The Tribe Of Dan గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
పదవ రోజు అర్పణను తెచ్చిన వారు దాను గోత్ర నాయకుడు, అమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు.
అతని అర్పణ: పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం నూట ముప్పై షెకెళ్ళ బరువు ఉన్న వెండి పళ్ళెం, డెబ్బై షెకెళ్ళ బరువు ఉన్న వెండి చిలకరింపు పాత్ర, భోజనార్పణ కోసం ఈ రెండింటి నిండా ఒలీవనూనె కలిపిన నాణ్యమైన పిండి;
ధూపద్రవ్యంతో నిండిన పది షెకెళ్ళ బరువు ఉన్న బంగారు పళ్ళెం;
దహనబలి కోసం ఒక కోడె, ఒక పొట్టేలు, ఏడాది మగ గొర్రెపిల్ల;
పాపపరిహారబలి కోసం మేకపోతు;
సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు.
ఏడవ చీటి వారి వంశాల ప్రకారం దాను గోత్రానికి వచ్చింది.
వారి వారసత్వం సరిహద్దు జోరహు, ఎష్తాయోలు ఈర్-షెమెషు,
షయల్బీను, అయ్యాలోను, ఇత్లా,
ఎలోను, తిమ్నా, ఎక్రోను,
ఎల్తెకే, గిబ్బెతోను, బాలతు,
యెహూదు, బెనె-బెరకు, గాత్-రిమ్మోను,
మే-యర్కోను, రక్కోను, యొప్ప ముందున్న ప్రాంతం.
వారు జోరహుకు ఎష్తాయోలుకు తిరిగి వచ్చినప్పుడు, వారి తోటి దానీయులు, “మీరు ఏం తెలుసుకున్నారు?” అని వారిని అడిగారు.
వారు జవాబిస్తూ, “పదండి, వారి మీద దాడి చేద్దాం! ఆ ప్రాంతాన్ని చూశాం, అది చాలా బాగుంది. ఇంకా వేచి ఉండడం ఎందుకు? వెళ్లి స్వాధీనం చేసుకోవడానికి ఆలస్యం చేయవద్దు,
మీరు అక్కడికి చేరిన తర్వాత ధైర్యంగా ఉన్న జనాన్ని విశాల ప్రదేశాన్ని, ఏ కొరత లేని స్థలాన్ని మీరు చూస్తారు, దానిని దేవుడు మీ చేతులకు అప్పగిస్తారు” అన్నారు.
అప్పుడు దాను గోత్రం నుండి ఆరువందలమంది యుద్ధం చేయడానికి ఆయుధాలు ధరించి జోరహు, ఎష్తాయోలు నుండి బయలుదేరారు.
వారు ప్రయాణమై యూదాలోని కిర్యత్-యారీము దగ్గర మకాం చేశారు. అందుకు ఈనాటికీ కిర్యత్-యారీముకు పడమరగా ఉన్న స్థలాన్ని మహానే-దాను అంటారు.
వారు అక్కడినుండి ఎఫ్రాయిం కొండ సీమకు వెళ్లి మీకా ఇంటికి వచ్చారు.
యాజకుడు, యుద్ధాయుధాలు ధరించిన ఆరువందలమంది ద్వారం దగ్గర నిలబడి ఉన్నప్పుడు, దేశాన్ని పరిశోధించడానికి వెళ్లిన ఆ అయిదుగురు మనుష్యులు లోనికి వెళ్లి విగ్రహాన్ని, ఏఫోదును గృహదేవతలను తీసుకున్నారు.
ఆ అయిదుగురు మీకా ఇంట్లోకి వెళ్లి విగ్రహాన్ని, ఏఫోదును, గృహదేవతలను తీసుకున్నప్పుడు, ఆ యాజకుడు, “మీరు ఏం చేస్తున్నారు?” అని వారిని అడిగాడు.
వారు అతనితో, “నోరు మూసుకో! ఒక్క మాట మాట్లాడకుండ మాతో వచ్చి మాకు తండ్రిగా యాజకునిగా ఉండు. ఒక మనిషి కుటుంబానికి మాత్రమే యాజకునిగా ఉండడం కంటే ఇశ్రాయేలులో ఒక గోత్రమంతటికి, కుటుంబానికి యాజకునిగా ఉండడం మంచిది కాదా?” అన్నారు.
యాజకుడు చాలా సంతోషించాడు. అతడు ఏఫోదును, గృహదేవతలను, విగ్రహాన్ని తీసుకుని ఆ ప్రజలతో వెళ్లాడు.
వారు తమ చిన్న పిల్లలను, పశువులను, ఆస్తులను ముందుగా పెట్టుకొని అక్కడినుండి బయలుదేరారు.
దానీయులు మీకా తయారుచేసుకున్న వాటిని, అతని యాజకుడిని తీసుకుని లాయిషుపై, సమాధాన భద్రతలతో ఉన్న ప్రజలను చేరుకున్నారు. వారిపై ఖడ్గంతో దాడి చేసి, పట్టణాన్ని తగలబెట్టారు.