Skip to content
ఆదికాండము 29:1-19

ఆదికాండము 29:1-19

1
యాకోబు తన ప్రయాణం కొనసాగించి తూర్పు ప్రజల దేశానికి వచ్చాడు.
2
అక్కడ ఒక బహిరంగ పొలంలో అతనికి ఒక బావి కనిపించింది. అక్కడ మూడు గొర్రె మందలు దాని దగ్గర పడుకుని ఉన్నాయి, కాపరులు ఆ బావి నీళ్లు వాటికి పెడతారు. ఆ బావి మీద పెద్ద రాయి మూత పెట్టి ఉంది.
3
మందలన్నీ కూడి రాగానే కాపరులు ఆ బావి మీద నుండి రాయిని దొర్లించి, గొర్రెలకు నీళ్లుపెట్టి, రాయి మూతను తిరిగి బావి మీద పెడతారు.
4
యాకోబు కాపరులను చూసి, “సోదరులారా, మీరు ఎక్కడి వారు?” అని అడిగాడు. వారు, “మేము హారాను వారం” అని జవాబిచ్చారు.
5
అతడు, “నాహోరు మనవడు, లాబాను మీకు తెలుసా?” అని వారిని అడిగాడు. వారు, “అవును, తెలుసు” అని చెప్పారు.
6
అప్పుడు యాకోబు, “లాబాను క్షేమమేనా?” అని అడిగాడు. “అవును, అతడు క్షేమమే, అదిగో, అతని కుమార్తె రాహేలు గొర్రెల మందతో వస్తుంది” అని వారు చెప్పారు.
7
యాకోబు, “ఇంకా ప్రొద్దుగుంకలేదు; మందలను తీసుకెళ్లే సమయం కాలేదు. గొర్రెలకు నీళ్లు పెట్టుకోండి, వాటిని మేపుకోండి” అన్నాడు.
8
“మందలన్నీ పోగయ్యేవరకు వాటికి నీళ్లు పెట్టలేము. బావి మీది నుండి రాయి దొర్లిస్తారు, అప్పుడు మేము గొర్రెలకు నీళ్లు పెడతాం” అని వారు జవాబిచ్చారు.
9
యాకోబు వారితో ఇంకా మాట్లాడుతుండగా, రాహేలు తన తండ్రి గొర్రెలతో వచ్చింది, ఆమె కూడా కాపరి.
10
యాకోబు తన మామ లాబాను కుమార్తెయైన రాహేలును, తన మామ మందను చూడగానే, అతడు వెళ్లి బావి మీద ఉన్న రాయిని దొర్లించి తన మామ మందకు నీళ్లు పెట్టాడు.
11
తర్వాత యాకోబు రాహేలును ముద్దు పెట్టుకుని బిగ్గరగా ఏడ్చాడు.
12
అతడు తన తండ్రి బంధువని, రిబ్కా కుమారుడని రాహేలుతో చెప్పాడు. కాబట్టి ఆమె పరుగెత్తుకుంటూ వెళ్లి తన తండ్రికి చెప్పింది.
13
తన సోదరి కుమారుడైన యాకోబును గురించిన సమాచారం విన్న వెంటనే, లాబాను అతన్ని కలవడానికి త్వరపడ్డాడు. అతన్ని హత్తుకుని, ముద్దుపెట్టి, తన ఇంటికి తీసుకెళ్లాడు, అక్కడ యాకోబు అన్ని విషయాలు అతనికి చెప్పాడు.
14
లాబాను అతనితో, “నీవు నా సొంత శరీరం, రక్తం” అన్నాడు. ఒక పూర్తి నెల యాకోబు అతనితో ఉన్న తర్వాత,
15
లాబాను అతనితో, “నీవు నా బంధువైనంత మాత్రాన ఏమి తీసుకోకుండ నా కోసం పని చేస్తావా? నీకు జీతంగా ఏమి కావాలో చెప్పు” అని అన్నాడు.
16
లాబానుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు; పెద్దకుమార్తె పేరు లేయా, చిన్న కుమార్తె పేరు రాహేలు.
17
లేయాకు బలహీనమైన కళ్లు ఉన్నాయి, కాని రాహేలు రూపవతి, అందగత్తె.
18
యాకోబు రాహేలుతో ప్రేమలో ఉండి, “నీ చిన్న కుమార్తె రాహేలు కోసం నేను నీ దగ్గర ఏడు సంవత్సరాలు సేవ చేస్తాను” అన్నాడు.
19
లాబాను, “ఆమెను పరాయి మనుష్యునికి ఇవ్వడం కంటే నీకివ్వడం మంచిది. నా దగ్గరే పని చేస్తూ ఉండు” అన్నాడు.

బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.

Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options