Skip to content
2 దినవృత్తాంతములు 34:18-33

2 దినవృత్తాంతములు 34:18-33

18
అప్పుడు కార్యదర్శియైన షాఫాను, “యాజకుడైన హిల్కీయా ఈ గ్రంథాన్ని నాకు ఇచ్చాడు” అని రాజుకు చెప్పాడు. షాఫాను దానిని రాజు సముఖంలో చదివాడు.
19
ధర్మశాస్త్రంలోని మాటలు విన్నప్పుడు రాజు తన బట్టలు చింపుకున్నాడు.
20
తర్వాత రాజు హిల్కీయాకు, షాఫాను కుమారుడైన అహీకాముకు, మీకా కుమారుడైన అబ్దోనుకు, కార్యదర్శియైన షాఫానుకు, రాజు సేవకుడైన అశాయాకు ఇలా ఆదేశాలు జారీ చేశాడు:
21
“మీరు వెళ్లి, దొరికిన ఈ గ్రంథంలో వ్రాసిన మాటల గురించి నా కోసం, ఇశ్రాయేలు యూదాలో శేషించిన వారి కోసం, యెహోవా దగ్గర విచారణ చేయండి. యెహోవా కోపాగ్ని మనమీద అధికంగా రగులుకొని ఉంది. ఎందుకంటే, మన పూర్వికులు యెహోవా మాటను పాటించలేదు; ఈ గ్రంథంలో వ్రాయబడిన ప్రకారం ప్రవర్తించలేదు.”
22
అప్పుడు హిల్కీయా, రాజు పంపినవారు హుల్దా అనే ప్రవక్తి దగ్గరకు వెళ్లారు. ఆమె షల్లూము భార్య, అతడు తోఖతు కుమారుడు, వస్త్రశాల తనిఖీదారుడైన హస్రా మనుమడు. ఆమె యెరూషలేములో నూతన భాగంలో నివసించేది. వారు ఆమెతో విషయం చెప్పారు.
23
ఆమె వారితో ఇలా అన్నది, “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: మిమ్మల్ని నా దగ్గరకు పంపిన వ్యక్తికి చెప్పండి,
24
‘యెహోవా చెప్పే మాట ఇదే: యూదారాజు సమక్షంలో చదివించిన గ్రంథంలో వ్రాసి ఉన్న శాపాలన్నిటిని అలాగే విపత్తును నేను ఈ స్థలం మీదికి, దీని ప్రజలమీదికి రప్పిస్తాను.
25
ఎందుకంటే ఈ ప్రజలు నన్ను విడిచిపెట్టి, ఇతర దేవుళ్ళకు ధూపం వేశారు, వారు చేతులతో చేసిన వాటన్నిటి బట్టి నాకు కోపం రేపారు. నా కోపం ఈ స్థలంపై కుమ్మరించబడుతుంది, అది చల్లారదు.’
26
యెహోవా దగ్గర విచారణ చేయడానికి మిమ్మల్ని పంపిన యూదా రాజుతో ఇలా చెప్పండి, ‘నీవు విన్న మాటల గురించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే:
27
వారు ఈ స్థలం గురించి ఈ ప్రజల గురించి నే చెప్పిన మాటలు విని నీ హృదయం మెత్తబడి నిన్ను నీవు యెహోవా ఎదుట తగ్గించుకొని నీ బట్టలు చింపుకొని నా సన్నిధిలో ఏడ్చావు కాబట్టి, నేను కూడా నీ మనవి విన్నానని యెహోవా చెప్తున్నారు.
28
నేను నిన్ను నీ పూర్వికుల దగ్గరకు చేరుస్తాను, సమాధానంతో నీవు సమాధి చేయబడతావు. నేను ఈ స్థలం మీదికి, ఇక్కడ నివసించేవారి మీదికి రప్పించే విపత్తును నీ కళ్లు చూడవు.’ ” అప్పుడు వారు ఆమె జవాబును రాజు దగ్గరకు తీసుకెళ్లారు.
29
అప్పుడు రాజు యూదాలో, యెరూషలేములో ఉన్న పెద్దలందరినీ పిలిపించాడు.
30
అతడు యూదా ప్రజలతో, యెరూషలేము వాసులతో, యాజకులతో, లేవీయులతో, అల్పుల నుండి ఘనులైన ప్రజలందరితో కలిసి యెహోవా ఆలయానికి వెళ్లాడు. అక్కడ రాజు, వారంతా వినేటట్టు యెహోవా మందిరంలో దొరికిన నిబంధన గ్రంథంలో ఉన్న మాటలన్నీ చదివి వినిపించాడు.
31
రాజు తన స్తంభం దగ్గర నిలబడి, తన పూర్ణహృదయంతో, పూర్ణ ఆత్మతో యెహోవాను అనుసరిస్తానని, ఆయన ఆజ్ఞలు, కట్టడలు, శాసనాలు పాటిస్తానని, ఈ గ్రంథంలో వ్రాయబడిన నిబంధన మాటలకు లోబడతానని యెహోవా సన్నిధిలో నిబంధనను పునరుద్ధరించాడు.
32
అప్పుడు యెరూషలేములో, బెన్యామీనులో ఉన్నవారందరిని ఆ నిబంధనకి సమ్మతించేటట్టు చేశాడు. యెరూషలేమువారు తమ పూర్వికుల దేవుని నిబంధన ప్రకారం అలా చేశారు.
33
యోషీయా ఇశ్రాయేలు ప్రజలకు చెందిన ప్రాంతమంతటిలో నుండి విగ్రహాలన్నిటిని తీసివేశాడు. అవి అసహ్యమైన విగ్రహాలన్నిటినీ తీసివేశాడు. ఇశ్రాయేలులో ఉన్నవారందరు తమ దేవుడైన యెహోవాను సేవించేటట్టు చేశాడు. అతడు బ్రతికినన్నాళ్ళు వారు తమ పూర్వికుల దేవుడైన యెహోవాను అనుసరించుట మానలేదు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options