Unfaithfulness గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
చావుకు కొనిపోబడుతున్న వారిని రక్షించు; మరణం వైపు తూగుతున్న వారిని వెనుకకు లాగు.
“కాని దీని గురించి మాకు ఏమి తెలియదు” అని నీవంటే, హృదయాలను తూకం వేసేవాడు నీ మాటను గ్రహించడా? నీ ప్రాణాన్ని కాచేవానికి తెలియదా? ప్రతి వ్యక్తికి తన క్రియలకు తగినట్టుగా తిరిగి చెల్లించడా?
నా ప్రియుని గురించి పాడతాను. తన ద్రాక్షతోట గురించి పాట పాడతాను: సారవంతమైన కొండమీద నా ప్రియునికి ఒక ద్రాక్షతోట ఉండేది.
ఆయన దానిని త్రవ్వి రాళ్లను ఏరి బాగుచేసి అందులో శ్రేష్ఠమైన ద్రాక్షతీగెలు నాటాడు. దానిలో కాపలా గోపురం కట్టాడు ద్రాక్షతొట్టిని తొలిపించాడు. మంచి ద్రాక్షపండ్లు కాయాలని ఆయన ఎదురుచూశాడు, కాని దానిలో చెడ్డ ద్రాక్షలు కాసాయి.
“కాబట్టి యెరూషలేము నివాసులారా, యూదా ప్రజలారా, నాకు, నా ద్రాక్షతోటకు మధ్య న్యాయం చేయండి.
నేను నా ద్రాక్షతోటకు చేసిన దానికంటే దానికి ఇంకేమి చేయాలి? మంచి ద్రాక్షపండ్ల కోసం నేను చూస్తే ఎందుకు అది చెడ్డ ద్రాక్షలను కాసింది?
నా ద్రాక్షతోటకు నేనేమి చేయబోతున్నానో ఇప్పుడు మీకు చెప్తాను. దాని కంచె నేను తీసివేస్తాను అప్పుడు అది నాశనం అవుతుంది; దాని గోడను పడగొడతాను అప్పుడు అది త్రొక్కబడుతుంది.
నేను దానిని బంజరు భూమిలా చేస్తాను, అది త్రవ్వరు, సాగు చేయరు, అక్కడ గచ్చపొదలు ముళ్ళచెట్లు పెరుగుతాయి. దానిపై వర్షం కురిపించవద్దని మేఘాలను ఆజ్ఞాపిస్తాను.”
ఇశ్రాయేలు వంశం సైన్యాల యెహోవా ద్రాక్షతోట, యూదా ప్రజలు ఆయన ఆనందించే ద్రాక్షలు. ఆయన న్యాయం కోసం చూడగా రక్తపాతం కనబడింది; నీతి కోసం చూడగా రోదనలు వినబడ్డాయి.
ఇశ్రాయేలు విస్తరించిన ద్రాక్షచెట్టు; అతడు బాగా ఫలించాడు. అతడు ఫలించినకొద్దీ, అతడు ఎక్కువ బలిపీఠాలను కట్టాడు. అతని భూమి సారవంతమైన కొద్ది, అతడు తన పవిత్ర రాళ్లను అలంకరించాడు.
వారి హృదయం కపటమైనది, ఇప్పుడు వారు తమ అపరాధానికి శిక్షను భరించాలి. యెహోవా వారి బలిపీఠాలను పడగొట్టి, వారి పవిత్ర రాళ్లను నాశనం చేస్తారు.
ఇప్పటికే గొడ్డలి చెట్ల వేరు దగ్గర పెట్టబడింది. మంచి పండ్లు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది.
కలిగినవానికి మరి ఎక్కువగా ఇవ్వబడుతుంది, అతడు సమృద్ధిగా కలిగి ఉంటాడు. లేనివాని నుండి, వానికి కలిగి ఉన్నది కూడా తీసివేయబడుతుంది.
అప్పుడు ఆ దారి ప్రక్కన ఉన్న ఒక అంజూర చెట్టును చూసి, దాని దగ్గరకు వెళ్లారు కాని దానికి ఆకులు తప్ప మరేమీ కనిపించలేదు, కాబట్టి, “ఇకమీదట ఎన్నడు నీకు కాయలు కాయవు” అని దానితో చెప్పగా వెంటనే ఆ చెట్టు ఎండిపోయింది.
శిష్యులు అది చూసి, ఆశ్చర్యపడ్డారు. “ఆ అంజూర చెట్టు అంత త్వరగా ఎలా ఎండిపోయింది?” అని అడిగారు.
“మరొక ఉపమానం వినండి: ఒక యజమాని తన పొలంలో ద్రాక్షతోటను నాటాడు. అతడు దాని చుట్టూ కంచె వేయించి, అందులో ద్రాక్ష గానుగ తొట్టి తొలిపించి, కాపలా కాయడానికి ఎత్తైన గోపురం కట్టించాడు. తర్వాత ఆ ద్రాక్షతోటను కొందరు కౌలురైతులకు అద్దెకు ఇచ్చి దూర దేశానికి వెళ్లిపోయాడు.
కోతకాలం సమీపించినప్పుడు పంటలో తన వంతును తీసుకుని రమ్మని ఆ రైతుల దగ్గరకు తన దాసులను పంపాడు.
“ఆ రైతులు అతని దాసులను పట్టుకున్నారు; వారు ఒకని కొట్టారు, ఒకని చంపారు, మరొకని మీద రాళ్లు విసిరారు.
ఆ యజమాని ఇతర దాసులను, మొదటిసారి కంటే ఎక్కువ మంది పంపాడు, ఆ కౌలు రైతులు వీరిని కూడా ముందు చేసినట్టే చేశారు.
చివరికి ఆ యజమాని, ‘వారు నా కుమారున్ని గౌరవిస్తారు’ అనుకుని, తన కుమారుని వారి దగ్గరకు పంపాడు.
“కాని ఆ కౌలు రైతులు కుమారుని చూసి ‘ఇతడే వారసుడు, రండి ఇతన్ని చంపి ఇతని వారసత్వాన్ని తీసుకుందాం’ అని తమలో తాము చెప్పుకొన్నారు.
కాబట్టి వారు అతన్ని బయటకు తీసుకెళ్లి, చంపి, అతని శరీరాన్ని ద్రాక్షతోట బయట పడవేశారు.
“అప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని వచ్చినప్పుడు ఆ కౌలురైతులను ఏమి చేస్తాడు?”
అందుకు, “ఆ దుష్టులను కఠినంగా నిర్మూలం చేస్తాడు, కోతకాలంలో తనకు రావలసిన పంటను సక్రమంగా చెల్లించే వేరే కౌలురైతులకు ఆ ద్రాక్షతోటను అద్దెకు ఇస్తాడు” అని వారు జవాబిచ్చారు.
అయితే యేసు వారితో, “లేఖనాల్లో ఈ వాక్యం మీరు ఎప్పుడు చదువలేదా: “ ‘ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి మూలరాయి అయ్యింది. ఇది ప్రభువే చేశారు, ఇది మా కళ్లకు ఆశ్చర్యంగా ఉంది.’