Skip to content
1 సమూయేలు 10:1-19

1 సమూయేలు 10:1-19

1
అప్పుడు సమూయేలు ఒలీవనూనె బుడ్డి తీసుకుని సౌలు తలమీద పోసి అతన్ని ముద్దు పెట్టుకొని ఇలా అన్నాడు, “యెహోవా తన వారసత్వమైన ప్రజల మీద పాలకునిగా నిన్ను అభిషేకించారు.
2
ఈ రోజు నీవు నా దగ్గరి నుండి వెళ్లిన తర్వాత, బెన్యామీను సరిహద్దులో సెల్సహులో ఉన్న రాహేలు సమాధి దగ్గర ఇద్దరు వ్యక్తులు నీకు కనబడతారు. వారు నీతో, ‘నీవు వెదకుతున్న గాడిదలు దొరికాయి. నీ తండ్రి వాటి గురించి ఆలోచించడం మాని నీకోసం కంగారు పడుతూ, “నా కుమారుని గురించి నేనేమి చేయాలి?” అని అడుగుతున్నాడు’ అని చెప్తారు.
3
“తర్వాత నీవు అక్కడినుండి తాబోరు సింధూర వృక్షం వరకు వెళ్తావు. అక్కడ బేతేలులో దేవుని ఆరాధించడానికి వెళ్తున్న ముగ్గురు మనుష్యులు నీకు ఎదురవుతారు. వారిలో ఒకడు మూడు మేక పిల్లలను, మరొకడు మూడు రొట్టెలను, ఇంకొకడు ఒక్క ద్రాక్షరసపు తిత్తిని మోస్తుంటారు.
4
వారు నీ క్షేమసమాచారాన్ని తెలుసుకుని రెండు రొట్టెలు ఇస్తారు, నీవు వాటిని తీసుకోవాలి.
5
“ఆ తర్వాత నీవు దేవుని గిబియాకు వెళ్తావు, అక్కడ ఫిలిష్తీయుల సైనిక స్థావరం ఉంది. నీవు పట్టణం దగ్గరకు చేరుకుంటుండగా, వీణలు, కంజరలు, పిల్లనగ్రోవులు, సితారాలు వాయిస్తున్నవారి వెనుక, ఉన్నత స్థలం నుండి దిగి వస్తున్న ప్రవక్తల ఊరేగింపు నీకు కనబడుతుంది. వారు ప్రవచిస్తూ వస్తారు.
6
యెహోవా ఆత్మ నీ మీదికి బలంగా దిగి వచ్చినప్పడు, నీవు కూడా వారితో కలిసి ప్రవచిస్తావు; నీవు క్రొత్త వ్యక్తిగా మారతావు.
7
ఈ సూచనలు నెరవేరిన తర్వాత నీకు ఏది మంచిదనిపిస్తే అది చేయి, దేవుడు నీకు తోడుగా ఉంటారు.
8
“నాకంటే ముందు నీవు గిల్గాలుకు వెళ్లు. దహనబలులు సమాధానబలులు అర్పించడానికి నేను తప్పక నీ దగ్గరకు వస్తాను. అయితే నేను వచ్చి నీవు ఏం చేయాలో నీకు చెప్పే వరకు, నీవు ఏడు రోజులు అక్కడే వేచి ఉండాలి.”
9
సౌలు సమూయేలు దగ్గరి నుండి వెళ్లడానికి వెనుకకు తిరగ్గానే దేవుడు సౌలు హృదయాన్ని మార్చారు, ఆ రోజే ఈ సూచనలన్నీ నెరవేరాయి.
10
అతడు, అతని సేవకుడు గిబియా దగ్గరకు చేరుకున్నప్పుడు, ప్రవక్తల ఊరేగింపు అతనికి ఎదురైంది; దేవుని ఆత్మ బలంగా అతని మీదికి వచ్చి, అతడు వారితో కలిసి ప్రవచించాడు.
11
గతంలో అతన్ని తెలిసిన వారందరు అతడు ప్రవక్తలతో కలిసి ప్రవచించడం చూసి, “కీషు కుమారునికి ఏమైంది? సౌలు కూడా ప్రవక్తల్లో ఒకడా?” అని ఒకరితో ఒకరు అనుకున్నారు.
12
అక్కడ నివసించే ఒక వ్యక్తి, “వారి నాయకుడు ఎవరు?” అన్నాడు. అందువల్ల, “సౌలు కూడా ప్రవక్తల్లో ఒకడా?” అనే సామెత పుట్టింది.
13
సౌలు ప్రవచించడం ఆపిన తర్వాత అతడు ఉన్నత స్థలానికి వెళ్లాడు.
14
సౌలు చిన్నాన్న అతన్ని అతని సేవకుడిని చూసి, “మీరు ఎక్కడికి వెళ్లారు?” అని అడిగాడు. అందుకతడు, “గాడిదలను వెదకడానికి వెళ్లాం, అవి కనబడలేదని సమూయేలు ప్రవక్త దగ్గరకు వెళ్లాం” అని చెప్పాడు.
15
అందుకు సౌలు చిన్నాన్న, “సమూయేలు నీతో ఏమి చెప్పాడో నాతో చెప్పు” అని అన్నాడు.
16
సౌలు, “గాడిదలు దొరికాయని అతడు మాకు హామీ ఇచ్చాడు” అని తన చిన్నాన్నకు చెప్పాడు. అయితే రాజ్యాధికారం గురించి సమూయేలు చెప్పిన విషయాన్ని అతడు తన మామకు చెప్పలేదు.
17
తర్వాత సమూయేలు మిస్పాలో యెహోవా దగ్గరకు ఇశ్రాయేలు ప్రజలను పిలిపించి,
18
వారితో ఇలా చెప్పాడు, “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తెలియజేసింది ఇదే: ‘నేను ఇశ్రాయేలీయులైన మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకువచ్చి ఈజిప్టువారి అధికారం నుండి, మిమ్మల్ని బాధపెట్టిన అన్ని దేశాల నుండి విడిపించాను.’
19
అయితే మీ కష్టాలన్నిటి నుండి ఆపదలన్నిటి నుండి మిమ్మల్ని రక్షించిన మీ దేవుడిని మీరు ఇప్పుడు తిరస్కరించారు. ‘మామీద రాజుగా ఒకరిని నియమించు’ అని ఆయనను అడిగారు. కాబట్టి ఇప్పుడు మీ గోత్రాలు మీ కుటుంబాల ప్రకారం మీరు యెహోవా సన్నిధికి రావాలి.”

బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.

Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options