The Second Temple గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
పర్షియా రాజైన కోరెషు పాలన మొదటి సంవత్సరంలో, యిర్మీయా చెప్పిన యెహోవా మాటను నెరవేర్చడానికి, తన రాజ్యమంతటా ఒక ప్రకటన చేసేలా దానిని వ్రాతపూర్వకంగా ఉంచేలా యెహోవా పర్షియా రాజైన కోరెషు హృదయాన్ని ప్రేరేపించారు:
“పర్షియా రాజైన కోరెషు చెప్పేది ఇదే: “ ‘పరలోకపు దేవుడైన యెహోవా నాకు భూమిపై ఉన్న అన్ని రాజ్యాలను ఇచ్చారు. యూదాలోని యెరూషలేములో తనకు మందిరాన్ని నిర్మించడానికి నన్ను నియమించారు.
మీ మధ్య ఉన్న ఆయన ప్రజల్లో ఎవరైనా యూదాలోని యెరూషలేముకు వెళ్లి మందిరాన్ని నిర్మించవచ్చు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా, యెరూషలేములో ఉన్న దేవుడైన వారి దేవుడు వారికి తోడుగా ఉండును గాక.
మిగిలి ఉన్నవారు ఇప్పుడు ఏ ప్రాంతంలో నివసిస్తున్నారో ఆ ప్రాంతం ప్రజలు వారికి వెండి, బంగారాలను, సామాగ్రిని, పశువులను యెరూషలేములోని దేవుని ఆలయానికి స్వేచ్ఛార్పణలు ఇవ్వాలి.’ ”
అంతేకాదు, నెబుకద్నెజరు యెరూషలేము నుండి తీసుకెళ్లి తన దేవుని గుడిలో ఉంచిన యెహోవా ఆలయానికి సంబంధించిన వస్తువులను రాజైన కోరెషు బయటకు తెప్పించాడు.
పర్షియా రాజైన కోరెషు తన కోశాధికారియైన మిత్రిదాతుతో వాటిని తెప్పించి, అతడు వాటిని లెక్కించి, వాటిని యూదా నాయకుడైన షేష్బజ్జరుకు అప్పగించాడు.
ఆ జాబితాలో ఉన్న వస్తువులు: బంగారు పాత్రలు 30; వెండి పాత్రలు 1,000; వెండి కడాయిలు 29;
బంగారు గిన్నెలు 30; వెండి గిన్నెలు 410; ఇతర వస్తువులు 1,000.
వెండి బంగారు వస్తువులు అన్ని కలిపి మొత్తం 5,400. షేష్బజ్జరు వీటన్నిటితో పాటు బబులోనులో బందీలుగా ఉండి విడిపించబడిన వారందరిని తీసుకుని యెరూషలేముకు వెళ్లాడు.
ఏడవ నెలలో ఇశ్రాయేలీయులు తమ పట్టణాల్లో స్థిరపడినప్పుడు, ప్రజలు ఒక్కటిగా యెరూషలేములో సమావేశమయ్యారు.
అప్పుడు యోజాదాకు కుమారుడైన యెషూవ, అతని తోటి యాజకులు, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, అతని తోటి పనివారు దైవజనుడైన మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రకారంగా దహనబలులు అర్పించడానికి ఇశ్రాయేలీయుల దేవునికి బలిపీఠాన్ని కట్టడం మొదలుపెట్టారు.
వీరికి అక్కడి ప్రజల భయం ఉన్నా, బలిపీఠాన్ని దాని పునాదుల మీదనే కట్టి, ఉదయ సాయంత్రాల్లో యెహోవాకు దహనబలులు క్రమంగా అర్పిస్తూ వచ్చారు.
తర్వాత ధర్మశాస్త్రంలో వ్రాయబడిన విధంగా గుడారాల పండుగ చేసుకుని నియమించబడిన సంఖ్య ప్రకారం ప్రతిరోజు దహనబలులు అర్పించారు.
దాని తర్వాత క్రమంగా దహనబలులు, అమావాస్య బలులు, యెహోవా యొక్క పరిశుద్ధ పండుగలకు అర్పించవలసిన బలులు, అదే విధంగా ఒక్కొక్కరు తీసుకువచ్చిన స్వేచ్ఛార్పణలు అర్పించారు.
యెహోవా ఆలయానికి ఇంకా పునాది వేయనప్పటికి, ఏడవ నెల మొదటి రోజు నుండి వారు యెహోవాకు దహనబలులు అర్పించడం మొదలుపెట్టారు.
అప్పుడు వారు తాపీ మేస్త్రీలకు, వడ్రంగులకు డబ్బులు ఇచ్చారు. పర్షియా రాజైన కోరెషు ఆదేశం ప్రకారం దేవదారు మ్రానులను సముద్రం ద్వారా లెబానోను నుండి యొప్ప పట్టణానికి చేర్చడానికి సీదోనీయులకు, తూరువారికి భోజనపదార్థాలు, ఒలీవనూనె ఇచ్చారు.
యెరూషలేములోని దేవుని ఆలయానికి వారు వచ్చిన రెండవ సంవత్సరం రెండవ నెలలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, యోజాదాకు కుమారుడైన యెషూవ యాజకులు, ఇతర ప్రజలు (యాజకులు, లేవీయులు, బందీ నుండి విడుదల పొంది యెరూషలేముకు వచ్చిన వారందరు) పని ప్రారంభించారు. లేవీయులలో ఇరవై సంవత్సరాలకన్నా ఎక్కువ వయస్సున్న వారిని యెహోవా మందిరపు పనిని పర్యవేక్షించడానికి నియమించారు.
వీరితో పాటు యెషూవ అతని కుమారులు, అతని సోదరులు, కద్మీయేలు అతని కుమారులు (యూదా వారసులు), హేనాదాదు కుమారులు, వారి సోదరులైన లేవీయులందరు దేవుని మందిరపు పనిని పర్యవేక్షించడానికి నియమించబడ్డారు.
నిర్మించేవారు యెహోవా ఆలయానికి పునాది వేసినప్పుడు ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన ప్రకారం యాజకులు ప్రత్యేక వస్త్రాలను ధరించి బూరలు పట్టుకుని, ఆసాపు కుమారులైన లేవీయులు తాళాలు పట్టుకుని యెహోవాను కీర్తించడానికి తమ తమ స్థానాల్లో నిలబడ్డారు.
కృతజ్ఞతా స్తుతులతో వారు యెహోవాకు ఈ పాట పాడారు: “ఆయన మంచివారు. ఇశ్రాయేలీయులపై ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.” యెహోవా మందిర పునాది వేస్తున్నప్పుడు ప్రజలందరు బిగ్గరగా గొంతెత్తి యెహోవాను స్తుతించారు.
అయితే గతంలో ఉన్న మందిరాన్ని తమ కళ్లతో చూసిన వృద్ధులైన యాజకులు, లేవీయులు, నాయకులు చాలామంది, ఇప్పుడు వేస్తున్న మందిర పునాదిని చూసి గట్టిగా ఏడ్చారు. మరికొందరు సంతోషంతో కేకలు వేశారు.
అక్కడ ఉన్న ప్రజలు చాలా పెద్దగా శబ్దం చేయడంతో సంతోషంతో వేసిన కేకలకు, దుఃఖంతో వేసిన కేకలకు తేడా తెలుసుకోలేకపోయారు. ఆ శబ్దం చాలా దూరం వరకు వినబడింది.
చెర నుండి వచ్చినవారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరాన్ని కడుతున్నారని యూదా, బెన్యామీనీయుల శత్రువులు విని,
జెరుబ్బాబెలు దగ్గరకు, కుటుంబ పెద్దల దగ్గరకు వచ్చి, “అష్షూరు రాజైన ఏసర్హద్దోను మమ్మల్ని ఇక్కడకు తీసుకుని వచ్చినప్పటి నుండి మీలాగే మేము కూడా మీ దేవుని వెదకుతున్నాం, ఆయనకు బలులు అర్పిస్తూ ఉన్నాం కాబట్టి నిర్మాణంలో మేము మీకు సహాయం చేస్తాం” అన్నారు.
అయితే జెరుబ్బాబెలు, యెషూవ, మిగిలిన కుటుంబ పెద్దలు, “మా దేవుని ఆలయ నిర్మాణంలో మీకు పాలు లేదు. పర్షియా రాజైన కోరెషు మాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు మందిరాన్ని మేమే కడతాం” అన్నారు.