Skip to content
లూకా 9:44-62

లూకా 9:44-62

44
“నేను చెప్పబోయే మాటలను జాగ్రత్తగా వినండి: మనుష్యకుమారుడు మనుష్యుల చేతికి అప్పగించబడబోతున్నాడు” అని చెప్పారు.
45
అయితే వారు ఆ మాటల అర్థాన్ని గ్రహించలేదు. అది వారికి మరుగు చేయబడింది కాబట్టి వారు దానిని తెలుసుకోలేకపోయారు. అంతేకాదు వారు దాని గురించి అడగడానికి కూడా భయపడ్డారు.
46
అప్పుడే వారిలో ఎవరు గొప్ప అని శిష్యుల మధ్య వాదం పుట్టింది.
47
యేసు, వారి ఆలోచనలను తెలుసుకొని, ఒక చిన్నబిడ్డను తన ప్రక్కన నిలబెట్టుకున్నారు.
48
తర్వాత ఆయన వారితో, “ఎవరు ఈ చిన్నబిడ్డను నా పేరట చేర్చుకుంటారో వారు నన్ను చేర్చుకున్నట్టే; నన్ను చేర్చుకొనేవారు నన్ను పంపినవానిని చేర్చుకున్నట్టే. ఎందుకంటే మీ అందరిలో చివరివానిగా ఉండేవారే గొప్పవారు” అని చెప్పారు.
49
యోహాను యేసుతో, “బోధకుడా, నీ పేరట ఒకడు దయ్యాలను వెళ్లగొట్టడం మేము చూసి, వాన్ని ఆపే ప్రయత్నం చేశాం, ఎందుకంటే వాడు మనవాడు కాడు” అని చెప్పాడు.
50
అందుకు యేసు, “అలా ఆపవద్దు, ఎందుకంటే, మీకు విరోధి కాని వాడు మీ పక్షంగా ఉన్నవాడు” అని చెప్పారు.
51
తాను పరలోకానికి ఎత్తబడే సమయం ఆసన్నమైనదని గ్రహించి, యేసు యెరూషలేముకు వెళ్లాలని మనస్సును స్థిరపరచుకున్నారు.
52
తన కోసం బస సిద్ధం చేయడానికి తనకంటే ముందుగా, కొందరిని సమరయుల గ్రామానికి పంపారు.
53
కాని అక్కడి ప్రజలు ఆయన యెరూషలేముకు వెళ్తున్నారని తెలిసి, ఆయనను చేర్చుకోలేదు.
54
ఆయన శిష్యులైన యాకోబు యోహాను అది చూసి, ఆయనతో, “ప్రభువా, ఆకాశం నుండి అగ్నిని కురిపించి వీరిని నాశనం చేయమంటావా?” అని అడిగారు.
55
అయితే యేసు వారివైపు తిరిగి వారిని గద్దించారు.
56
ఆ తర్వాత ఆయన తన శిష్యులతో మరొక గ్రామానికి వెళ్లారు.
57
వారు దారిన వెళ్తున్నప్పుడు, ఒకడు ఆయనతో, “నీవు ఎక్కడికి వెళ్లినా నేను నిన్ను వెంబడిస్తాను” అని అన్నాడు.
58
అందుకు యేసు, “నక్కలకు బొరియలు ఆకాశపక్షులకు గూళ్ళు ఉన్నాయి, కాని మనుష్యకుమారునికి తలవాల్చుకోడానికి కూడా స్ధలం లేదు” అని అతనితో చెప్పారు.
59
ఆయన ఇంకొకనితో, “నన్ను వెంబడించు” అన్నారు. అందుకు అతడు, “ప్రభువా, మొదట నేను వెళ్లి నా తండ్రిని పాతిపెట్టడానికి నన్ను వెళ్లనివ్వు!” అని అన్నాడు.
60
యేసు అతనితో, “చనిపోయినవారు తమ చనిపోయినవారిని పాతిపెట్టుకుంటారు, నీవైతే వెళ్లి దేవుని రాజ్యం గురించి ప్రకటించు” అని చెప్పారు.
61
ఇంకొకడు ఆయనతో, “ప్రభువా, నేను నిన్ను వెంబడిస్తాను; కానీ మొదట నేను వెళ్లి నా కుటుంబీకులకు వెళ్తున్నానని చెప్పి వస్తా” అన్నాడు.
62
అందుకు యేసు వానితో, “నాగలిపై చేయి వేసాక వెనుకకు తిరిగి చూసేవాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు” అని అన్నారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options