Dedication గురించి బైబిల్ వచనాలు: Temple of Solomon
Temple of Solomon గురించి వచనాలు
అప్పుడు రాజైన సొలొమోను దావీదు పట్టణమైన సీయోను నుండి యెహోవా నిబంధన మందసాన్ని తీసుకురావడానికి ఇశ్రాయేలు పెద్దలను, గోత్రాల పెద్దలను, ఇశ్రాయేలీయుల కుటుంబాల నాయకులందరిని యెరూషలేములో తన దగ్గరకు పిలిపించాడు.
ఏతనీము అనే ఏడవ నెలలో, పండుగ సమయంలో ఇశ్రాయేలీయులందరు రాజైన సొలొమోను ఎదుట సమావేశమయ్యారు.
ఇశ్రాయేలు పెద్దలందరు వచ్చాక, యాజకులు యెహోవా నిబంధన మందసాన్ని తీసుకుని,
వారు యెహోవా మందసాన్ని, సమావేశ గుడారాన్ని, అందులోని పవిత్ర వస్తువులన్నీ తీసుకువచ్చారు. యాజకులు, లేవీయులు వాటిని పైకి మోసుకెళ్లారు.
రాజైన సొలొమోను, అతనితో ఉన్న ఇశ్రాయేలీయులందరు మందసం ముందు సమావేశమై, లెక్కలేనన్ని గొర్రెలను పశువులను బలి ఇచ్చారు.
తర్వాత యాజకులు యెహోవా నిబంధన మందసాన్ని మందిరంలోని గర్భాలయం అనే అతి పరిశుద్ధ స్థలంలో దాని స్థలానికి తీసుకువచ్చి, కెరూబుల రెక్కల క్రింద పెట్టారు.
కెరూబుల రెక్కలు మందసం ఉన్న స్థలం మీదుగా చాపబడి మందసాన్ని, దానిని మోసే కర్రలను కప్పివేశాయి.
ఈ మోతకర్రలు చాలా పొడవుగా ఉండడం వల్ల, వాటి అంచులు గర్భాలయానికి ముందున్న పరిశుద్ధ స్థలంలో నుండి కనబడతాయి, కాని పరిశుద్ధస్థలం బయట నుండి కనబడవు; ఈనాటికీ అవి అక్కడే ఉన్నాయి.
మోషే హోరేబులో ఉన్నప్పుడు, అనగా ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన తర్వాత యెహోవా వారితో నిబంధన చేసినప్పుడు మందసంలో పెట్టిన రెండు రాతిపలకలు తప్ప మరేమీ దానిలో లేవు.
యాజకులు పరిశుద్ధస్థలం నుండి బయటకు వచ్చినప్పుడు యెహోవా మందిరాన్ని మేఘం కమ్ముకుంది.
యెహోవా మహిమ ఆయన మందిరం నిండ కమ్ముకున్న ఆ మేఘాన్ని బట్టి యాజకులు తమ సేవ చేయలేకపోయారు.
అప్పుడు సొలొమోను, “యెహోవా తాను చీకటి మేఘంలో నివసిస్తారని ఆయన చెప్పారు;
నేను మీ కోసం ఘనమైన మందిరాన్ని కట్టించాను, అది మీరు ఎల్లకాలం నివసించగలిగే స్థలం” అని అన్నాడు.
ఇశ్రాయేలు సమాజమంతా అక్కడ నిలబడి ఉండగా రాజు వారివైపు తిరిగి, వారిని దీవించాడు.
అప్పుడతడు ఇలా అన్నాడు: “నా తండ్రియైన దావీదుకు మాట ఇచ్చి తన స్వహస్తంతో దాన్ని నెరవేర్చిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తుతి కలుగును గాక. ఎందుకంటే ఆయన ఇలా అన్నారు:
‘ఈజిప్టు నుండి నేను నా ప్రజలను తీసుకువచ్చిన రోజు నుండి, నా పేరిట మందిరం కట్టించుకోడానికి ఇశ్రాయేలు గోత్రాలకు చెందిన పట్టణాల్లో దేనినీ నేను ఎన్నుకోలేదు, కాని నా ప్రజలైన ఇశ్రాయేలును పరిపాలించడానికి దావీదును ఎన్నుకున్నాను.’
“ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పేరున మందిరం కట్టించాలనే ఆశ నా తండ్రి దావీదు హృదయంలో ఉండింది.
కాని, యెహోవా నా తండ్రియైన దావీదుతో, ‘నా పేరున మందిరాన్ని కట్టించాలనే ఆశ నీ హృదయంలో ఉండడం మంచిదే.
అయితే కట్టించేది నీవు కాదు, నీ రక్తం పంచుకుని పుట్టే కుమారుడు నా పేరున మందిరాన్ని కట్టిస్తాడు’ అన్నారు.
“యెహోవా తన వాగ్దానం నిలబెట్టుకున్నారు; యెహోవా వాగ్దానం చేసినట్లే, నేను నా తండ్రి దావీదు స్థానంలో ఇశ్రాయేలు రాజ సింహాసనం ఎక్కాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పేరున మందిరాన్ని కట్టించాను.
యెహోవా మన పూర్వికులను ఈజిప్టు నుండి తీసుకువచ్చినప్పుడు, ఆయన వారితో చేసిన నిబంధనను తెలిపే మందసం కోసం మందిరంలో స్థలం ఏర్పాటు చేశాను.”
అప్పుడు సొలొమోను యెహోవా బలిపీఠం ముందు, ఇశ్రాయేలు సమాజమంతటి సమక్షంలో నిలబడి ఆకాశం వైపు చేతులు చాపి,
ఇలా ప్రార్థించాడు: “యెహోవా, ఇశ్రాయేలు దేవా, పైన ఆకాశంలో గాని, క్రింద భూమిమీద గాని, మీలాంటి దేవుడు మరొకడు లేడు. మీ మార్గంలో హృదయమంతటితో కొనసాగే మీ సేవకుల పట్ల మీ ప్రేమ నిబంధనను నెరవేరుస్తారు.
మీరు మీ సేవకుడూ, నా తండ్రియైన దావీదుతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చారు; మీ నోటితో చేసిన వాగ్దానాన్ని ఈ రోజున కనబడుతున్నట్టుగా మీ చేతులతో నెరవేర్చారు.
“ఇప్పుడు యెహోవా! ఇశ్రాయేలు దేవా! మీరు మీ సేవకుడూ, నా తండ్రియైన దావీదుతో, ‘నీ వారసులు తమ ప్రవర్తన విషయంలో జ్రాగత్తగా ఉంటూ, నీలా నా ఎదుట నమ్మకంగా జీవిస్తే, ఇశ్రాయేలు సింహాసనం మీద ఆసీనుడయ్యేవాడు నీ సంతానంలో ఉండక పోడు’ అని చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చండి.