యోహాను 1:1-29
1
ఆదిలో వాక్యం ఉన్నది. ఆ వాక్యం దేవునితో ఉన్నది, ఆ వాక్యమే దేవుడు.
2
ఆయన ఆదిలో దేవునితో ఉన్నారు.
3
సృష్టిలో ఉన్నవన్నీ ఆయన ద్వారానే కలిగాయి, కలిగింది ఏదీ ఆయన లేకుండా కలుగలేదు.
4
ఆయనలో జీవం ఉన్నది. ఆ జీవం మానవులందరికి వెలుగుగా ఉన్నది.
5
ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది కాని, చీకటి ఆ వెలుగును గ్రహించలేకపోతుంది.
6
యోహాను అనే పేరుగల ఒక వ్యక్తి దేవుని దగ్గర నుండి పంపబడ్డాడు.
7
ప్రజలందరు తన ద్వారా ఆ వెలుగును నమ్మాలని ఆ వెలుగుకు సాక్షిగా అతడు వచ్చాడు.
8
అయితే అతడు ఆ వెలుగు కాదు కాని, ఆ వెలుగు గురించి సాక్ష్యం చెప్పడానికి మాత్రమే వచ్చాడు.
9
ప్రతి వ్యక్తికి వెలుగునిచ్చే నిజమైన వెలుగు ఈ లోకంలోనికి వస్తూ ఉండేది.
10
ఆయన వలననే లోకం కలిగింది కాని, ఆయన లోకంలో ఉన్నపుడు లోకం ఆయనను గుర్తించలేదు.
11
ఆయన తన సొంత ప్రజల దగ్గరకు వచ్చారు, కాని వారు ఆయనను అంగీకరించలేదు.
12
అయినా ఆయనను ఎందరు అంగీకరించారో వారందరికి, అనగా తన పేరును నమ్మిన వారికందరికి దేవుని పిల్లలుగా అయ్యే అధికారాన్ని ఆయన ఇచ్చారు.
13
ఈ పిల్లలు శరీర కోరికల వలన, మానవుల నిర్ణయాల వలన, భర్త కోరిక వలన పుట్టలేదు కాని దేవుని మూలంగా పుట్టారు.
14
ఆ వాక్యం శరీరాన్ని ధరించుకొని మన మధ్య నివసించింది. మనం ఆయన మహిమను చూశాం, కృపాసత్య సంపూర్ణుడై, తండ్రి దగ్గర నుండి వచ్చిన, ఏకైక కుమారుని మహిమను చూశాము.
15
యోహాను ఆయన గురించి సాక్ష్యం చెప్తూ, “నేను చెప్పిన వాడు ఈయనే, ‘నా తర్వాత వచ్చేవాడు నాకన్నా గొప్పవాడు ఎందుకంటే ఆయన నాకన్నా ముందు నుండి ఉన్నవాడు’ ” అని బిగ్గరగా కేక వేసి చెప్పాడు.
16
ఆయన సంపూర్ణతలో నుండి మనం అందరం కృప వెంబడి కృపను పొందాము.
17
ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడింది కాని కృప, సత్యం యేసు క్రీస్తు ద్వారా వచ్చాయి.
18
ఎవ్వరూ ఎన్నడును దేవుని చూడలేదు, కానీ తానే దేవుడై ఉండి, తండ్రితో అత్యంత సమీప సంబంధం కలిగి ఉన్న ఏకైక కుమారుడే ఆయనను మనకు తెలియపరిచారు.
19
యెరూషలేములోని యూదా అధికారులు అతడు ఎవరో తెలుసుకోవడానికి యాజకులను, లేవీయులను యోహాను దగ్గరకు పంపినప్పుడు అతడు వారికి ఇచ్చిన సాక్ష్యం ఇదే.
20
అతడు నాకు తెలియదు అని చెప్పకుండా “నేను క్రీస్తును కాను” అని ధైర్యంగా ఒప్పుకున్నాడు.
21
అప్పుడు వారు, “అయితే నీవెవరవు? నీవు ఏలీయావా?” అని అడిగారు. అతడు, “కాదు” అని చెప్పాడు. అయితే, “నీవు ప్రవక్తవా?” అని అడిగారు. అతడు, “కాదు” అని జవాబిచ్చాడు.
22
చివరికి వారు, “నీవెవరవు? మమ్మల్ని పంపినవారికి మేము సమాధానం చెప్పడానికి నీ గురించి నీవు ఏమి చెప్తావు?” అని అడిగారు.
23
అందుకు యోహాను, యెషయా ప్రవక్త చెప్పిన మాటలతో జవాబిచ్చాడు, “ ‘ప్రభువు కోసం మార్గాన్ని సరాళం చేయండి అని అరణ్యంలో ఎలుగెత్తి చెప్తున్న స్వరం నేనే’ ” అన్నాడు.
24
అప్పుడు పంపబడిన పరిసయ్యులు,
25
“నీవు క్రీస్తువు కాదు, ఏలీయావు కాదు, ప్రవక్తవు కాదు, అలాంటప్పుడు ఎందుకు బాప్తిస్మం ఇస్తున్నావు?” అని అతన్ని ప్రశ్నించారు.
26
అందుకు యోహాను, “నేను నీటితో బాప్తిస్మమిస్తున్నాను, కాని మీ మధ్య నిలబడి ఉన్న వ్యక్తిని మీరు ఎరుగరు.
27
నా తర్వాత రానున్నవాడు ఆయనే. ఆయన చెప్పుల వారును విప్పడానికి కూడ నేను యోగ్యున్ని కాదు” అని సమాధానం చెప్పాడు.
28
ఇదంతా యొర్దాను నదికి అవతల ఉన్న బేతనియ అనే ఊరిలో యోహాను బాప్తిస్మం ఇస్తున్న చోట జరిగింది.
29
మరుసటిరోజు యోహాను యేసు తన దగ్గరకు రావడం చూసి, “చూడండి, లోక పాపాన్ని మోసుకొనిపోయే దేవుని గొర్రెపిల్ల!
Settings