Skip to content

Absalom గురించి బైబిల్ వచనాలు

65 వచనాలు · 10 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. కర్మెలుకు చెందిన నాబాలుకు భార్యగా ఉన్న అబీగయీలుకు పుట్టిన కిల్యాబు అతని రెండవ కుమారుడు; గెషూరు రాజైన తల్మయి కుమార్తెయైన మయకాకు పుట్టిన అబ్షాలోము మూడవ కుమారుడు;

  2. అబ్షాలోము తన అన్న అమ్నోనుతో మంచి గాని చెడు గాని ఏమి మాట్లాడలేదు; తన చెల్లియైన తామారును అవమానపరిచాడు కాబట్టి అతడు అమ్నోనును ద్వేషించాడు.

  3. రెండు సంవత్సరాల తర్వాత, అబ్షాలోము యొక్క గొర్రెల బొచ్చు కత్తిరించేవారు ఎఫ్రాయిం సరిహద్దు దగ్గర ఉన్న బయల్-హసోరులో ఉన్నప్పుడు, అతడు రాజకుమారులందరినీ అక్కడికి విందుకు పిలిచాడు.

  4. అబ్షాలోము రాజు దగ్గరకు వచ్చి, “మీ సేవకుని యొక్క గొర్రెల బొచ్చు కత్తిరించే సమయం వచ్చింది. రాజు రాజ సేవకులు నాతో పాటు వస్తారా?” అన్నాడు.

  5. “లేదు, నా కుమారుడా, మేమందరం రావద్దు; మేము నీకు ఎక్కువ భారం అవుతాం” అని రాజు అన్నాడు. అబ్షాలోము రాజును బ్రతిమాలినా అతడు వెళ్లడానికి నిరాకరించి అతన్ని దీవించాడు.

  6. అప్పుడు అబ్షాలోము, “నీవు రాకపోతే నా అన్నయైన అమ్నోనును మాతో పంపించు” అన్నాడు. అందుకు రాజు, “అతడు మీతో ఎందుకు వెళ్లాలి?” అని అడిగాడు.

  7. అయితే అబ్షాలోము అతన్ని చాలా బ్రతిమిలాడాడు, కాబట్టి రాజు అమ్నోనును, మిగిలిన రాజకుమారులను అతనితో పంపాడు.

  8. తర్వాత అబ్షాలోము తన సేవకులను పిలిచి, “వినండి, అమ్నోను బాగా త్రాగి మత్తు ఎక్కినప్పుడు నేను మీతో, ‘అమ్నోనును కొట్టి చంపండి’ అని చెప్తాను. అప్పుడు మీరు అతన్ని చంపండి. భయపడకండి! మీకు ఆజ్ఞ ఇచ్చింది నేను కాదా? కాబట్టి ధైర్యంగా ఉండండి” అని ఆదేశించాడు.

  9. అబ్షాలోము ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమే అతని సేవకులు అమ్నోనును చంపేశారు. అప్పుడు రాజకుమారులంతా లేచి తమ కంచరగాడిదల మీద ఎక్కి పారిపోయారు.

  10. అబ్షాలోము పారిపోయి అమీహూదు కుమారుడు, గెషూరు రాజైన తల్మయి దగ్గరకు చేరాడు. రాజైన దావీదు చాలా రోజుల వరకు తన కుమారుని కోసం దుఃఖిస్తూనే ఉన్నాడు.

  11. అబ్షాలోము పారిపోయి గెషూరుకు వెళ్లి అక్కడ మూడు సంవత్సరాలు ఉన్నాడు.

  12. రాజు అబ్షాలోము మీద మనస్సు పెట్టుకున్నాడని సెరూయా కుమారుడైన యోవాబు గ్రహించాడు.

  13. కాబట్టి యోవాబు తెకోవాకు ఒకరిని పంపించి అక్కడినుండి ఒక తెలివైన స్త్రీని తెప్పించాడు. అతడు ఆమెతో, “నీవు దుఃఖంలో ఉన్నట్లు నటించు, దుఃఖ వస్త్రాలను ధరించు, ఎలాంటి సౌందర్య అలంకరణలను ఉపయోగించవద్దు. చనిపోయినవారి కోసం దుఃఖిస్తూ చాలా రోజులు గడిపిన స్త్రీలా నటించు.

  14. రాజు దగ్గరకు వెళ్లి అతనితో ఈ మాటలు చెప్పు” అని చెప్పి ఏమి మాట్లాడాలో యోవాబు ఆమెకు నేర్పాడు.

  15. ఆ తెకోవా స్త్రీ రాజు దగ్గరకు వెళ్లి తన తల నేలకు ఆనించి నమస్కారం చేసి, “ఓ రాజా! నాకు సహాయం చేయండి!” అని వేడుకొంది.

  16. “నీకు వచ్చిన కష్టం ఏంటి?” అని రాజు ఆమెను అడిగాడు. అందుకామె, “నేను విధవరాలిని; నా భర్త చనిపోయాడు.

  17. నీ సేవకురాలినైన నాకు ఇద్దరు కుమారులు. వారు పొలంలో ఒకరితో ఒకరు పోట్లాడుకున్నారు. వారిని వేరు చేయడానికి అక్కడ ఎవరూ లేకపోవడంతో ఒకడు ఇంకొకడిని కొట్టి చంపేశాడు.

  18. ఇప్పుడు నా కుటుంబమంతా నీ సేవకురాలినైన నా మీదికి లేచి, ‘తన సోదరుని కొట్టి చంపినవాన్ని మాకు అప్పగించు. వాడు తన సోదరుని చంపాడు కాబట్టి మేము వాన్ని చంపాలి: అప్పుడు వారసుడే లేకుండ పోతాడు’ అని వారు అంటున్నారు. వారు నా భర్త పేరును గాని వారసులను గాని భూమి మీద మిగలకుండా, నా దగ్గర మిగిలి ఉన్న ఏకైక మండే బొగ్గును చల్లార్చాలని చూస్తున్నారు” అని చెప్పింది.

  19. అందుకు రాజు, “నీవు ఇంటికి వెళ్లు, నీ గురించి నేను ఆజ్ఞ ఇస్తాను” అని ఆమెతో చెప్పాడు.

  20. అప్పుడు తెకోవా స్త్రీ, “నా ప్రభువైన రాజు నన్ను నా కుటుంబాన్ని క్షమించును గాక, రాజు, వారి సింహాసనం నిర్దోషంగా ఉండును గాక” అని రాజుతో చెప్పింది.

  21. అందుకు రాజు, “ఎవరైనా దీని గురించి నిన్ను ఏమైనా అంటే వారిని నా దగ్గరకు తీసుకురా, వారు మరలా నిన్ను ఇబ్బంది పెట్టరు” అన్నాడు.

  22. ఆమె, “అయితే, రక్తానికి ప్రతీకారం తీర్చుకునేవాడు ఇంకెక్కువ నాశనం చేయకుండా నిరోధించడానికి రాజు తన దేవున్ని ప్రార్థించాలి, తద్వార నా కుమారుడు నాశనానికి గురి కాకుండా ఉంటాడు” అని చెప్పింది. అందుకు రాజు, “సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, నీ కుమారుని తలవెంట్రుకలలో ఒకటి కూడా నేల రాలదు” అన్నాడు.

  23. అప్పుడు ఆమె, “నా ప్రభువైన రాజుతో మీ సేవకురాలినైన నన్ను ఒక మాట చెప్పనివ్వండి” అన్నాడు. అప్పుడు రాజు, “చెప్పు” అన్నాడు.

  24. ఆ స్త్రీ ఇలా చెప్పింది, “మీరు దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఇలాంటి పని ఎందుకు చేశారు? రాజు ఇలా చెప్పినప్పుడు, బహిష్కరించబడిన తన కుమారున్ని రాజు తిరిగి తీసుకురాలేదు కాబట్టి తాను దోషి కావడం లేదా?

  25. మనమందరం చనిపోతాం గదా. ఒకసారి నేల మీద ఒలికిన తర్వాత మరలా ఎత్తలేని నీళ్లలా ఉన్నాము. అయితే దేవుడు కోరుకునేది ఇది కాదు; వెలివేయబడినవారు తన దగ్గరకు తిరిగి రావడానికి ఆయన మార్గాలు ఏర్పరుస్తారు.