Skip to content
యెహెజ్కేలు 1:1-25

యెహెజ్కేలు 1:1-25

1
నా ముప్పయవ సంవత్సరం, నాల్గవ నెల, అయిదవ రోజున నేను కెబారు నది దగ్గర బందీల మధ్య ఉన్నప్పుడు ఆకాశం తెరువబడింది, నేను దేవుని దర్శనాలను చూశాను.
2
రాజైన యెహోయాకీను బందీగా ఉన్న అయిదవ సంవత్సరం నాల్గవ నెల అయిదవ రోజున ఇది జరిగింది.
3
బబులోనీయుల దేశంలో కెబారు నది దగ్గర బూజీ కుమారుడు యాజకుడైన యెహెజ్కేలుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమయ్యింది. అక్కడ యెహోవా హస్తం అతని మీదికి వచ్చింది.
4
నేను చూసినప్పుడు ఉత్తరం నుండి గాలి తుఫాను రావడం కనిపించింది; అది జ్వలించే అగ్నితో ప్రకాశవంతమైన కాంతితో నిండిన గొప్ప మేఘము. ఆ అగ్ని మధ్య భాగం కరిగిన ఇత్తడిలా కనిపించింది.
5
దానిలో కరిగిన ఇత్తడిలా నాలుగు జీవుల్లాంటి ఒక రూపం కనిపించింది. వాటి రూపం మానవరూపంలా ఉంది.
6
కాని ప్రతి జీవికి నాలుగు ముఖాలు, నాలుగు రెక్కలు ఉన్నాయి.
7
వాటి కాళ్లు తిన్నగా ఉండి అరికాళ్లు దూడ కాళ్లలా ఉన్నాయి. అవి ఇత్తడిలా తళతళ మెరుస్తున్నాయి.
8
వాటి రెక్కల క్రింద నాలుగు వైపులా మనుష్యుల చేతులు ఉన్నాయి. ఆ నాలుగింటికి ముఖాలు, రెక్కలు ఉన్నాయి.
9
ఒకదాని రెక్కలు మరొకదాని రెక్కలకు తాకుతున్నాయి. అవి అటూ ఇటూ తిరగకుండా అన్నీ తిన్నగా ముందుకు వెళ్తున్నాయి.
10
ఆ నాలుగింటికి మానవ ముఖంలాంటి ముఖాలు ఉన్నాయి, కుడి వైపున సింహపు ముఖం, ఎడమవైపున ఎద్దు ముఖం ఉన్నాయి. ప్రతి దానికి గ్రద్ద ముఖం ఉంది.
11
వాటి ముఖాలు అలా ఉన్నాయి. ప్రతి దానికి పైకి చాచి ఉన్న రెండు రెక్కలు వాటి ప్రక్కన ఉన్నవాటి రెక్కలను తాకుతూ ఉన్నాయి. మరో రెండు రెక్కలు వాటి శరీరాలను కప్పాయి.
12
ప్రతిదీ తిన్నగా ముందు వెళ్తూ ఉంది. అవి అటూ ఇటూ తిరగకుండా ఆత్మ ఏ వైపుకు వెళ్తే అవి ఆ వైపుకే వెళ్తున్నాయి.
13
ఆ జీవుల రూపం మండుతున్న నిప్పులా దివిటీలా ఉంది. అగ్ని ఆ జీవుల మధ్య ముందుకి వెనుకకు కదులుతూ ఉంది. ఆ అగ్ని చాలా ప్రకాశవంతంగా ఉండి దానిలో నుండి మెరుపులు వస్తున్నాయి.
14
మెరుపు తీగెల్లా ఆ జీవులు అటూ ఇటూ తిరుగుతున్నాయి.
15
నేను ఆ జీవులను చూసినప్పుడు, ప్రతి జీవి నాలుగు ముఖాల్లో ప్రతీదాని ప్రక్కన నేలమీద ఒక్కొక్క చక్రం కనిపించింది.
16
చక్రాల రూపం, నిర్మాణం ఇలా ఉంది: అవి గోమేధికంలా మెరుస్తూ, నాలుగు ఒకేలా ఉన్నాయి. ప్రతిదీ ఒక చక్రంలో మరో చక్రం ఇమిడి ఉండేలా తయారుచేయబడినట్లు కనిపించింది.
17
అవి కదిలినప్పుడు ఆ జీవుల ముఖాలు ఉన్న నాలుగు దిశలలో కదులుతున్నాయి; ఆ జీవులు వెళ్లినప్పుడు ఆ చక్రాలు దిశను మార్చలేదు.
18
వాటి అంచులు ఎత్తుగా భయంకరంగా ఉన్నాయి. నాలుగు అంచుల చుట్టూ కళ్లతో నిండి ఉన్నాయి.
19
జీవులు కదిలినప్పుడు, వాటి ప్రక్కన ఉన్న చక్రాలు కదిలాయి; జీవులు నేల నుండి లేచినప్పుడు, చక్రాలు కూడా లేచాయి.
20
ఆత్మ ఎక్కడికి వెళ్తుందో, అక్కడికి అవి వెళ్తున్నాయి, వాటితో పాటు చక్రాలు కూడా లేస్తున్నాయి, ఎందుకంటే జీవుల ఆత్మ చక్రాలలో ఉంది.
21
జీవులు కదిలినప్పుడు, అవి కూడా కదిలాయి; జీవులు నిశ్చలంగా ఉన్నప్పుడు, అవి కూడా నిలిచి ఉన్నాయి; జీవులు నేల నుండి లేచినప్పుడు, చక్రాలు వాటితో పాటు లేచాయి, ఎందుకంటే జీవుల ఆత్మ చక్రాలలో ఉంది.
22
జీవుల తలల పైన విశాలమైనది ఒకటి కనిపించింది. అది స్ఫటికంలా మెరుస్తూ, అద్భుతంగా ఉంది.
23
ఆ విశాలం క్రింద వాటి రెక్కలు ఒకదాని వైపు ఒకటి తిన్నగా చాపి ఉన్నాయి, ప్రతి దాని శరీరాన్ని రెండు రెక్కలు కప్పి ఉంచాయి.
24
ఆ జీవులు కదిలినప్పుడు నేను వాటి రెక్కల శబ్దం విన్నాను. అది జలప్రవాహాల ఘోషలా, సర్వశక్తిమంతుని స్వరంలా, సైన్యం నుండి వచ్చే కోలాహలంలా ఉంది. అవి నిలబడినప్పుడు వాటి రెక్కలు క్రిందికి వాల్చాయి.
25
అవి రెక్కలు వాల్చి నిలబడినప్పుడు వాటి తలపైన ఉన్న విశాలం పైనుండి ఒక స్వరం వచ్చింది.

బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.

Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options