Skip to content
మత్తయి 12:6-30

మత్తయి 12:6-30

6
దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో నేను చెప్తున్నాను.
7
‘నేను దయను కోరుతున్నాను, బలిని కాదు’ అనే మాటల అర్థం ఒకవేళ మీకు తెలిసి ఉంటే, మీరు నిర్దోషులకు తీర్పు తీర్చేవారు కారు.
8
ఎందుకంటే మనుష్యకుమారుడు సబ్బాతు దినానికి ప్రభువు” అని చెప్పారు.
9
ఆయన అక్కడినుండి వెళ్తూ, వారి సమాజమందిరంలో వెళ్లారు.
10
అక్కడ చేతికి పక్షవాతం కలవాడు ఒకడున్నాడు. యేసు మీద నేరం మోపడానికి కారణం వెదుకుతున్న కొందరు, “సబ్బాతు దినాన బాగుచేయడం ధర్మశాస్త్రానుసారమా?” అని అడిగారు.
11
అందుకు యేసు వారితో, “మీలో ఎవనికైనా ఒక గొర్రె ఉండి అది సబ్బాతు దినాన గుంటలో పడితే దానిని పట్టుకుని బయటకు తీయకుండా ఉంటారా?
12
గొర్రె కంటే మనిషి విలువ ఎంతో ఎక్కువ కదా! కాబట్టి సబ్బాతు దినాన మంచి చేయడం ధర్మశాస్త్ర ప్రకారం న్యాయమే” అన్నారు.
13
ఆయన ఆ వ్యక్తితో, “నీ చేయి చాపు” అన్నారు. వాడు దాన్ని చాపగానే అది రెండవ చేయిలా పూర్తిగా బాగయింది.
14
కానీ పరిసయ్యులు బయటకు వెళ్లి యేసును ఎలా చంపుదామా అని ఆయన మీద పన్నాగం పన్నారు.
15
యేసు ఆ సంగతిని తెలుసుకొని అక్కడినుండి వెళ్లిపోయారు. చాలా గొప్ప జనసమూహం ఆయనను వెంబడించింది. ఆయన రోగులందరిని బాగుచేశారు.
16
ఆయన తన గురించి ఇతరులకు చెప్పవద్దని వారిని హెచ్చరించారు.
17
యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పింది నెరవేరేలా అది అలా జరిగింది. అదేమిటంటే:
18
“ఇదిగో, నేను ఏర్పరచుకున్న నా సేవకుడు, నేను ప్రేమించేవాడు, ఇతని గురించి నేను ఆనందిస్తున్నాను; ఇతనిపై నా ఆత్మను ఉంచుతాను. ఇతడు దేశాలకు న్యాయం జరిగిస్తాడు.
19
ఆయన జగడమాడడు, అరవడు కేకలు వేయడు; వీధుల్లో ఆయన స్వరం ఎవరికీ వినిపించదు.
20
న్యాయాన్ని వ్యాపింపచేసే వరకు ఆయన నలిగిన రెల్లును విరువడు, మంటలేకుండా కాలి పొగవస్తున్న వత్తిని ఆర్పడు.
21
దేశాలు ఈయన నామంలో నిరీక్షణ కలిగి ఉంటాయి.”
22
అప్పుడు దయ్యం పట్టిన గ్రుడ్డి మూగవానిగా ఉండిన ఒకనిని కొందరు యేసు దగ్గరకు తీసుకువచ్చినప్పుడు, వాడు చూడగలుగునట్లు మాట్లాడగలుగునట్లు యేసు వానిని బాగుచేశారు.
23
కాబట్టి ప్రజలందరు ఆశ్చర్యపడి, “ఈయనే దావీదు కుమారుడా?” అని చెప్పుకొన్నారు.
24
కాని పరిసయ్యులు ఆ మాటలు విన్నప్పుడు, వారు, “ఇతడు బయెల్జెబూలు అనే దయ్యాల అధిపతి సహాయంతో దయ్యాలను వెళ్లగొడుతున్నాడు” అన్నారు.
25
యేసు వారి ఆలోచనలను తెలుసుకొని వారితో ఈ విధంగా అన్నారు, “ఏ రాజ్యమైనా తనకు తానే వ్యతిరేకంగా ఉండి చీలిపోతే అది నాశనం అవుతుంది. అలాగే ఏ పట్టణమైనా లేదా కుటుంబమైన తనకు తానే వ్యతిరేకంగా ఉండి చీలిపోతే అది నిలబడదు.
26
ఒకవేళ సాతాను సాతానును వెళ్లగొడితే వాడు తనను తాను వ్యతిరేకించుకొని చీలిపోతాడు. అలాంటప్పుడు వాని రాజ్యం ఎలా నిలుస్తుంది?
27
ఒకవేళ బయెల్జెబూలు సహాయంతో నేను దయ్యాలను వెళ్లగొడితే మీ ప్రజలు ఎవరి సహాయంతో వెళ్లగొడతారు? అప్పుడు వారే మీకు తీర్పుతీర్చుతారు.
28
కానీ ఒకవేళ నేను దేవుని ఆత్మ ద్వారా దయ్యాలను వెళ్లగొడుతున్నట్లయితే, అప్పుడు దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చిందని అర్థము.
29
“ఎవడైనా బలవంతుడైనవాని ఇంట్లోకి వెళ్లి మొదట ఆ బలవంతుని బంధించకుండా అతని ఆస్తిని దోచుకోగలడా? అతన్ని బంధిస్తేనే వాడు ఇంటిని దోచుకోగలడు.
30
“నాతో లేనివారు నాకు వ్యతిరేకులు, నాతో చేరనివారు చెదరగొట్టబడతారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options