నిర్గమకాండము 40:1-33
1
యెహోవా మోషేతో ఇలా అన్నారు:
2
“మొదటి నెల మొదటి రోజున సమావేశ గుడారాన్ని నిలబెట్టాలి.
3
దానిలో నిబంధన మందసాన్ని ఉంచి ఆ మందసాన్ని తెరతో కప్పాలి.
4
బల్లను లోపలికి తెచ్చి దానికి చెందినవి దాని మీద క్రమంగా ఉంచాలి. దీపస్తంభాన్ని తెచ్చి దీపాలు వెలిగించాలి.
5
నిబంధన మందసం ఎదుట బంగారు ధూపవేదికను ఉంచి సమావేశ గుడారపు ద్వారానికి తెర తగిలించాలి.
6
“నీవు ప్రత్యక్ష గుడారపు ద్వారం ఎదుట దహనబలిపీఠాన్ని ఉంచాలి;
7
సమావేశ గుడారానికి బలిపీఠానికి మధ్యలో గంగాళం ఉంచి దానిలో నీళ్లు నింపాలి.
8
దాని చుట్టూ ఆవరణాన్ని నిలబెట్టి ఆవరణ ద్వారానికి తెర తగిలించాలి.
9
“అభిషేక తైలాన్ని తీసుకుని సమావేశ గుడారాన్ని, దానిలో ఉన్నవాటన్నిటిని అభిషేకించాలి; దానిని, దాని సామాగ్రి అన్నిటిని ప్రతిష్ఠించాలి, అప్పుడు అది పరిశుద్ధం అవుతుంది.
10
తర్వాత దహనబలిపీఠాన్ని, దాని పాత్రలన్నిటిని అభిషేకించాలి; బలిపీఠాన్ని ప్రతిష్ఠించాలి, అది అత్యంత పరిశుద్ధమవుతుంది.
11
గంగాళాన్ని దాని పీటను అభిషేకించి వాటిని పవిత్రం చేయాలి.
12
“తర్వాత నీవు అహరోనును అతని కుమారులను సమావేశ గుడారపు ద్వారం దగ్గరకు తీసుకువచ్చి వారిని నీటితో కడగాలి.
13
అహరోను నాకు యాజక సేవ చేయటానికి అతనికి పవిత్ర వస్త్రాలను ధరింపజేసి, అతన్ని అభిషేకించి ప్రతిష్ఠించాలి.
14
అతని కుమారులను తీసుకువచ్చి వారికి చొక్కాలు తొడిగించాలి.
15
నాకు యాజక సేవ చేయటానికి వారి తండ్రిని అభిషేకించినట్లే వారిని కూడా అభిషేకించాలి. వారి అభిషేకం యాజకత్వానికి గుర్తుగా తరతరాలకు కొనసాగుతుంది.”
16
యెహోవా అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం మోషే అన్నిటిని చేశాడు.
17
రెండవ సంవత్సరం మొదటి నెలలో మొదటి రోజున సమావేశ గుడారాన్ని నిలబెట్టారు.
18
మోషే మందిరాన్ని నిలబెడుతున్నప్పుడు, అతడు దాని దిమ్మలు సరియైన చోట పెట్టి, పలకలను నిలబెట్టి అడ్డకర్రలు దూర్చి దాని స్తంభాలు నిలబెట్టాడు.
19
తర్వాత మోషే యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం సమావేశ గుడారం మీద గుడారాన్ని పరచి దానిపైన గుడారపు కప్పు వేశాడు.
20
అతడు నిబంధన పలకలను తీసుకుని మందసంలో పెట్టి, మందసానికి మోతకర్రలు దూర్చి దాని మీద ప్రాయశ్చిత్త మూతను ఉంచాడు.
21
యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం మోషే మందసాన్ని సమావేశ గుడారంలోకి తీసుకువచ్చి కప్పివుంచే తెర తగిలించి నిబంధన మందసాన్ని కప్పాడు.
22
మోషే సమావేశ గుడారంలో ఉత్తరం వైపున తెర బయట బల్లను ఉంచి,
23
యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం, యెహోవా ఎదుట దానిపైన రొట్టెను పెట్టాడు.
24
అతడు సమావేశ గుడారంలో బల్లకు ఎదురుగా సమావేశ గుడారానికి దక్షిణ వైపు దీపస్తంభాన్ని ఉంచి,
25
యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం, యెహోవా ఎదుట దీపాలు వెలిగించాడు.
26
మోషే సమావేశ గుడారంలో తెర ఎదుట బంగారు ధూపవేదిక ఉంచి,
27
యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం, పరిమళ వాసనగల ధూపాన్ని దాని మీద కాల్చాడు.
28
తర్వాత అతడు సమావేశ గుడారపు ప్రవేశ ద్వారానికి తెర వేశాడు.
29
సమావేశ గుడారపు ద్వారానికి సమీపంగా దహనబలిపీఠాన్ని ఉంచి దాని మీద దహనబలి అర్పించి భోజనార్పణను సమర్పించాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం మోషే ఇది చేశాడు.
30
సమావేశ గుడారానికి బలిపీఠానికి మధ్యలో గంగాళాన్ని ఉంచి, కడుక్కోడానికి దానిలో నీళ్లు పోశాడు.
31
మోషే అహరోను అతని కుమారులు తమ చేతులు కాళ్లు కడుక్కోడానికి దీనిని ఉపయోగించారు.
32
వారు సమావేశ గుడారం లోనికి వెళ్లినప్పుడు బలిపీఠాన్ని సమీపించినప్పుడు కడుక్కునేవారు; యెహోవా మోషే ఆజ్ఞాపించిన ప్రకారం మోషే ఇది చేశాడు.
33
తర్వాత మోషే సమావేశ గుడారానికి బలిపీఠానికి చుట్టూ ఆవరణాన్ని ఏర్పాటు చేసి ఆవరణ ద్వారానికి తెర వేశాడు. ఇలా మోషే పని ముగించాడు.
Settings