Skip to content
1 సమూయేలు 4:5-18

1 సమూయేలు 4:5-18

5
యెహోవా నిబంధన మందసం శిబిరంలోనికి రాగానే ఇశ్రాయేలీయులందరు భూమి దద్దరిల్లేంత పెద్దగా కేకలు వేశారు.
6
ఆ కేకల ధ్వని ఫిలిష్తీయులు విని, “హెబ్రీయుల శిబిరంలో ఆ పెద్ద కేకలు ఏంటి?” అనుకున్నారు. యెహోవా నిబంధన మందసం శిబిరంలోనికి వచ్చిందని వారు తెలుసుకొని,
7
ఫిలిష్తీయులు భయపడి, “ఒక దేవుడు శిబిరంలోనికి వచ్చాడు; అయ్యో! ఇంతకుముందు ఎప్పుడూ ఇలా జరుగలేదు.
8
మనకు శ్రమ! బలాఢ్యుడైన ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపిస్తారు? అరణ్యంలో అనేక రకాల తెగుళ్ళతో ఈజిప్టువారిని నాశనం చేసిన దేవుడు ఈయనే.
9
ఫిలిష్తీయులారా, ధైర్యంగా ఉండండి! మగవారిగా ఉండండి, లేదా వారు మీకు బానిసలైనట్టు మీరు హెబ్రీయులకు బానిసలు కాకుండ మగవారిగా బలాఢ్యులై పోరాడండి!” అని చెప్పుకొన్నారు.
10
కాబట్టి ఫిలిష్తీయులు యుద్ధం చేశారు, ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరు తమ గుడారాలకు పారిపోయారు. అప్పుడు భయంకరమైన వధ జరిగింది; ఇశ్రాయేలీయులలో ముప్పైవేలమంది సైనికులు చనిపోయారు.
11
దేవుని మందసం స్వాధీనం చేసుకోబడింది, ఏలీ ఇద్దరు కుమారులైన హొఫ్నీ, ఫీనెహాసులు చనిపోయారు.
12
ఆ రోజే ఒక బెన్యామీనీయుడు యుద్ధభూమిలో నుండి పరుగెత్తుకుని వచ్చి చినిగిన బట్టలతో తలమీద దుమ్ముతో షిలోహులోనికి వచ్చాడు.
13
అతడు వచ్చేటప్పటికి, ఏలీ మార్గం ప్రక్కన తన కుర్చీలో చూస్తూ కూర్చున్నాడు, ఎందుకంటే అతని హృదయం దేవుని మందసాన్ని గురించిన భయంతో నిండింది. ఆ వ్యక్తి పట్టణంలోకి ప్రవేశించి జరిగిన విషయం చెప్పగానే పట్టణమంతా కేకలు వేసింది.
14
ఏలీ ఆ కేకలు విని, “ఈ కేకలకు అర్థమేంటి?” అని అడిగాడు. ఆ వ్యక్తి వెంటనే ఏలీ దగ్గరకు వచ్చి విషయం చెప్పాడు.
15
ఏలీకి తొంభై ఎనిమిది సంవత్సరాల వయస్సు, అతనికి చూపు మందగించి చూడలేకపోయేవాడు.
16
అతడు ఏలీతో, “యుద్ధభూమి నుండి వచ్చినవాన్ని నేనే, ఈ రోజే నేను యుద్ధంలో నుండి పరుగెత్తుకొని వచ్చాను” అని చెప్పాడు. అప్పుడు ఏలీ, “నా కుమారుడా, ఏమి జరిగింది?” అని అడిగాడు.
17
అందుకు ఆ వార్త తెచ్చిన అతడు, “ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ముందు నిలబడలేక పారిపోయారు. సైన్యంలో అనేకమంది చంపబడ్డారు. నీ ఇద్దరు కుమారులైన హొఫ్నీ ఫీనెహాసులు కూడా చంపబడ్డారు. దేవుని మందసాన్ని శత్రువులు స్వాధీనం చేసుకున్నారు” అని చెప్పాడు.
18
దేవుని మందసం గురించి అతడు చెప్పగానే, ఏలీ గుమ్మం దగ్గర ఉన్న తన కుర్చీమీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాడు. ఎందుకంటే అతడు ముసలివాడు, భారీకాయుడు. అతడు నలభై సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options