Skip to content
లూకా 1:26-56

లూకా 1:26-56

26
ఎలీసబెతు గర్భవతియైన ఆరో నెలలో, దేవుడు గబ్రియేలు దూతను గలిలయలోని నజరేతు గ్రామానికి,
27
దావీదు వంశస్థుడైన యోసేపుకు ప్రధానం చేయబడిన మరియ అనే కన్య దగ్గరకు పంపారు.
28
ఆ దూత ఆమె దగ్గరకు వెళ్లి ఆమెతో, “బహుగా దయను పొందినదానా, నీకు శుభములు! ప్రభువు నీకు తోడై ఉన్నారు” అని చెప్పాడు.
29
అతని మాటలకు మరియ చాలా కలవరపడి, ఇది ఎటువంటి శుభవచనమో అని ఆశ్చర్యపడింది.
30
అయితే ఆ దూత ఆమెతో, “మరియా, భయపడకు; నీవు దేవుని దయను పొందుకొన్నావు.
31
నీవు గర్భం ధరించి, ఒక కుమారుని కంటావు, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టాలి.
32
ఆయన గొప్పవాడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడని పిలువబడతారు. ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనాన్ని ఆయనకు ఇస్తారు.
33
ఆయన యాకోబు వంశస్థులను నిరంతరం పరిపాలిస్తారు; ఆయన రాజ్యానికి అంతం ఉండదు” అని చెప్పాడు.
34
మరియ ఆ దూతతో, “నేను కన్యను కదా, అదెలా సాధ్యం?” అని అడిగింది.
35
అందుకు ఆ దూత, “పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. కాబట్టి పుట్టబోయే పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడతాడు.
36
నీ బంధువురాలు ఎలీసబెతు కూడ తన ముసలితనంలో గర్భం ధరించింది, పిల్లలు పుట్టరు అని ఎవరి గురించైతే అనుకున్నారో, ఆమెకు ఇప్పుడు ఆరో నెల నిండింది.
37
ఎందుకంటే దేవుని నుండి వచ్చే ఏ మాట నెరవేరక మానదు” అన్నాడు.
38
అందుకు మరియ, “నేను ప్రభువు దాసురాలను, నీవు చెప్పిన ప్రకారం నాకు జరుగును గాక” అని అన్నది. తర్వాత దూత వెళ్లిపోయాడు.
39
కొన్ని రోజుల తర్వాత మరియ సిద్ధపడి యూదయ కొండ ప్రాంతంలో ఉన్న పట్టణానికి వెళ్లింది,
40
అక్కడ ఆమె జెకర్యా ఇంటికి వెళ్లి ఎలీసబెతుకు వందనాలు చెప్పింది.
41
ఎలీసబెతు మరియ చెప్పిన వందనాలను వింటున్నప్పుడు, ఆమె గర్భంలోని శిశువు గంతులేసాడు, ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నింపబడింది.
42
ఆమె పెద్ద స్వరంతో: “స్త్రీలలో నీవు ధన్యురాలవు, నీవు గర్భంలో మోస్తున్న శిశువు ధన్యుడు!
43
నా ప్రభువు తల్లి నా దగ్గరకు రావడానికి, నేను ఏపాటిదానను?
44
నీవు చెప్పిన వందనం నా చెవిని చేరగానే, నా గర్భంలోని శిశువు సంతోషంతో గంతులు వేశాడు.
45
ప్రభువు తనకు చేసిన వాగ్దానం తప్పక నెరవేరుతుందని నమ్మిన స్త్రీ ధన్యురాలు!” అని చెప్పింది.
46
అందుకు మరియ: “నా ఆత్మ ప్రభువును మహిమపరుస్తుంది.
47
నా రక్షకుడైన దేవునిలో నా ఆత్మ సంతోషిస్తుంది.
48
తన సేవకురాలి దీనస్థితిని ఆయన గమనించారు. ఇది మొదలుకొని తరతరాల వారు నన్ను ధన్యురాలు అంటారు,
49
ఎందుకంటే మహాఘనుడు నా కోసం గొప్ప కార్యాలను చేశారు, పరిశుద్ధుడని ఆయనకు పేరు.
50
తరతరాల వరకు ఆయనకు భయపడేవారికి, ఆయన కరుణ విస్తరిస్తుంది.
51
ఆయన తన బాహువుతో గొప్ప కార్యాలను చేస్తారు; తమ అంతరంగాల్లో గర్వించు వారిని ఆయన చెదరగొట్టారు.
52
సింహాసనాల నుండి పరిపాలకులను క్రిందికి పడద్రోసారు, కాని, దీనులను పైకి లేవనెత్తారు.
53
ఆకలిగొనిన వారిని మంచి పదార్ధాలతో తృప్తిపరిచారు, కాని, ధనవంతులను వట్టి చేతులతో పంపారు.
54
ఆయన అబ్రాహాముకు అతని సంతతివారికి నిత్యం దయ కలిగి ఉండాలని జ్ఞాపకం చేసుకొంటూ, మన పితరులకు వాగ్దానం చేసినట్లు, తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయం చేశారు.”
56
మరియ దాదాపు మూడు నెలలు ఎలీసబెతుతో ఉండి తన ఇంటికి తిరిగి వెళ్లింది.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 90 chars

Options