Skip to content
యెహెజ్కేలు 40:1-27

యెహెజ్కేలు 40:1-27

1
అప్పటికి మేము బందీలుగా వచ్చిన ఇరవై అయిదవ సంవత్సరంలోని మొదటి నెల పదవ రోజున, అనగా పట్టణం నాశనమైన పద్నాలుగవ సంవత్సరంలో ఆ రోజునే యెహోవా హస్తం నా మీదికి వచ్చి ఆయన నన్ను పట్టణానికి తీసుకెళ్లారు.
2
దేవుని దర్శనంలో ఆయన నన్ను ఇశ్రాయేలు దేశానికి తీసుకెళ్లి చాలా ఎత్తైన పర్వతం మీద నన్ను ఉంచారు. దాని మీద దక్షిణం వైపున ఒక పట్టణం లాంటిది నాకు కనిపించింది.
3
ఆయన నన్ను అక్కడికి తీసుకెళ్లగా మెరుస్తున్న ఇత్తడిలా ఉన్న ఒక వ్యక్తిని నేను చూశాను. అతడు తన చేతిలో నార దారం, కొలిచే కర్ర పట్టుకుని పట్టణ ద్వారంలో నిలబడి ఉన్నాడు.
4
ఆ వ్యక్తి నాతో ఇలా అన్నాడు, “మనుష్యకుమారుడా, నేను నీకు చూపించబోయే ప్రతిదాన్ని జాగ్రత్తగా చూసి శ్రద్ధగా విని మనస్సులో ఉంచుకో. వాటిని నీకు చూపించడానికే నేను నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను. నీవు చూసిన ప్రతిదాన్ని ఇశ్రాయేలీయులకు తెలియజేయి.”
5
ఆలయ ప్రాంతాన్ని పూర్తిగా చుట్టుముట్టిన గోడను నేను చూశాను. ఆ వ్యక్తి చేతిలోని ఉన్న కొలిచే కడ్డీ పొడవు ఆరు మూరలు, ఒక్కొక్కటి ఒక మూర ఒక బెత్తెడు వెడల్పు ఉంది. అతడు గోడను కొలిచాడు; అది ఆ కొలిచే కడ్డీ అంత వెడల్పు, ఆ కడ్డీ అంత ఎత్తు ఉంది.
6
అప్పుడతడు తూర్పు వైపున ఉన్న ద్వారం దగ్గరికి వెళ్లి దాని మెట్లెక్కి దాని గుమ్మపు గడపను కొలిచినప్పుడు అది ఒక కొలిచే కర్ర పొడవు ఉంది.
7
కావలివారి గది పొడవు వెడల్పులు కొలిచే కర్రంత ఉన్నాయి. ఆ గదులకు మధ్య ఉన్న గోడలు అయిదు మూరల మందంగా ఉన్నాయి. ద్వారం ప్రక్క నుండి ఆలయానికి ఎదురుగా ఉన్న మంటపానికి ఒక కొలిచే కర్ర లోతు ఉంది.
8
అతడు ద్వారపు మంటపం మధ్య కొలిచాడు;
9
ద్వారం వాకిలి ఎనిమిది మూరలు, దాని ద్వారబంధాలు రెండు మూరలు ఉన్నాయి; ద్వారపు మంటపం మందిరం లోపలి వైపుకు ఉంది.
10
తూర్పు ద్వారం లోపల ప్రతి వైపు మూడు కాపలా గదులు ఉన్నాయి; మూడింటికి ఒకే కొలతలు ఉన్నాయి; వాటి రెండు ప్రక్కల ఉన్న ద్వారబంధాలు కూడా ఒకే కొలతలు ఉన్నాయి.
11
అప్పుడు అతడు ద్వారాల వాకిళ్లను కొలిచినప్పుడు దాని వెడల్పు పది మూరలు, పొడవు పదమూడు మూరలు ఉన్నాయి.
12
ప్రతి కాపలా గదికి ఎదురుగా ఉన్న గోడ ఎత్తు ఒక మూర ఉంది. గదులైతే రెండు ప్రక్కలా ఆరు మూరల ఎత్తు ఉన్నాయి.
13
అప్పుడతడు ఒక గది పైకప్పు నుండి మరో గది పైకప్పు వరకు ద్వారాన్ని కొలిచినప్పుడు ఇరవై అయిదు మూరల దూరం ఉంది, రెండు వాకిళ్ల మధ్య కూడా అదే కొలత ఉంది.
14
అతడు ద్వారం లోపల భాగం చుట్టూ ఉన్న గోడల వెంబడి అరవై మూరలు కొలిచాడు. ఆ కొలత ఆవరణానికి ఎదురుగా ఉన్న ప్రాంగణం వరకు.
15
బయటి గుమ్మం నుండి లోపలి గుమ్మం ద్వారం యొక్క ఆవరణం వరకు యాభై మూరలు.
16
కాపలా గదులకు ద్వారం లోపల చుట్టూ ఉన్న గోడలకు ప్రక్క గదులకు మూసి ఉన్న కిటికీలు ఉన్నాయి. గోడలోని ద్వారబంధాలు కిటికీలు ఉన్నాయి. ప్రతి ద్వారబంధాన్ని ఖర్జూరం చెట్లతో అలంకరించారు.
17
తర్వాత నన్ను బయటి ఆవరణంలోకి తీసుకువచ్చాడు. అక్కడ నేను కొన్ని గదులు, ఆవరణం చుట్టూ నిర్మించబడిన ఒక కాలిబాటను చూశాను; కాలిబాట ప్రక్కగా ముప్పై గదులు ఉన్నాయి.
18
ఈ చప్టా ద్వారం వరకు ఉండి వాటి వెడల్పుకు సమానంగా ఉంది. ఇది క్రింది చప్టా.
19
అప్పుడు అతడు దిగువ ద్వారం లోపలి నుండి లోపలి ఆవరణం బయట వరకు కొలిచినప్పుడు అది తూర్పు వైపుకు వంద మూరలు ఉత్తరం వైపుకు వంద మూరలు ఉంది.
20
అప్పుడతడు బయటి ఆవరణానికి దారితీసే ఉత్తరం గుమ్మం పొడవు వెడల్పులను కొలిచాడు.
21
దానికి రెండు వైపులా ఉన్న మూడేసి కాపలా గదులను వాటి ద్వారబంధాలను వాటి మధ్య గోడలను కొలిచినప్పుడు వాటి కొలత, మొదటి ద్వారం కొలత ఒక్కటే. పొడవు యాభై మూరలు, వెడల్పు ఇరవై అయిదు మూరలు ఉంది.
22
వాటి కిటికీలు మధ్య గోడలు, ఖర్జూరం చెట్లతో అలంకరించిన ద్వారబంధాల కొలతలన్నీ తూర్పు గుమ్మం కొలతతో సమానంగా ఉన్నాయి. పైకి ఎక్కడానికి ఏడు మెట్లున్నాయి. వాటికి ఎదురుగా దాని మధ్య గోడలు ఉన్నాయి.
23
తూర్పు ద్వారంలా ఉత్తర ద్వారానికి ఎదురుగా లోపలి ఆవరణానికి దారితీసే ఒక గుమ్మం ఉంది. ఈ ద్వారం నుండి ఆ ద్వారం వరకు దూరం కొలిచినప్పుడు అది వంద మూరలు ఉంది.
24
అప్పుడతడు నన్ను దక్షిణం వైపుకు తీసుకెళ్లగా అక్కడ దక్షిణ ద్వారం కనిపించింది. దాని ద్వారబంధాలను మధ్య గోడలను కొలిచినప్పుడు దీని కొలత ఇతర ద్వారాల కొలతలు ఒక్కటే.
25
వాటికి ఉన్నట్లుగానే దీనికి కూడా దీని మధ్యగోడలకు చుట్టూ కిటికీలు ఉన్నాయి. ద్వారం పొడవు యాభై మూరలు, వెడల్పు ఇరవై అయిదు మూరలు ఉంది.
26
పైకి ఎక్కడానికి ఏడు మెట్లున్నాయి. వాటికి ఎదురుగా దాని మధ్య గోడలు ఉన్నాయి. రెండు వైపులా ఖర్జూరం చెట్లతో అలంకరించిన ద్వారబంధాలు ఉన్నాయి.
27
అతడు ఈ ద్వారం నుండి దక్షిణం వైపున ఉన్న బయటి ద్వారం వరకు కొలిచినప్పుడు అది వంద మూరలు ఉంది.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options