Public Prayer గురించి బైబిల్ వచనాలు: Jeshua
Jeshua గురించి వచనాలు
అదే నెల ఇరవై నాలుగవ రోజున ఇశ్రాయేలీయులు ఉపవాసముండి గోనెపట్టలు కట్టుకుని తలమీద బూడిద వేసుకుని వచ్చారు.
ఇశ్రాయేలీయులు విదేశీయులకు వేరుగా నిలబడి తమ పాపాలను తమ పూర్వికుల పాపాలను ఒప్పుకున్నారు.
వారు ఉన్న చోటే నిలబడి ఒక పూటంతా తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివారు. మరో పూట తమ పాపాలు ఒప్పుకుంటూ తమ దేవుడైన యెహోవాను ఆరాధిస్తూ గడిపారు.
లేవీయులలో యెషూవ, బానీ, కద్మీయేలు, షెబన్యా, బున్నీ, షేరేబ్యా, బానీ, కెనానీ అనేవారు మెట్ల మీద నిలబడి తమ దేవుడైన యెహోవాకు బిగ్గరగా మొరపెట్టారు.
అప్పుడు లేవీయులైన యెషూవ, కద్మీయేలు, బానీ, హషబ్నెయా, షేరేబ్యా, హోదీయా, షెబన్యా, పెతహయా అనేవారు మెట్ల మీద నిలబడి, “లేచి నిలబడండి, మీకు నిత్యం దేవునిగా ఉన్న యెహోవాను స్తుతించండి” అని చెప్పి ఇలా స్తుతించారు: “మీ దివ్యమైన నామం స్తుతించబడుతుంది. సమస్త ఆశీర్వాదాలకు స్తుతులకు మించి హెచ్చింపబడుతుంది.
మీరు మాత్రమే యెహోవా. మీరే మహాకాశాలను, ఆకాశాలను, వాటి నక్షత్ర సమూహాలన్నిటిని, భూమిని, దానిలో ఉన్న సమస్తాన్ని, సముద్రాలను, వాటిలో ఉన్న సమస్తాన్ని సృజించారు. వాటన్నిటికి జీవాన్ని ఇచ్చారు. పరలోక సమూహాలన్ని మిమ్మల్ని ఆరాధిస్తున్నాయి.
“యెహోవా దేవా, అబ్రామును ఏర్పరచుకుని, అతన్ని కల్దీయుల ఊరు అనే చోటు నుండి బయటకు తీసుకువచ్చి అతనికి అబ్రాహాము అని పేరు పెట్టింది మీరే.
అతని హృదయం మీ పట్ల నమ్మకంగా ఉందని గుర్తించి కనానీయులు హిత్తీయులు అమోరీయులు పెరిజ్జీయులు యెబూసీయులు గిర్గాషీయుల దేశాన్ని అతని వారసులకు ఇస్తానని అతనితో నిబంధన చేశారు. మీరు నీతిమంతులు కాబట్టి మీ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు.
“మా పూర్వికులు ఈజిప్టులో శ్రమపడడం మీరు చూశారు; ఎర్ర సముద్రం దగ్గర వారి మొర విన్నారు.
ఫరో, అతని సేవకులు, అతని దేశ ప్రజలందరు ఇశ్రాయేలీయుల పట్ల ఎంత అహంకారంతో ప్రవర్తించారో మీకు తెలుసు కాబట్టి మీరు వారి ఎదుట అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచకక్రియలు చేశారు. ఈ రోజు వరకు మీ నామాన్ని ఘనపరిచేలా చేశారు.
మీ ప్రజల ఎదుట సముద్రాన్ని రెండుగా చీల్చగా వారు పొడినేల మీద నడిచివెళ్లారు. లోతైన నీళ్లలో రాయి వేసినట్లుగా మీ ప్రజలను వెంటాడుతూ వచ్చిన వారిని అగాధ జలాల్లో పడేశారు.
మీరు పగలు మేఘస్తంభంలా రాత్రి వారు వెళ్లే మార్గంలో వెలుగు ఇవ్వడానికి అగ్ని స్తంభంలా వారిని నడిపించారు.
“మీరు సీనాయి పర్వతం మీదికి దిగివచ్చి పరలోకం నుండి వారితో మాట్లాడారు. వారికి న్యాయమైన సరియైన నియమాలు, చట్టాలు మేలైన శాసనాలు, ఆజ్ఞలు ఇచ్చారు.
పరిశుద్ధ విశ్రాంతి దినాన్ని ఆచరించాలని మీరు వారికి తెలియజేశారు. మీ సేవకుడైన మోషే ద్వారా ఆజ్ఞలు, శాసనాలు, ధర్మశాస్త్రాన్ని నియమించారు.
మీరు వారి ఆకలి తీర్చడానికి పరలోకం నుండి ఆహారాన్ని ఇచ్చి దాహం తీర్చడానికి బండలో నుండి నీళ్లు రప్పించారు; మీరు వారికి ఇస్తానని ప్రమాణం చేసిన దేశానికి వెళ్లి స్వాధీనం చేసుకోమని చెప్పారు.
“అయితే మా పూర్వికులు అహంకారంతో ప్రవర్తించి మీ ఆజ్ఞలకు లోబడకుండా తిరుగుబాటు చేశారు.
మీకు అవిధేయులుగా ఉండి, మీరు వారి మధ్య చేసిన అద్భుతాలను మరచిపోయారు. ఈజిప్టులో తమ బానిసత్వానికి తిరిగి వెళ్లడానికి ఒక నాయకుని ఏర్పరచుకుని తిరుగుబాటు చేశారు. అయితే మీరు క్షమించే దేవుడవు దయా కనికరం ఉన్నవారు, త్వరగా కోప్పడరు, అపరిమితమైన ప్రేమ ఉన్నవారు కాబట్టి వారిని విడిచిపెట్టలేదు.
వారు పోతపోసిన దూడను తయారుచేసి, ఈజిప్టు నుండి మమ్మల్ని బయటకు తీసుకువచ్చిన దేవుడు ఇదే అని చెప్పినా తీవ్రమైన దేవదూషణ చేసినా మీరు వారిని విడిచిపెట్టలేదు.
“మీ గొప్ప కనికరాన్ని బట్టి ఎడారిలో మీరు వారిని విడిచిపెట్టలేదు. పగలు మేఘస్తంభం దారి చూపడం ఆపలేదు; రాత్రి అగ్నిస్తంభం వారి మార్గాలకు వెలుగివ్వడం మానలేదు.
వారికి బోధించడానికి మీరు మీ దయగల ఆత్మను ఇచ్చారు. మీరు వారికి ఇచ్చిన మన్నాను ఇవ్వడం మానలేదు. వారికి నీళ్లు ఇచ్చి వారి దాహం తీర్చారు.
మీరు నలభై సంవత్సరాల పాటు వారిని పోషించారు. ఎడారిలో కూడా వారికి ఏమీ తక్కువ కాలేదు. వారి బట్టలు చిరిగిపోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు.
“మీరు వారికి రాజ్యాలను దేశాలను ఇచ్చారు. మారుమూల సరిహద్దులను కూడా వారికి కేటాయించారు. వారు హెష్బోను రాజు సీహోను దేశాన్ని బాషాను రాజు ఓగు దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మీరు వారి పిల్లలను నక్షత్రాలంత విస్తారంగా చేసి, వారి పితరులకు మీరు వెళ్లి స్వాధీనం చేసుకుంటారని వాగ్దానం చేసిన దేశంలోకి వారిని తీసుకువచ్చారు.
వారి పిల్లలు ఆ దేశంలోనికి వెళ్లి దానిని స్వాధీనం చేసుకున్నారు. మీరు ఆ దేశంలో నివసిస్తున్న కనానీయులను వారి ఎదుట అణచివేశారు. తమకు నచ్చిన విధంగా చేయడానికి కనానీయులను వారి రాజులతో ఆ దేశ ప్రజలతో కలిపి వారి చేతికి అప్పగించారు.
వారు కోటగోడలు ఉన్న పట్టణాలను సారవంతమైన భూమిని స్వాధీనం చేసుకున్నారు. అన్ని రకాల మంచి వస్తువులతో నిండిన ఇల్లు, త్రవ్విన బావులు, ద్రాక్షతోటలు, ఒలీవతోటలు, విస్తారమైన పండ్లచెట్లు స్వాధీనపరచుకున్నారు. వారు తిని తృప్తి చెందారు. మీ గొప్ప మంచితనాన్ని చూసి ఆనందించారు.