లూకా 22:31-55
31
“సీమోనూ, సీమోనూ, సాతాను గోధుమలను జల్లించినట్లు నిన్ను జల్లించాలని అడిగాడు.
32
కానీ నీ విశ్వాసం తప్పిపోకుండా ఉండాలని నేను నీకోసం ప్రార్థించాను. అయితే నీవు స్థిరపడిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచు” అని చెప్పారు.
33
కానీ పేతురు, “ప్రభువా, నీతో కూడ చెరలోనికే కాదు చావటానికైనా నేను సిద్ధమే” అన్నాడు.
34
అందుకు యేసు, “పేతురూ, ఈ రోజే కోడి కూయక ముందే, నేను నీకు తెలియదని మూడుసార్లు చెప్తావు అని నీతో చెప్తున్నాను” అన్నారు.
35
ఇంకా ఆయన, “మీకు డబ్బు సంచి, సంచి, చెప్పులు లేకుండ నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనా తక్కువైనదా?” అని వారిని అడిగారు. దానికి వారు, “ఏమి తక్కువ కాలేదు” అన్నారు.
36
అందుకు ఆయన వారితో, “అయితే ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర డబ్బు సంచి ఉంటే, దాన్ని తీసుకెళ్లాలి. ఒకవేళ మీ దగ్గర ఖడ్గం లేకపోతే, మీ పైవస్త్రాన్ని అమ్మి ఖడ్గాన్ని కొనుక్కోవాలి.
37
‘ఆయన అపరాధులలో ఒకనిగా ఎంచబడ్డాడు’ అని వ్రాయబడి ఉంది; నా విషయంలో ఇది నెరవేర్చబడాలి. అవును, నా గురించి వ్రాయబడినవి నెరవేరబోతున్నాయి” అని అన్నారు.
38
శిష్యులు, “ఇదిగో ప్రభువా, ఇక్కడ రెండు ఖడ్గాలు ఉన్నాయి” అన్నారు. ఆయన వారితో, “అవి చాలు!” అని జవాబిచ్చారు.
39
భోజనమైన తర్వాత ఆయన బయలుదేరి తన అలవాటు ప్రకారం ఒలీవ కొండకు వెళ్లారు, ఆయన శిష్యులు ఆయనను వెంబడించారు. వారు అక్కడ చేరిన తర్వాత, ఆయన వారితో, “మీరు శోధనలో పడిపోకుండా ఉండడానికి ప్రార్థన చేయండి” అని చెప్పారు.
41
అలా చెప్పి వారి నుండి ఒక రాయి విసిరేంత దూరం వెళ్లి, మోకరించి ఇలా ప్రార్థించారు:
42
“తండ్రీ, నీ చిత్తమైతే, ఈ గిన్నెను నా నుండి తీసివేయి, అయినా నా చిత్తం కాదు, నీ చిత్త ప్రకారమే చేయి.”
43
అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచాడు.
44
ఆయన బహు వేదనతో, మరింత పట్టుదలతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమట రక్త బిందువుల్లా నేల మీద పడుతూ ఉంది.
45
ఆయన ప్రార్థనలో నుండి లేచి శిష్యుల దగ్గరకు తిరిగివచ్చి, వారు దుఃఖంతో అలసి, నిద్రిస్తున్నారని చూశారు
46
ఆయన వారితో, “మీరెందుకు నిద్రపోతున్నారు? శోధనలో పడిపోకుండా లేచి ప్రార్థన చేయండి” అని చెప్పారు.
47
ఆయన ఇంకా మాట్లాడుతుండగా, ప్రజలు గుంపుగా వచ్చారు, పన్నెండుగురిలో ఒకడైన యూదా అని పిలువబడే వాడు ముందుండి వారిని నడిపించాడు. వాడు యేసుని ముద్దు పెట్టుకోవడానికి ఆయన దగ్గరకు వచ్చాడు.
48
అయితే యేసు వానితో, “యూదా, నీవు ముద్దుతో మనుష్యకుమారుని అప్పగిస్తున్నావా?” అని చెప్పారు.
49
యేసుతో ఉన్నవారు జరుగబోయేది గ్రహించి, “ప్రభువా, వారిని ఖడ్గంతో నరకమంటావా?” అని ఆయనను అడిగారు.
50
అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని సేవకుడిని కొట్టి, వాని కుడి చెవిని నరికాడు.
51
అయితే యేసు, “అంతటితో ఆపండి!” అని చెప్పి, వాని చెవిని ముట్టి స్వస్థపరిచారు.
52
యేసు తనను పట్టుకోవడానికి వచ్చిన ముఖ్య యాజకులతో, దేవాలయ కావలివారి అధికారులతో యూదా నాయకులతో, “నన్ను పట్టుకోవడానికి కత్తులతో కర్రలతో వచ్చారు, నేను ఏమైన తిరుగుబాటు చేస్తున్నానా?
53
నేను ప్రతిరోజు దేవాలయ ఆవరణంలో కూర్చుని బోధించేటప్పుడు నాపై ఒక చేయి కూడ వేయలేదు. అయినా ఇప్పుడు ఇది మీ సమయం, చీకటి పరిపాలిస్తున్న సమయం” అన్నారు.
54
వారు యేసును బంధించి, ప్రధాన యాజకుని ఇంటికి తీసుకెళ్లారు. అప్పుడు పేతురు దూరం నుండి వారిని వెంబడించాడు.
55
అక్కడ కొందరు ప్రాంగణం మధ్యలో మంటలు వేసి, కలిసి కూర్చున్నప్పుడు, పేతురు వారితో కూర్చున్నాడు.
Settings