Zimri గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
అప్పుడే ఇశ్రాయేలీయులలో ఒకడు మిద్యాను స్త్రీని మోషే సమాజమందరి ఎదుట, ఆ శిక్షను బట్టి వారు సమావేశ గుడార ద్వారం దగ్గర ఏడుస్తున్న సమయంలో తీసుకువచ్చాడు.
యాజకుడైన అహరోను మనవడు, ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు ఇది చూసినప్పుడు, సమాజాన్ని వదిలి, ఒక ఈటెను పట్టుకుని,
ఆ ఇశ్రాయేలీయుని వెంట అతని గుడారంలోకి వెళ్లాడు. అతన్ని ఆ స్త్రీని కలిపి ఈటెతో పొడిచాడు, ఆ ఈటె అతని శరీరంలో నుండి ఆమె కడుపులోనికి దూసుకుపోయింది. అప్పుడు ఇశ్రాయేలు మీదికి వచ్చిన తెగులు అంతరించింది;
మిద్యాను స్త్రీతో పాటు చంపబడిన ఇశ్రాయేలీయుని పేరు సలూ కుమారుడైన జిమ్రీ. ఇతడు షిమ్యోను కుటుంబంలో నాయకుడు.
ఏలహు యొక్క రథాలు సగభాగం మీద అధికారి, అతని సేవకులలో ఒకడైన జిమ్రీ, అతని మీద కుట్రపన్నాడు. ఆ సమయంలో ఏలహు, తిర్సాలో అతని గృహనిర్వాహకుడైన అర్సా ఇంట్లో, బాగా త్రాగుతూ ఉన్నాడు.
జిమ్రీ లోపలికి వచ్చి, అతన్ని మొత్తి చంపాడు, అతని తర్వాత అతడు రాజయ్యాడు. ఇది యూదా రాజైన ఆసా ఇరవై ఏడవ ఏట పరిపాలనలో జరిగింది.
జిమ్రీ సింహాసనం ఎక్కి పరిపాలించడం మొదలుపెట్టగానే అతడు బయెషా కుటుంబం వారందరినీ చంపేశాడు. అతని బంధువుల్లో, మిత్రులలో మగవారిని ఒక్కరిని కూడ వదలకుండా చంపాడు.
యెహోవా యెహు ప్రవక్త ద్వారా ప్రకటించిన వాక్కు ప్రకారం జిమ్రీ బయెషా వంశం అంతటిని నిర్మూలం చేశాడు.
బయెషా అతని కుమారుడైన ఏలహు చేసిన పాపాలన్నిటిని బట్టి, వారు ఇశ్రాయేలుతో చేయించిన పాపాన్ని బట్టి, వారి అయోగ్యమైన విగ్రహాలనుబట్టి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం రేపారు.
ఏలహు పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతడు చేసిందంతా ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?
యూదా రాజైన ఆసా పరిపాలనలోని ఇరవై ఏడవ సంవత్సరంలో జిమ్రీ తిర్సాలో ఏడు రోజులు పరిపాలించాడు. అప్పుడు ఇశ్రాయేలు సైన్యం ఫిలిష్తీయులకు చెందిన గిబ్బెతోను అనే పట్టణం ముట్టడించారు.
జిమ్రీ కుట్రపన్ని రాజును చంపేశాడని ఇశ్రాయేలీయులు విన్నప్పుడు సేనాధిపతియైన ఒమ్రీని ఇశ్రాయేలుకు రాజుగా చేశారు.
అప్పుడు ఒమ్రీ, అతనితో ఉన్న ఇశ్రాయేలీయులంతా గిబ్బెతోనును విడిచివెళ్లి తిర్సాను ముట్టడించారు.
పట్టణం ఆక్రమించబడిందని జిమ్రీ చూసి, అతడు రాజభవనం లోనికి వెళ్లి, తనతోపాటు దాన్ని తగలబెట్టి చనిపోయాడు.
యరొబాము జీవిత విధానాన్ని అనుసరిస్తూ యెహోవా దృష్టిలో పాపం చేసి, యరొబాములా ఇశ్రాయేలు ప్రజల పాపం చేయడానికి అతడు కారణమయ్యాడు కాబట్టి ఇలా జరిగింది.
జిమ్రీ పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతని తిరుగుబాటు వివరాలు ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?
యెహు ద్వారంలో ప్రవేశించగానే, యెజెబెలు అతనితో, “తన యజమానుని హత్యచేసిన జిమ్రీ లాంటివాడా, సమాధానంగా వస్తున్నావా?” అని అడిగింది.
జెరహు కుమారులు: జిమ్రీ, ఏతాను, హేమాను, కల్కోలు, దార. వీరు అయిదుగురు.
ఆహాజు యెహోయాదాకు తండ్రి, ఆలెమెతు, అజ్మావెతు, జిమ్రీలకు తండ్రి, జిమ్రీ మోజా అనేవారు యెహోయాదా కుమారులు.
ఆహాజు యదాకు తండ్రి, ఆలెమెతు, అజ్మావెతు, జిమ్రీలకు తండ్రి. జిమ్రీ మోజా అనేవారు యదా కుమారులు.
జిమ్రీ, ఏలాము, మాదీయుల రాజులందరూ;