Skip to content

Beneficence గురించి బైబిల్ వచనాలు

93 వచనాలు · 1 కోణం

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. “ ‘మీ తోటి ఇశ్రాయేలీయులలో ఎవరైనా పేదలుగా మారి, మీలో తమను తాము ఆదరించుకోలేకపోతే, మీరు ఒక విదేశీయునికి, అపరిచితునికి చేసినట్టుగానే వారికి సహాయం చేయండి, కాబట్టి వారు మీ మధ్య జీవించడం కొనసాగించవచ్చు.

  2. వారి నుండి వడ్డీ లేదా లాభం తీసుకోకండి, అయితే మీ దేవునికి భయపడండి, తద్వారా వారు మీ మధ్యనే జీవించడం కొనసాగించవచ్చు.

  3. మీరు వారికి వడ్డీకి డబ్బు ఇవ్వకూడదు లేదా లాభం కోసం ఆహారాన్ని అమ్మకూడదు.

  4. మీకు కనాను దేశాన్ని ఇచ్చి, నేను మీకు దేవుడనై ఉండాలని మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకువచ్చిన మీ దేవుడనైన యెహోవాను నేనే.

  5. “ ‘మీ తోటి ఇశ్రాయేలీయులలో ఎవరైనా పేదలుగా మారి తమను తాము మీకు అమ్ముకున్నట్లయితే, వారితో బానిసలుగా పని చేయించవద్దు.

  6. వారిని మీ మధ్య జీతగాలుగా లేదా తాత్కాలిక నివాసితులుగా పరిగణించాలి; యాభైయవ వార్షికోత్సవం వరకు, వారు మీ కోసం పని చేస్తారు.

  7. అప్పుడు వారు, వారి పిల్లలు విడవబడాలి, వారు తమ కుటుంబాల దగ్గరకు, వారి పూర్వికుల స్వాస్థ్యానికి వెళ్తారు.

  8. ఎందుకంటే ఇశ్రాయేలీయులు నా సేవకులు, నేనే ఈజిప్టు నుండి వారిని బయటకు తీసుకువచ్చాను, బానిసలుగా వారు అమ్మబడకూడదు.

  9. వారిని కఠినంగా పాలించవద్దు, మీ దేవునికి భయపడాలి.

  10. మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశపు పట్టణాల్లో ఎక్కడైనా మీ తోటి ఇశ్రాయేలీయులలో ఎవరైనా పేదవారు ఉంటే, వారి పట్ల మీ హృదయాలను కఠినంగా లేదా పిసినారిగా ఉంచకూడదు.

  11. కాని వారికి అవసరమైనంత దానిని వారికి గుప్పిలి విప్పి ధారాళంగా అప్పు ఇవ్వాలి.

  12. ఈ దుష్ట ఆలోచన మీ హృదయాల్లో పుట్టకుండా జాగ్రత్తపడండి: “ఏడవ సంవత్సరం, అప్పులు రద్దు చేసే సంవత్సరం సమీపించింది” తద్వార మీ తోటి ఇశ్రాయేలీయుల మధ్య ఉన్న పేదవారి పట్ల దయ చూపించకుండ మీరు వారికి ఏమి ఇవ్వకుండ ఉండకూడదు. మీరు అలా చేస్తే, వారు మీకు వ్యతిరేకంగా యెహోవాకు మొరపెడతారు; అప్పుడు మీరు పాపం చేసినవారిగా పరిగణించబడతారు.

  13. వారికి ధారాళంగా ఇవ్వండి, సణిగే హృదయం లేకుండా వారికి ఇవ్వండి; అప్పుడు మీ దేవుడైన యెహోవా మీ పనులన్నిటిలో మీరు చేసే ప్రతీ దానిలో మిమ్మల్ని దీవిస్తారు.

  14. దేశంలో ఎల్లప్పుడు పేదవారు ఉంటారు. కాబట్టి మీ దేశంలో తోటి ఇశ్రాయేలీయులలో పేదవారికి, అవసరంలో ఉన్నవారికి ధారాళంగా మీ గుప్పిలి విప్పాలని నేను మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను.

  15. మీ ప్రజల్లో హెబ్రీ పురుషులే గాని స్త్రీలే గాని మీకు అమ్ముకుని ఆరు సంవత్సరాలు మీకు సేవ చేస్తే, ఏడవ సంవత్సరంలో మీరు వారిని స్వేచ్ఛగా వెళ్లనివ్వాలి.

  16. మీరు వారిని విడుదల చేసినప్పుడు, వారిని వట్టి చేతులతో పంపకూడదు.

  17. మీ మందలో నుండి మీ నూర్పిడి కళ్ళం నుండి, మీ ద్రాక్ష గానుగ తొట్టి నుండి వారికి ధారాళంగా ఇచ్చి పంపాలి. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించిన దానికి తగినట్టుగా వారికి ఇవ్వాలి.

  18. మీరు ఈజిప్టులో దాసులై ఉన్నారని, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని విమోచించారని జ్ఞాపకం ఉంచుకోండి. అందుకే నేను ఈ రోజు మీకు ఈ ఆజ్ఞను ఇస్తున్నాను.

  19. నీవు క్రియ చేయగల అధికారం నీవు కలిగి ఉన్నప్పుడు, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయకుండా ఉండవద్దు.

  20. నీవు నీ పొరుగువానికి ఇప్పుడు సహాయం చేయ కలిగి ఉండి, “రేపు రా నేను ప్రయత్నిస్తాను” అని నీ పొరుగువానితో అనవద్దు.

  21. నీ శత్రువు ఆకలితో ఉంటే, తినడానికి భోజనము పెట్టు; అతడు దాహంతో ఉంటే, త్రాగడానికి నీళ్లు ఇవ్వు.

  22. ఇలా చేయడం ద్వారా అతని తలపై మండుతున్న నిప్పులు కుప్పగా పోస్తావు, యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిస్తారు.

  23. “నేను కోరుకునే ఉపవాసం అన్యాయపు సంకెళ్ళను విప్పడం, బరువైన కాడి త్రాళ్లు తీసివేయడం, బాధించబడిన వారిని విడిపించడం, ప్రతీ కాడిని విరగ్గొట్టడం కాదా?

  24. మీ ఆహారాన్ని ఆకలితో ఉన్నవారితో పంచుకోవడం, ఇల్లు లేక తిరుగుతున్న పేదలకు ఆశ్రయం కల్పించడం, మీరు ఎవరినైనా నగ్నంగా చూస్తే, వారికి బట్టలు ఇవ్వడం, మీ రక్తసంబంధులకు ముఖం దాచకపోవడమే కదా ఉపవాసం?

  25. ఆకలితో ఉన్నవారికి మీ దగ్గర ఉన్నది ఇచ్చి, బాధించబడినవారి అవసరాలను తీరిస్తే, చీకటిలో మీ వెలుగు ప్రకాశిస్తుంది, మీ చీకటి మధ్యాహ్నపు వెలుగుగా మారుతుంది.