Przejdź do treści
2 దినవృత్తాంతములు 32:3-23

2 దినవృత్తాంతములు 32:3-23

3
అతడు తన అధికారులను, సైన్యాధిపతులను సంప్రదించాడు. పట్టణం బయట ఉన్న నీటి ఊటల నుండి నీరు సరఫరా కాకుండా చేయాలని వారు నిర్ణయించారు. వారు అతనికి తోడుగా నిలిచారు.
4
వారు పెద్ద గుంపుగా చేరి, “అష్షూరు రాజులు వచ్చి ఇక్కడ పుష్కలమైన నీరు ఉన్నట్లు తెలుసుకోవడం ఎందుకు?” అనుకుని ఆ ప్రాంతం గుండా ప్రవహించే నీటి ఊటలన్నిటిని, ప్రవాహాన్ని అడ్డుకున్నారు.
5
అప్పుడు అతడు గోడలో విరిగిన భాగాలన్నిటినీ మరమ్మత్తు చేసి, దానిపై బురుజులను నిర్మించాడు. అతడు దాని బయట మరొక గోడను కట్టించి, దావీదు నగరం మిద్దెలను బలోపేతం చేశాడు. అతడు పెద్ద సంఖ్యలో ఆయుధాలు డాళ్ళు కూడా తయారు చేయించాడు.
6
అతడు ప్రజలపై సైనిక అధికారులను నియమించి పట్టణ ద్వారం దగ్గర ఉన్న కూడలిలో తన ముందుకు వారిని పిలిపించి వారినిలా హెచ్చరించాడు:
7
“బలంగా ధైర్యంగా ఉండండి. అష్షూరు రాజును అతనితో ఉన్న పెద్ద సైన్యాన్ని చూసి భయపడవద్దు, నిరుత్సాహపడవద్దు. అతని దగ్గర కన్నా మన దగ్గర గొప్ప శక్తి ఉంది.
8
అతనికి కేవలం మానవ బలం మాత్రమే ఉంది, కానీ మనకు సహాయం చేయడానికి, మన యుద్ధాలలో పోరాడడానికి మన దేవుడైన యెహోవా మనతో ఉన్నారు” అని చెప్పాడు. అప్పుడు ప్రజలు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటలనుబట్టి ధైర్యం తెచ్చుకున్నారు.
9
తర్వాత, అష్షూరు రాజైన సన్హెరీబు అతని సైన్యాలన్నీ లాకీషును ముట్టడించినప్పుడు, అతడు యూదా రాజైన హిజ్కియాకు అక్కడ ఉన్న యూదా ప్రజలందరికి ఈ సందేశం ఇవ్వడానికి తన అధికారులను యెరూషలేముకు పంపాడు:
10
“అష్షూరు రాజు సన్హెరీబు ఇలా అంటున్నాడు: మీరు ముట్టిడిలో ఉన్న యెరూషలేములో ఉన్నారు. దేన్ని చూసుకుని మీకు ఈ ధైర్యం?
11
హిజ్కియా, ‘మన దేవుడైన యెహోవా మనలను అష్షూరు రాజు చేతి నుండి రక్షిస్తాడు’ అని చెప్తున్నాడంటే, మీరు ఆకలితో దాహంతో చనిపోయేలా అతడు మిమ్మల్ని తప్పుత్రోవ పట్టిస్తున్నాడు.
12
హిజ్కియా స్వయంగా ఈ దేవుని ఉన్నత స్థలాలను బలిపీఠాలను తొలగించి, యూదా వారితో యెరూషలేము వారితో, ‘మీరు ఒక్క బలిపీఠం దగ్గర ఆరాధించి దానిపై బలులు అర్పించాలి’ అని చెప్పలేదా?
13
“నేను నా పూర్వికులు ఇతర దేశాల ప్రజలందరికి ఏమి చేశామో మీకు తెలియదా? ఆ దేశాల దేవుళ్ళు ఎప్పుడైనా తమ దేశాన్ని నా చేతిలో నుండి విడిపించుకోగలిగారా?
14
ఈ దేశాల దేవుళ్ళలో ఎవరైనా తమ ప్రజలను నా నుండి రక్షించగలిగారా? అలాంటప్పుడు మీ దేవుడు మిమ్మల్ని నా చేతిలో నుండి ఎలా విడిపించగలడు?
15
ఇప్పుడు హిజ్కియా మిమ్మల్ని మోసం చేసి ఇలా తప్పుత్రోవ పట్టనివ్వకండి. అతన్ని నమ్మవద్దు, ఎందుకంటే ఏ దేశానికి ఏ రాజ్యానికి చెందిన ఏ దేవుడు కూడా తన ప్రజలను నా చేతిలో నుండి గాని నా పూర్వికుల చేతి నుండి గాని రక్షించలేకపోయాడు. అలాంటప్పుడు మీ దేవుడు నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించడం అసాధ్యం!”
16
సన్హెరీబు అధికారులు దేవుడైన యెహోవాకు ఆయన సేవకుడైన హిజ్కియాకు వ్యతిరేకంగా ఇంకా మాట్లాడారు.
17
రాజు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను హేళన చేస్తూ ఉత్తరాలు వ్రాసి ఆయనకు వ్యతిరేకంగా ఇలా అన్నాడు: “ఇతర దేశాల ప్రజల దేవతలు తమ ప్రజలను నా చేతిలో నుండి రక్షించనట్లే, హిజ్కియా దేవుడు తన ప్రజలను నా చేతి నుండి రక్షించలేడు.”
18
అప్పుడు వారు పట్టణాన్ని పట్టుకోవాలన్న ఉద్దేశంతో, గోడమీదున్న యెరూషలేముకు ప్రజలను బెదిరించడానికి భయపెట్టడానికి హెబ్రీ భాషలో బిగ్గరగా వారితో మాట్లాడారు.
19
వారు భూమిమీద ఇతర జనాంగాల కోసం మనుష్యులు తయారుచేసిన దేవతల గురించి మాట్లాడినట్లు యెరూషలేము యొక్క దేవుని గురించి మాట్లాడారు.
20
రాజైన హిజ్కియా, ఆమోజు కుమారుడును, ప్రవక్తయునైన యెషయా ఈ విషయం గురించి ప్రార్థించి ఆకాశం వైపు మొరపెట్టారు.
21
యెహోవా ఒక దూతను పంపారు. అతడు అష్షూరు రాజు శిబిరంలో ఉన్న పోరాట యోధులందరినీ, అధిపతులను, అధికారులందరినీ నాశనం చేశాడు. కాబట్టి అష్షూరురాజు అవమానంతో తన దేశానికి వెళ్లిపోయాడు. అతడు తన దేవుని గుడిలోకి వెళ్లినప్పుడు, అతని కుమారులలో కొందరు ఖడ్గంతో అతన్ని నరికివేశారు.
22
కాబట్టి యెహోవా హిజ్కియాను, యెరూషలేము ప్రజలను అష్షూరు రాజు సన్హెరీబు చేతి నుండి ఇతరులందరి చేతిలో నుండి రక్షించారు. ఆయన అన్ని వైపుల నుండి వారిని కాపాడారు.
23
చాలామంది యెరూషలేములో యెహోవాకు అర్పణలను యూదా రాజైన హిజ్కియాకు విలువైన వస్తువులు తెచ్చారు. అందువల్ల అతడు అప్పటినుండి అన్ని రాజ్యాల దృష్టిలో ఘనత పొందాడు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options