Skip to content

Sabbath గురించి బైబిల్ వచనాలు

239 వచనాలు · 6 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఏడవ రోజు నాటికి దేవుడు తాను చేస్తున్న పనంతా ముగించారు; కాబట్టి ఏడవ రోజున తన పని అంతటి నుండి విశ్రాంతి తీసుకున్నారు.

  2. ఆ రోజున సృష్టి క్రియ అంతటి నుండి దేవుడు విశ్రాంతి తీసుకున్నారు కాబట్టి ఆయన ఆ రోజును దీవించి పరిశుద్ధపరిచారు.

  3. ఆరవ రోజున వారు తెచ్చుకున్న దానిని సిద్ధపరచుకోవాలి, అది మిగిలిన రోజుల్లో వారు సమకూర్చుకొనే దానికన్నా రెండింతలు ఉండాలి” అని చెప్పారు.

  4. ఆరవరోజు, ఒక్కొక్కరికి రెండేసి ఓమెర్ల చొప్పున రెట్టింపు పోగుచేసుకున్నారు, సమాజ నాయకులు వచ్చి మోషేకు దానిని తెలిపారు.

  5. అతడు వారితో, “యెహోవా ఆజ్ఞ ఇదే, రేపు సబ్బాతు దినము. అది యెహోవాకు పరిశుద్ధమైన సబ్బాతు విశ్రాంతి దినము. కాబట్టి మీరు కాల్చుకోవాలనుకున్నది కాల్చుకోండి, వండుకోవాలనుకున్నది వండుకోండి. మిగిలింది ఉదయం వరకు ఉంచుకోండి” అని చెప్పాడు.

  6. మోషే ఆజ్ఞాపించిన ప్రకారమే వారు ఉదయం వరకు దానిని ఉంచారు కాని అది కంపుకొట్టలేదు పురుగులు పట్టలేదు.

  7. అప్పుడు మోషే, “ఈ రోజు దానిని తినండి. ఈ రోజు యెహోవాకు సబ్బాతు దినము. ఈ రోజు నేల మీద ఏమి దొరకదు.

  8. ఆరు రోజులు మీరు దానిని పోగుచేసుకోవాలి కాని ఏడవ రోజున, అనగా సబ్బాతు దినాన్న అది దొరకదు” అని చెప్పాడు.

  9. అయితే కొందరు ఏడవ రోజున దానిని పోగుచేసుకుందామని బయటకు వెళ్లారు కాని వారికేమి దొరకలేదు.

  10. కాబట్టి యెహోవా మోషేతో, “ఎంతకాలం మీరు నా ఆజ్ఞలను సూచనలను పాటించకుండా ఉంటారు?

  11. యెహోవా ఈ సబ్బాతును మీకు ఇచ్చారని మనస్సులో గుర్తించుకోండి; అందుకే ఆరవరోజు ఆయన మీకు రెండు రోజులకు సరిపడా ఆహారమిస్తున్నారు. ఏడవ రోజున ప్రతిఒక్కరు తామున్న చోటనే ఉండాలి. ఏడవ రోజున ఎవరు తామున్న చోటినుండి బయటకు వెళ్లకూడదు” అన్నారు.

  12. కాబట్టి ప్రజలు ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్నారు.

  13. సబ్బాతు దినాన్ని పరిశుద్ధంగా పాటించడం జ్ఞాపకముంచుకోండి.

  14. ఆరు రోజులు మీరు కష్టపడి మీ పని అంతటిని చేసుకోవాలి,

  15. కాని ఏడవ రోజు మీ దేవుడైన యెహోవాకు సబ్బాతు దినము. ఆ రోజు మీరు ఏ పని చేయకూడదు, మీరు గాని, మీ కుమారుడు లేదా కుమార్తె గాని, మీ దాసదాసీలు గాని, మీ పశువులు గాని, మీ పట్టణాల్లో ఉంటున్న విదేశీయులు గాని ఏ పని చేయకూడదు.

  16. ఎందుకంటే ఆరు రోజుల్లో యెహోవా ఆకాశాలను, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉన్న సమస్తాన్ని సృజించి, ఏడవ రోజు ఆయన విశ్రాంతి తీసుకున్నారు. కాబట్టి యెహోవా సబ్బాతు దినాన్ని ఆశీర్వదించి దానిని పరిశుద్ధం చేశారు.

  17. “ఆరు రోజులు మీ పని చేసుకోండి, కానీ ఏడవ రోజు పని చేయకండి, తద్వారా మీ ఎద్దు, మీ గాడిద విశ్రాంతి తీసుకోవచ్చు, మీ ఇంట్లో జన్మించిన దాసి కుమారుడు, మీ మధ్య నివసించే విదేశీయుడు సేదదీరుతారు.

  18. “నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు, ‘మీరు నా సబ్బాతులు ఖచ్చితంగా ఆచరించాలి. నేను మిమ్మల్ని పరిశుద్ధపరచే యెహోవానై యున్నాను అని మీరు తెలుసుకునేలా అది రాబోయే తరాలకు నాకు మీకు మధ్య ఒక గుర్తుగా ఉంటుంది.

  19. “ ‘మీరు సబ్బాతును ఆచరించాలి, ఎందుకంటే అది మీకు పరిశుద్ధమైనది. దానిని అపవిత్రం చేసినవారికి ఖచ్చితంగా మరణశిక్ష విధించాలి; ఆ రోజు ఏ పనైనా చేస్తే చేసినవారు తమ ప్రజల్లో నుండి కొట్టివేయబడాలి.

  20. ఆరు రోజులు పని చేయాలి, కాని ఏడవ రోజు యెహోవాకు సబ్బాతు విశ్రాంతి దినం, యెహోవాకు పరిశుద్ధమైనది. సబ్బాతు దినాన ఎవరైనా ఏ పనైనా చేస్తే చేసినవారికి ఖచ్చితంగా మరణశిక్ష విధించాలి.

  21. రాబోయే తరాలకు నిత్యమైన ఒడంబడికగా ఇశ్రాయేలీయులు సబ్బాతును ఆచరించాలి.

  22. ఇది నాకు, ఇశ్రాయేలీయులకు మధ్య ఎప్పటికీ ఒక గుర్తులా ఉంటుంది, ఎందుకంటే ఆరు రోజుల్లో యెహోవా ఆకాశాలను భూమిని చేశారు, ఏడవ రోజున ఆయన విశ్రాంతి తీసుకుని సేదదీరారు.’ ”

  23. “ఆరు రోజులు మీరు పని చేయాలి, కాని ఏడవ రోజు మీరు విశ్రాంతి తీసుకోవాలి; అది దున్నే కాలమైనా పంట కోసే కాలమైనా సరే మీరు విశ్రాంతి తీసుకోవాలి.

  24. ఆరు రోజులు పని చేయాలి, కాని ఏడవ రోజు మీ పరిశుద్ధ దినం, అది యెహోవాకు సబ్బాతు విశ్రాంతి దినము. ఆ రోజు ఎవరు ఏ పని చేసినా వారికి మరణశిక్ష విధించబడాలి.

  25. సబ్బాతు దినాన మీరు మీ నివాసాల్లో మంట వెలిగించకూడదు.”