Skip to content
మత్తయి 26:59-75

మత్తయి 26:59-75

59
ముఖ్య యాజకులు న్యాయసభ సభ్యులందరు యేసును చంపించాలని ఆయనకు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యాలను వెదకుతున్నారు.
60
చాలామంది అబద్ధ సాక్షులు ముందుకు వచ్చారు, కానీ వారికి ఏమి దొరకలేదు. చివరికి ఇద్దరు సాక్షులు ముందుకొచ్చారు.
61
వారిచ్చిన సాక్ష్యం ఏంటంటే, “ఈయన దేవాలయాన్ని పడగొట్టి, మూడు దినాల్లో దానిని లేపుతాను అని చెప్పాడు.”
62
అప్పుడు ప్రధాన యాజకుడు లేచి యేసుతో, “నీవు జవాబు చెప్పవా? నీకు వ్యతిరేకంగా వీరు చెప్తున్న ఈ సాక్ష్యం ఏమిటి?” అని అడిగాడు.
63
అయితే యేసు మౌనంగా ఉన్నారు. అందుకు ప్రధాన యాజకుడు ఆయనతో, “జీవంగల దేవుని తోడని నిజం చెప్పు: ఒకవేళ నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే మాతో చెప్పు” అన్నాడు.
64
అందుకు యేసు, “నీవు చెప్పినట్లే. అయితే ఇప్పటినుండి మనుష్యకుమారుడు సర్వశక్తిగల దేవుని కుడిచేతి వైపున కూర్చుని ఉండడం ఆకాశ మేఘాల మీద ఆయన రావడం మీరు చూస్తారని మీ అందరికి చెప్తున్నాను.”
65
అప్పుడు ప్రధాన యాజకుడు తన వస్త్రాలను చింపుకొని, “వీడు దైవదూషణ చేశాడు! ఇంకా మనకు సాక్షులు ఏం అవసరం? చూడండి, ఇప్పుడే దైవదూషణ మీరు విన్నారు.
66
మీకు ఏమి అనిపిస్తుంది?” అని అడిగాడు. వారు, “ఇతనికి మరణశిక్ష విధించాలి” అని సమాధానం ఇచ్చారు.
67
అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి, ఆయనను వారి పిడికిళ్ళతో గుద్దారు, మరికొందరు ఆయనను తమ అరచేతులతో కొట్టి,
68
“క్రీస్తు, నిన్ను కొట్టింది ఎవరో ప్రవచించు” అన్నారు.
69
పేతురు బయట ప్రాంగణంలో కూర్చుని ఉన్నప్పుడు, అక్కడ ఒక దాసియైన అమ్మాయి అతని దగ్గరకు వచ్చింది. “నీవు కూడా గలిలయవాడైన యేసుతో ఉన్నవాడివే” అన్నది.
70
అయితే పేతురు అందరి ముందు తిరస్కరించి, “నీవు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు తెలియదు” అన్నాడు.
71
తర్వాత అతడు ద్వారం వైపు వెళ్లాడు, అక్కడ మరొక దాసియైన అమ్మాయి అతన్ని చూసి అక్కడ ఉండిన ప్రజలతో, “ఇతడు నజరేయుడైన యేసుతో ఉన్నవాడే” అని చెప్పింది.
72
పేతురు ఈసారి ఒట్టు పెట్టుకొంటూ, “అతడు నాకు తెలియదు” అని మళ్ళీ తిరస్కరించాడు.
73
కొంతసేపటి తర్వాత, అక్కడ నిలబడినవారు పేతురు దగ్గరకు వెళ్లి, “ఖచ్చితంగా నీవు కూడ వారిలో ఒకడివి; నీ మాట తీరే చెప్తుంది” అన్నారు.
74
అప్పుడు పేతురు శపించడం మొదలుపెట్టి, “అతని గురించి నాకు తెలియదు!” అని వారితో ప్రమాణం చేశాడు. వెంటనే కోడి కూసింది.
75
“కోడి కూయక ముందే నేనెవరో నీకు తెలియదు అని మూడుసార్లు చెప్తావు” అని యేసు తనతో చెప్పిన మాటను పేతురు జ్ఞాపకం చేసుకుని బయటకు వెళ్లి ఎంతో బాధతో ఏడ్చాడు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options