కంటెంట్‌కు వెళ్లండి

Egypt గురించి బైబిల్ వచనాలు

328 వచనాలు · 105 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అప్పుడు యాకోబు బెయేర్షేబ నుండి బయలుదేరాడు, ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రియైన యాకోబును, వారి పిల్లలను, వారి భార్యలను ఫరో పంపిన బండ్లలో తీసుకెళ్లారు.

  2. కాబట్టి యాకోబు, అతని సంతానమంతా వారి పశువులతో, కనానులో వారు సంపాదించిన సమస్త సంపదతో ఈజిప్టుకు వెళ్లారు.

  3. యాకోబు తనతో తన కుమారులను, మనవళ్లను, కుమార్తెలను, మనవరాళ్లను, తన సంతానమంతటిని ఈజిప్టుకు తీసుకువచ్చాడు.

  4. యోసేపు వెళ్లి ఫరోతో, “నా తండ్రి, నా సోదరులు కనాను దేశం నుండి వారి గొర్రెల మందలు, పశువులు, వారి సమస్తంతో వచ్చారు, ఇప్పుడు గోషేనులో ఉన్నారు” అన్నాడు.

  5. అతడు తన సోదరులలో అయిదుగురిని ఫరోకు ఎదుట కనుపరిచాడు.

  6. ఫరో ఆ సోదరులతో, “మీ వృత్తి ఏంటి?” అని అడిగాడు. “మీ దాసులు మా పూర్వికుల్లా గొర్రెల కాపరులు” అని వారు ఫరోకు జవాబిచ్చారు.

  7. వారు అతనితో, “మేము కొంతకాలం ఇక్కడ నివసించడానికి వచ్చాం ఎందుకంటే కనానులో కరువు తీవ్రంగా ఉంది, మీ దాసుల గొర్రెల మందలకు మేత లేదు. కాబట్టి ఇప్పుడు మీ దాసులను గోషేనులో నివసించనివ్వండి” అని కూడా అన్నారు.

  8. ఫరో యోసేపుతో, “నీ తండ్రి, సోదరులు నీ దగ్గరకు వచ్చారు,

  9. ఈజిప్టు దేశమంతా నీ ముందుంది; శ్రేష్ఠమైన ప్రాంతంలో నీ తండ్రిని, నీ సోదరులను ఉంచు. గోషేనులో వారు నివసించవచ్చు. వీరిలో ప్రత్యేక సామర్థ్యం కలిగినవారు ఎవరైనా ఉంటే, నా సొంత పశువులకు ముఖ్య కాపరులుగా నియమించు” అన్నాడు.

  10. తర్వాత యోసేపు తన తండ్రి యాకోబును తీసుకువచ్చి ఫరో ఎదుట కనుపరిచాడు. యాకోబు ఫరోను దీవించిన తర్వాత,

  11. ఫరో, “నీ వయసెంత?” అని అడిగాడు.

  12. యాకోబు ఫరోతో, “నేను యాత్రచేసిన సంవత్సరాలు నూట ముప్పై. నేను బ్రతికిన సంవత్సరాలు తక్కువ, అవి కూడా శ్రమతో నిండి ఉన్నాయి, అవి నా పూర్వికుల యాత్ర సంవత్సరాలతో సమానం కాదు” అని అన్నాడు.

  13. తర్వాత యాకోబు ఫరోను దీవించి, అతని ఎదుట నుండి వెళ్లిపోయాడు.

  14. అయితే దేశమంతటిలో ఆహారం లేదు ఎందుకంటే కరువు తీవ్రంగా ఉంది; ఈజిప్టు కనాను దేశాలు కరువును బట్టి ఆకలితో అలమటించాయి.

  15. యోసేపు ఈజిప్టు కనాను దేశాలకు, ధాన్యం కొనుగోలుకు వచ్చిన డబ్బు మొత్తం సేకరించి ఫరో రాజభవనానికి తెచ్చాడు.

  16. ఈజిప్టు కనాను ప్రజల డబ్బు అయిపోయినప్పుడు, ఈజిప్టు వారంతా యోసేపు దగ్గరకు వచ్చి, “మాకు ఆహారం ఇవ్వండి. మీ కళ్లముందే మేము ఎందుకు చావాలి? మా డబ్బంతా అయిపోయింది” అని అన్నారు.

  17. అందుకు యోసేపు, “అలాగైతే మీ పశువులను తీసుకురండి, మీ డబ్బు అయిపోయింది కాబట్టి మీ పశువులకు బదులుగా నేను ఆహారం సరఫరా చేస్తాను” అని అన్నాడు.

  18. కాబట్టి వారు యోసేపు దగ్గరకు తమ పశువులను తెచ్చారు. వారి గుర్రాలు, గొర్రెలు, మేకలు, పశువులు, గాడిదలకు బదులుగా వారికి ఆహారం ఇచ్చాడు. ఆ సంవత్సరమంతా వారి పశువులకు బదులుగా ఆహారం అందించాడు.

  19. సంవత్సరం ముగిసిన తర్వాత, మరుసటి సంవత్సరం వారు అతని దగ్గరకు వచ్చి, “మేము మా ప్రభువు నుండి నిజాన్ని దాచలేము, మా డబ్బు అయిపోయింది, మా పశువులు మీకే ఇచ్చాం, ఇక మా శరీరాలు, మా భూమి తప్ప మా ప్రభువుకు ఇవ్వడానికి ఏమీ మిగల్లేదు.

  20. మేము, మా భూమి మీ కళ్లముందే నశించడం బాగుంటుందా? ఆహారం కోసం మమ్మల్ని, మా భూములను కొనండి. మేము మా భూములతో సహా ఫరోకు బానిసలమవుతాము. మేము చావకుండ బ్రతికేలా పొలాలు పాడైపోకుండ మాకు విత్తనాలు ఇవ్వండి” అని మనవి చేసుకున్నారు.

  21. కాబట్టి యోసేపు ఫరో కోసం ఈజిప్టు భూమి అంతా కొన్నాడు. ఈజిప్టు వారంతా కరువు చాలా తీవ్రంగా ఉండడం వల్ల తమ భూములన్నీ అమ్మివేశారు. భూమి ఫరో ఆధీనంలోనికి వచ్చింది,

  22. యోసేపు ఈజిప్టు యొక్క సరిహద్దు నుండి ఇంకొక సరిహద్దు వరకు ఉన్న ప్రజలందరినీ బానిసలుగా చేశాడు.

  23. అయితే, యాజకులకు చెందిన భూమిని మాత్రం అతడు కొనలేదు. ఎందుకంటే వారు క్రమంగా ఫరో నుండి బత్తెం పొందుకునే వారు, ఆ బత్తెంతో వారికి సరిపడే ఆహారం ఉంది. కాబట్టి వారు తమ భూమిని అమ్మలేదు.

  24. యోసేపు ప్రజలతో, “నేను మీ భూములను మిమ్మల్ని ఈ రోజు ఫరో కోసం కొన్నాను. ఇదిగో మీరు భూమిలో నాటడానికి విత్తనాలు తీసుకోండి.

  25. అయితే పంట వచ్చినప్పుడు అయిదవ వంతు ఫరోకు ఇవ్వండి. మిగితా నాలుగు వంతులు మీ పొలాల్లో విత్తనం కోసం, మీకూ మీ ఇంటివారికి మీ పిల్లలకు ఆహారం కోసం ఉంచుకోండి” అన్నాడు.