ఏమి దొరకలేదు.

  18. కాబట్టి అతడు తోటమాలితో, ‘ఇదిగో మూడేళ్ళ నుండి నేను ఈ అంజూర చెట్టు పండ్ల కోసం వచ్చి చూస్తున్నాను గాని ఇంతవరకు ఏమి దొరకలేదు. దీనిని నరికివేయి! దీని వల్ల భూసారం ఎందుకు వృధా అవ్వాలి?’ అని అన్నాడు.

  19. “అయితే ఆ తోటమాలి, ‘అయ్యా, ఇంకొక సంవత్సరం దానిని ఉండనివ్వండి, నేను దాని చుట్టూ త్రవ్వి, ఎరువు వేసి చూస్తాను.

  20. ఒకవేళ అది పండ్లు ఇస్తే సరి, లేకపోతే నరికించండి’ అన్నాడు.”

  21. అది ఒక ఆవగింజ లాంటిది, ఒకడు దాన్ని తీసుకెళ్లి తన పొలంలో నాటాడు. అది పెరిగి వృక్షమయ్యింది, ఆకాశపక్షులు వచ్చి దాని కొమ్మల్లో గూళ్ళు కట్టుకున్నాయి.”

  22. ఆహ్వానించబడిన వారు భోజనబల్ల దగ్గర గౌరవ స్థానాలను ఎంచుకోవడం గమనించి, ఆయన వారికి ఈ ఉపమానం చెప్పారు:

  23. “ఎవరైనా మిమ్మల్ని పెళ్ళి విందుకు ఆహ్వానిస్తే గౌరవ స్థానంలో కూర్చోకండి, ఎందుకంటే ఒకవేళ మీకంటే గొప్ప వ్యక్తిని ఆహ్వానించి ఉండవచ్చు.

  24. ఆ అతిథి వచ్చినప్పుడు నిన్ను ఆహ్వానించినవారు నీ దగ్గరకు వచ్చి, ‘మీరు లేచి వీరిని కూర్చోనివ్వండి’ అని అంటే మీరు అవమానంతో ఎక్కడో చివరికి వెళ్లి కూర్చోవలసి వస్తుంది.

  25. అలా కాకుండ, మీరు ఆహ్వానించబడినప్పుడు వెళ్లి చివరి స్థానంలో కూర్చోండి అప్పుడు మిమ్మల్ని ఆహ్వానించినవారు వచ్చి మీతో, ‘స్నేహితుడా, నీవు లేచి ముందున్న గౌరవ స్థానంలో కూర్చో’ అని అంటారు. అప్పుడు అక్కడ ఉన్న ఇతర అతిథులందరి ముందు నీవు గౌరవించబడతావు.