కంటెంట్‌కు వెళ్లండి

The Miracles of Christ గురించి బైబిల్ వచనాలు

193 వచనాలు · 30 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యేసు జనసమూహంలో నుండి వానిని ప్రక్కకు తీసుకెళ్లి, వాని చెవుల్లో తన వ్రేళ్ళను ఉంచారు. తర్వాత ఆయన ఉమ్మివేసి, వాని నాలుకను ముట్టారు.

  2. ఆయన ఆకాశం వైపు చూసి నిట్టూర్పు విడిచి వానితో, “ఎప్ఫతా!” అన్నారు. (ఆ మాటకు “తెరుచుకో!” అని అర్థం.)

  3. వెంటనే వాని చెవులు తెరువబడ్డాయి, అలాగే వాని నాలుక సడలి వాడు తేటగా మాట్లాడటం మొదలుపెట్టాడు.

  4. వారు బేత్సయిదాకు వచ్చినప్పుడు, కొందరు ఒక గ్రుడ్డివానిని తీసుకువచ్చి వానిని ముట్టుమని ఆయనను బ్రతిమాలారు.

  5. ఆయన ఆ గ్రుడ్డివాని చేయి పట్టుకుని ఊరి బయటకు తీసుకెళ్లి, వాని కళ్ల మీద ఉమ్మివేసి, వాని మీద చేతులుంచి, “నీకు ఏమైనా కనబడుతుందా?” అని అడిగారు.

  6. అందుకు వాడు తల పైకెత్తి చూస్తూ, “మనుష్యులు కనపడుతున్నారు, వారు చెట్లలా నడుస్తున్నారు” అని చెప్పాడు.

  7. యేసు మళ్ళీ తన చేతులు వాని కళ్ల మీద ఉంచారు. అప్పుడు వాని కళ్లు తెరువబడ్డాయి, వాడు చూపు పొందుకొని, అన్నిటిని స్పష్టంగా చూడగలిగాడు.

  8. ఆయన మాట్లాడడం ముగించాక, ఆయన సీమోనుతో, “పడవను నీటి లోతుకు నడిపించి, చేపలు పట్టడానికి వలలు వేయి” అన్నారు.

  9. అందుకు సీమోను, “బోధకుడా, రాత్రంతా కష్టపడినా మేము ఏమి దొరకలేదు. అయినా నీవు చెప్పావు కాబట్టి నేను వలలను వేస్తాను” అని ఆయనతో అన్నాడు.

  10. వారు అలా చేసినప్పుడు, విస్తారమైన చేపలు వలల్లో పడి ఆ వలలు పిగిలిపోసాగాయి.

  11. ఆయన కొండ దిగి వారితో పాటు మైదానంలో నిలబడ్డారు. అక్కడ ఆయన శిష్యుల యొక్క గొప్ప జనసమూహం ఉంది, యూదయ అంతటి నుండి, యెరూషలేము నుండి, తూరు, సీదోను చుట్టూ ఉన్న తీరప్రాంతం నుండి వచ్చిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నారు.

  12. వారు ఆయన చెప్పే బోధను వినడానికి తమ వ్యాధుల నుండి స్వస్థత పొందడానికి వచ్చారు. అపవిత్రాత్మలు పీడిస్తున్న వారు కూడా బాగుపడ్డారు,

  13. ప్రజలందరూ ఆయనను ముట్టుకోవాలని ప్రయత్నించారు ఎందుకంటే, ఆయనలో నుండి ప్రభావం బయలుదేరి వారందరిని స్వస్థపరుస్తున్నది.

  14. ఆయన ఆ గ్రామ ద్వారాన్ని చేరినప్పుడు, చనిపోయిన వానిని బయటకు మోసుకొనిపోతున్నారు. వాని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు ఆమె ఒక విధవరాలు; ఆ గ్రామానికి సంబంధించిన ఒక పెద్ద గుంపు ఆమెతో పాటు ఉంది.

  15. ప్రభువు ఆమెను చూసి, ఆమె మీద కనికరపడి, “ఏడవవద్దు” అని ఆమెతో అన్నారు. దానిని మోసేవారు ఆగిపోయి నిలబడ్డారు.

  16. అప్పుడు ఆయన వారు మోసుకెళ్తున్న పాడెను ముట్టారు, దానిని మోస్తున్నవారు ఆగిపోయారు. అప్పుడు ఆయన, “నేను నీతో చెప్తున్నాను, చిన్నవాడా, లే!” అన్నారు.

  17. ఆ చనిపోయినవాడు లేచి కూర్చుని మాట్లాడడం మొదలుపెట్టాడు, యేసు వానిని అతని తల్లికి అప్పగించారు.

  18. ఆ సమయంలోనే యేసు అనేకమంది రోగులను, అనారోగ్యం గలవారిని, దయ్యాలు పట్టినవారిని స్వస్థపరచి, అనేకమంది గ్రుడ్డివారికి చూపునిచ్చారు.

  19. కాబట్టి యేసు వారితో, “మీరు వెళ్లి చూసినవాటిని, విన్నవాటిని యోహానుకు చెప్పండి; గ్రుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠురోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు వింటున్నారు, చనిపోయినవారు తిరిగి బ్రతుకుతున్నారు, పేదవారికి సువార్త ప్రకటించబడుతుంది.

  20. అక్కడ పద్దెనిమిది సంవత్సరాల నుండి అపవిత్రాత్మ చేత పట్టబడి నడుము వంగిపోయి నిటారుగా నిలబడలేకపోతున్న ఒక స్త్రీ ఉండింది.

  21. యేసు ఆమెను చూసి, ముందుకు రమ్మని పిలిచి, “అమ్మా, నీ బలహీనత నుండి నీవు విడుదల పొందావు” అని చెప్పారు.

  22. తర్వాత ఆయన ఆమె మీద చేతులుంచారు, వెంటనే ఆమె నిటారుగా నిలబడి దేవుని స్తుతించింది.

  23. అక్కడ ఆయన ముందు విపరీతమైన వాపుతో బాధపడుతున్న ఒక రోగి ఉన్నాడు.

  24. అప్పుడు యేసు, “సబ్బాతు దినాన స్వస్థపరచడం ధర్మశాస్త్రానుసారమా కాదా?” అని పరిసయ్యులను ధర్మశాస్త్ర నిపుణులను అడిగారు.

  25. కానీ వారు ఏ జవాబు ఇవ్వలేదు, అప్పుడు యేసు ఆ రోగి చేయి పట్టుకుని వానిని బాగుచేసి పంపించారు.