కంటెంట్‌కు వెళ్లండి

Public Prayer గురించి బైబిల్ వచనాలు

128 వచనాలు · 21 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అతని హృదయం మీ పట్ల నమ్మకంగా ఉందని గుర్తించి కనానీయులు హిత్తీయులు అమోరీయులు పెరిజ్జీయులు యెబూసీయులు గిర్గాషీయుల దేశాన్ని అతని వారసులకు ఇస్తానని అతనితో నిబంధన చేశారు. మీరు నీతిమంతులు కాబట్టి మీ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు.

  2. “మా పూర్వికులు ఈజిప్టులో శ్రమపడడం మీరు చూశారు; ఎర్ర సముద్రం దగ్గర వారి మొర విన్నారు.

  3. ఫరో, అతని సేవకులు, అతని దేశ ప్రజలందరు ఇశ్రాయేలీయుల పట్ల ఎంత అహంకారంతో ప్రవర్తించారో మీకు తెలుసు కాబట్టి మీరు వారి ఎదుట అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచకక్రియలు చేశారు. ఈ రోజు వరకు మీ నామాన్ని ఘనపరిచేలా చేశారు.

  4. మీ ప్రజల ఎదుట సముద్రాన్ని రెండుగా చీల్చగా వారు పొడినేల మీద నడిచివెళ్లారు. లోతైన నీళ్లలో రాయి వేసినట్లుగా మీ ప్రజలను వెంటాడుతూ వచ్చిన వారిని అగాధ జలాల్లో పడేశారు.

  5. మీరు పగలు మేఘస్తంభంలా రాత్రి వారు వెళ్లే మార్గంలో వెలుగు ఇవ్వడానికి అగ్ని స్తంభంలా వారిని నడిపించారు.

  6. “మీరు సీనాయి పర్వతం మీదికి దిగివచ్చి పరలోకం నుండి వారితో మాట్లాడారు. వారికి న్యాయమైన సరియైన నియమాలు, చట్టాలు మేలైన శాసనాలు, ఆజ్ఞలు ఇచ్చారు.

  7. పరిశుద్ధ విశ్రాంతి దినాన్ని ఆచరించాలని మీరు వారికి తెలియజేశారు. మీ సేవకుడైన మోషే ద్వారా ఆజ్ఞలు, శాసనాలు, ధర్మశాస్త్రాన్ని నియమించారు.

  8. మీరు వారి ఆకలి తీర్చడానికి పరలోకం నుండి ఆహారాన్ని ఇచ్చి దాహం తీర్చడానికి బండలో నుండి నీళ్లు రప్పించారు; మీరు వారికి ఇస్తానని ప్రమాణం చేసిన దేశానికి వెళ్లి స్వాధీనం చేసుకోమని చెప్పారు.

  9. “అయితే మా పూర్వికులు అహంకారంతో ప్రవర్తించి మీ ఆజ్ఞలకు లోబడకుండా తిరుగుబాటు చేశారు.

  10. మీకు అవిధేయులుగా ఉండి, మీరు వారి మధ్య చేసిన అద్భుతాలను మరచిపోయారు. ఈజిప్టులో తమ బానిసత్వానికి తిరిగి వెళ్లడానికి ఒక నాయకుని ఏర్పరచుకుని తిరుగుబాటు చేశారు. అయితే మీరు క్షమించే దేవుడవు దయా కనికరం ఉన్నవారు, త్వరగా కోప్పడరు, అపరిమితమైన ప్రేమ ఉన్నవారు కాబట్టి వారిని విడిచిపెట్టలేదు.

  11. వారు పోతపోసిన దూడను తయారుచేసి, ఈజిప్టు నుండి మమ్మల్ని బయటకు తీసుకువచ్చిన దేవుడు ఇదే అని చెప్పినా తీవ్రమైన దేవదూషణ చేసినా మీరు వారిని విడిచిపెట్టలేదు.

  12. “మీ గొప్ప కనికరాన్ని బట్టి ఎడారిలో మీరు వారిని విడిచిపెట్టలేదు. పగలు మేఘస్తంభం దారి చూపడం ఆపలేదు; రాత్రి అగ్నిస్తంభం వారి మార్గాలకు వెలుగివ్వడం మానలేదు.

  13. వారికి బోధించడానికి మీరు మీ దయగల ఆత్మను ఇచ్చారు. మీరు వారికి ఇచ్చిన మన్నాను ఇవ్వడం మానలేదు. వారికి నీళ్లు ఇచ్చి వారి దాహం తీర్చారు.

  14. మీరు నలభై సంవత్సరాల పాటు వారిని పోషించారు. ఎడారిలో కూడా వారికి ఏమీ తక్కువ కాలేదు. వారి బట్టలు చిరిగిపోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు.

  15. “మీరు వారికి రాజ్యాలను దేశాలను ఇచ్చారు. మారుమూల సరిహద్దులను కూడా వారికి కేటాయించారు. వారు హెష్బోను రాజు సీహోను దేశాన్ని బాషాను రాజు ఓగు దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు.

  16. మీరు వారి పిల్లలను నక్షత్రాలంత విస్తారంగా చేసి, వారి పితరులకు మీరు వెళ్లి స్వాధీనం చేసుకుంటారని వాగ్దానం చేసిన దేశంలోకి వారిని తీసుకువచ్చారు.

  17. వారి పిల్లలు ఆ దేశంలోనికి వెళ్లి దానిని స్వాధీనం చేసుకున్నారు. మీరు ఆ దేశంలో నివసిస్తున్న కనానీయులను వారి ఎదుట అణచివేశారు. తమకు నచ్చిన విధంగా చేయడానికి కనానీయులను వారి రాజులతో ఆ దేశ ప్రజలతో కలిపి వారి చేతికి అప్పగించారు.

  18. వారు కోటగోడలు ఉన్న పట్టణాలను సారవంతమైన భూమిని స్వాధీనం చేసుకున్నారు. అన్ని రకాల మంచి వస్తువులతో నిండిన ఇల్లు, త్రవ్విన బావులు, ద్రాక్షతోటలు, ఒలీవతోటలు, విస్తారమైన పండ్లచెట్లు స్వాధీనపరచుకున్నారు. వారు తిని తృప్తి చెందారు. మీ గొప్ప మంచితనాన్ని చూసి ఆనందించారు.

  19. “అయినా వారు మీ పట్ల అవిధేయత చూపించి మీపై తిరుగుబాటు చేశారు; మీ ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేశారు. మీ వైపు తిరగాలని వారిని హెచ్చరించిన ప్రవక్తలను చంపారు; ఘోరమైన దేవదూషణ చేశారు.

  20. కాబట్టి మీరు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించారు. వారు బాధించబడిన సమయంలో మీకు మొరపెట్టినప్పుడు పరలోకంలో నుండి మీరు వారి మొర విన్నారు. మీ గొప్ప కృపను బట్టి వారిని శత్రువు చేతిలో నుండి విడిపించడానికి వారికి విమోచకులను ఇచ్చారు.

  21. “వారికి విశ్రాంతి లభించిన వెంటనే మీ ఎదుట చెడు చేశారు కాబట్టి శత్రువులు వారి మీద ప్రభుత్వం చేసేలా వారిని తిరిగి శత్రువు చేతికే అప్పగించారు. వారు తిరిగి మీకు మొరపెట్టినప్పుడు పరలోకంలో నుండి మీరు వారి మొర విన్నారు. కరుణ చూపించి అనేకసార్లు వారిని విడిపించారు.

  22. “వారిని మీ ధర్మశాస్త్రం వైపు మరలించడానికి మీరు వారిని హెచ్చరించారు, అయితే వారు గర్వించి మీ ఆజ్ఞలకు లోబడక ‘వాటిని పాటించే మనుష్యులు వాటి ద్వారా జీవిస్తాడు’ అని మీరు చెప్పిన మీ శాసనాలకు వ్యతిరేకంగా వారు పాపం చేశారు.

  23. మీరు వారిని ఎన్నో సంవత్సరాలు ఓర్పుతో సహించారు. మీ ఆత్మ చేత ప్రవక్తల ద్వారా వారిని హెచ్చరించారు. అయినా వారు మీ మాట వినలేదు, కాబట్టి మీరు వారిని వారి పొరుగు దేశాలకు అప్పగించారు.

  24. అయితే మీ గొప్ప కనికరాన్ని బట్టి మీరు వారిని పూర్తిగా నాశనం చేయలేదు, విడిచిపెట్టలేదు. మీరు దయా కనికరంగల దేవుడవు.

  25. “మా దేవా! గొప్ప దేవా! మహా బలవంతుడా! పరిస్థితులతో సంబంధం లేకుండా మీరు చేసిన మీ ప్రేమ నిబంధన నెరవేరుస్తున్నారు. అష్షూరు రాజుల కాలం నుండి ఈ రోజు వరకు మా మీదికి, మా రాజులు నాయకుల మీదికి, మా యాజకులు ప్రవక్తల మీదికి, మా పూర్వికుల మీదికి మీ ప్రజలందరి మీదికి వచ్చిన శ్రమలు మీ దృష్టికి చిన్న విషయంగా ఉండకూడదు.