న్యాయాధిపతులు 19:11-30
11
వారు యెబూసును సమీపించినప్పటికి దాదాపు రోజు గడిచింది. పనివాడు తన యజమానితో, “ఈ యెబూసీయుల పట్టణంలో ఆగి ఈ రాత్రి గడుపుదాం” అన్నాడు.
12
తన యాజమాని జవాబిస్తూ, “లేదు, ఇశ్రాయేలీయులు కాని ఏ ప్రజల పట్టణంలోకి వెళ్లక మనం గిబియాకు వెళ్దాం” అన్నాడు.
13
“మనం గిబియాకు గాని రామాకు గాని చేరి ఒకచోట రాత్రి గడుపుదాం” అన్నాడు.
14
కాబట్టి వారు ముందుకు వెళ్తూ ఉండగా బెన్యామీనులోని గిబియాను చేరుకునేటప్పటికి సూర్యాస్తమయం అయ్యింది.
15
వారు ఆ రాత్రి గడపడానికి గిబియాలో ఆగారు. వారు వెళ్లి పట్టణం మధ్యలో కూర్చున్నారు కాని ఆ రాత్రి ఎవరూ వారిని తమ ఇంట్లోకి ఆహ్వానించలేదు.
16
ఆ సాయంత్రం గిబియాలో నివసిస్తున్న ఎఫ్రాయిం కొండ సీమకు చెందిన ఒక వృద్ధుడు పొలాల్లో పని ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్నాడు (ఆ పట్టణంలో నివసిస్తున్నవారు బెన్యామీనీయులు).
17
ఆ వృద్ధుడు ఊరి మధ్యలో ప్రయాణికున్ని చూసి, “మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడ నుండి వస్తున్నారు?” అని అడిగాడు.
18
అందుకతడు, “మేము యూదాలోని బేత్లెహేము నుండి ప్రయాణమై నేను నివసించే ఎఫ్రాయిం కొండసీమలో ఉన్న మారుమూల ప్రాంతానికి వెళ్తున్నాం, నేను అక్కడివాడను. నేను యూదాలోని బేత్లెహేముకు వెళ్లి వస్తున్నాను. ఇప్పుడు యెహోవా మందిరానికి వెళ్తున్నాను. ఎవరూ నన్ను ఇంటికి చేర్చుకోలేదు.
19
మా గాడిదలకు గడ్డి, ఎండుగడ్డి మేత మా దగ్గర ఉంది. నాకు మీ దాసికి, మాతో ఉన్న యువకుడికి రొట్టె, ద్రాక్షరసం కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో మాకెలాంటి ఇబ్బంది లేదు” అన్నాడు.
20
ఆ వృద్ధుడు, “మీకు క్షేమం కలుగును గాక! మీరు మా ఇంటికి రండి, మీకు అవసరమైంది నేను చూసుకుంటాను. ఇలా రాత్రివేళ వీధిలో మాత్రం గడపకండి” అని అన్నాడు.
21
అతడు వారిని ఇంటికి తీసుకెళ్లి తమ గాడిదలకు మేత వేశాడు. వారు తమ కాళ్లు కడుక్కున్న తర్వాత భోజనపానీయాలు పుచ్చుకున్నారు.
22
అలా వారు ఆనందిస్తూ ఉండగా, ఆ పట్టణంలో ఉన్న కొందరు దుష్టులు ఆ ఇంటి చుట్టూ చేరి తలుపును తడుతూ ఆ ఇంటి యజమానియైన ఆ వృద్ధునితో, “నీ ఇంటికి వచ్చిన వ్యక్తిని బయటకు తీసుకురా, మేము అతనితో పడుకుంటాం” అని బిగ్గరగా అరిచారు.
23
అప్పుడు ఆ ఇంటి యజమాని బయటకు వెళ్లి వారితో అన్నాడు, “అలా అనవద్దు. నా సోదరులారా, అంత నీచానికి దిగజారకండి, ఈ మనిషి నా అతిథి కాబట్టి ఇంత అవమానకరమైన పని చేయవద్దు.
24
ఇదిగో, కన్యగా ఉన్న నా కుమార్తె అతని ఉంపుడుగత్తె ఉన్నారు, వారిని బయటకు తెస్తాను, మీరు వారిని వాడుకొని ఏమి చేయాలనుకుంటే అది చేసుకోండి. అయితే ఈ మనిషి పట్ల ఇంత అవమానకరమైన పని చేయకండి.”
25
అయితే ఆ మనుష్యులు అతని మాట వినలేదు. కాబట్టి ఆ మనుష్యుడు తన ఉంపుడుగత్తెను బయటకు వారి దగ్గరకు పంపాడు, వారు ఆమెను మానభంగం చేస్తూ, రాత్రంతా వేదిస్తూ ఉన్నారు. తెల్లవారినప్పుడు వారు ఆమెను వెళ్లనిచ్చారు.
26
ప్రొద్దున్నే ఆమె తన యజమాని ఉంటున్న ఇంటికి తిరిగివెళ్లి ద్వారం దగ్గర వెలుగు వచ్చేవరకు పడి ఉంది.
27
ప్రొద్దున ఆమె యజమాని లేచి, ఇంటి తలుపు తీసి తన దారిన వెళ్లడానికి బయటకు వచ్చి చూస్తే, అక్కడ ఇంటి ద్వార మార్గంలో తన ఉంపుడుగత్తె తన చేతులు గడప మీద పెట్టుకొని పడి ఉన్నది.
28
అతడు ఆమెతో అన్నాడు, “లే, మనం వెళ్దాము.” అయితే ఆమె నుండి జవాబు రాలేదు. అప్పుడు ఆ మనిషి ఆమెను తన గాడిద మీద ఉంచి ఇంటికి బయలుదేరాడు.
29
అతడు ఇంటికి చేరుకుని ఒక కత్తి తీసుకుని తన ఉంపుడుగత్తెను పన్నెండు ముక్కలుగా ఏ అవయవానికి ఆ అవయవం కోసి, ఇశ్రాయేలీయుల ప్రాంతాలన్నిటికీ పంపాడు.
30
అది చూసినవారందరు, “ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి వచ్చిన రోజు నుండి ఇంతవరకు ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు. ఈ విషయమై ఆలోచించండి! మనం ఏమి చేయాలో తెలుపండి!” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.
బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.
Settings