2 సమూయేలు 13:24-39
24
అబ్షాలోము రాజు దగ్గరకు వచ్చి, “మీ సేవకుని యొక్క గొర్రెల బొచ్చు కత్తిరించే సమయం వచ్చింది. రాజు రాజ సేవకులు నాతో పాటు వస్తారా?” అన్నాడు.
25
“లేదు, నా కుమారుడా, మేమందరం రావద్దు; మేము నీకు ఎక్కువ భారం అవుతాం” అని రాజు అన్నాడు. అబ్షాలోము రాజును బ్రతిమాలినా అతడు వెళ్లడానికి నిరాకరించి అతన్ని దీవించాడు.
26
అప్పుడు అబ్షాలోము, “నీవు రాకపోతే నా అన్నయైన అమ్నోనును మాతో పంపించు” అన్నాడు. అందుకు రాజు, “అతడు మీతో ఎందుకు వెళ్లాలి?” అని అడిగాడు.
27
అయితే అబ్షాలోము అతన్ని చాలా బ్రతిమిలాడాడు, కాబట్టి రాజు అమ్నోనును, మిగిలిన రాజకుమారులను అతనితో పంపాడు.
28
తర్వాత అబ్షాలోము తన సేవకులను పిలిచి, “వినండి, అమ్నోను బాగా త్రాగి మత్తు ఎక్కినప్పుడు నేను మీతో, ‘అమ్నోనును కొట్టి చంపండి’ అని చెప్తాను. అప్పుడు మీరు అతన్ని చంపండి. భయపడకండి! మీకు ఆజ్ఞ ఇచ్చింది నేను కాదా? కాబట్టి ధైర్యంగా ఉండండి” అని ఆదేశించాడు.
29
అబ్షాలోము ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమే అతని సేవకులు అమ్నోనును చంపేశారు. అప్పుడు రాజకుమారులంతా లేచి తమ కంచరగాడిదల మీద ఎక్కి పారిపోయారు.
30
వారు ఇంకా దారిలో ఉండగానే, “అబ్షాలోము రాజకుమారుల్లో ఒక్కరు మిగులకుండా అందరిని చంపేశాడు” అనే వార్త దావీదుకు చేరింది.
31
రాజు లేచి నిలబడి తన బట్టలు చింపుకుని నేల మీద పడుకున్నాడు. అతని సేవకులందరు తమ బట్టలు చింపుకుని దగ్గర నిలబడ్డారు.
32
కానీ దావీదు అన్న షిమ్యా కుమారుడైన యెహోనాదాబు, “నా ప్రభువా, వారు రాజకుమారులందరినీ చంపేశారని అనుకోవద్దు; అమ్నోను మాత్రమే చనిపోయాడు. అతడు అబ్షాలోము చెల్లి తామారును అత్యాచారం చేసిన రోజు నుండే అతన్ని చంపాలనే పగతో అబ్షాలోము ఉన్నాడని అతని మాటలు చెప్తున్నాయి.
33
కాబట్టి రాజకుమారులందరూ చనిపోయారని భావించి నా ప్రభువైన రాజు బాధపడవద్దు. అమ్నోను మాత్రమే చనిపోయాడు” అని చెప్పాడు.
34
ఈలోగా, అబ్షాలోము పారిపోయాడు. కాపలాగా నిలబడి ఉన్న వ్యక్తి పైకి చూసేటప్పటికి అతనికి పశ్చిమాన ఉన్న రహదారిపై చాలామంది ప్రజలు కొండ వైపుకు రావడం కనిపించింది. కావలివాడు వెళ్లి రాజుతో, “హొరొనయీము దిశలో, కొండ వైపున మనుష్యులు కనబడుతున్నారు” అని చెప్పాడు.
35
యెహోనాదాబు, “అదిగో రాజకుమారులు వస్తున్నారు; మీ సేవకుడనైన నేను చెప్పినట్టే జరిగింది” అని రాజుతో చెప్పాడు.
36
అతడు చెప్పడం ముగిస్తూ ఉండగానే, రాజకుమారులు వచ్చి గట్టిగా ఏడ్వడం మొదలుపెట్టారు. అది చూసి రాజు అతని సేవకులందరూ చాలా బిగ్గరగా ఏడ్చారు.
37
అబ్షాలోము పారిపోయి అమీహూదు కుమారుడు, గెషూరు రాజైన తల్మయి దగ్గరకు చేరాడు. రాజైన దావీదు చాలా రోజుల వరకు తన కుమారుని కోసం దుఃఖిస్తూనే ఉన్నాడు.
38
అబ్షాలోము పారిపోయి గెషూరుకు వెళ్లి అక్కడ మూడు సంవత్సరాలు ఉన్నాడు.
39
అమ్నోను మరణం విషయంలో ఓదార్పు పొందిన రాజైన దావీదు, అబ్షాలోము దగ్గరకు వెళ్లాలని కోరాడు.
బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.
Settings