యోహాను 18:10-34
10
అప్పుడు సీమోను పేతురు తన దగ్గర ఉన్న కత్తిని దూసి, మల్కు అని పేరుగల ప్రధాన యాజకుని సేవకుడిని కొట్టి, అతని కుడి చెవిని నరికాడు.
11
అప్పుడు యేసు పేతురుతో, “కత్తిని దాని ఒరలో పెట్టు!” అని చెప్పి, “నా తండ్రి నాకు ఇచ్చిన గిన్నెలోనిది నేను త్రాగకుండా ఉంటానా?” అన్నారు.
12
అప్పుడు సైనికుల గుంపు, వారి అధిపతి, యూదా నాయకులు యేసును బంధించారు.
13
వారు మొదట ఆయనను ఆ సంవత్సర ప్రధాన యాజకుడైన కయపకు మామయైన అన్నా దగ్గరకు తీసుకెళ్లారు.
14
ప్రజల కోసం ఒక మనుష్యుడు చనిపోవడం మంచిదని యూదా నాయకులతో ఆలోచన చెప్పిన కయప ఇతడే.
15
సీమోను పేతురు, మరొక శిష్యుడు యేసును వెంబడిస్తూ వెళ్లారు. ఎందుకంటే ఆ శిష్యుడు ప్రధాన యాజకుని పరిచితుడు కాబట్టి, అతడు యేసుతో కూడా ప్రధాన యాజకుని ఇంటి వాకిటికి వెళ్లాడు.
16
కాని పేతురు ద్వారం బయటనే నిలబడి ఉన్నాడు. అప్పుడు ప్రధాన యాజకునితో పరిచయం ఉన్న ఆ మరొక శిష్యుడు బయటకు వెళ్లి అక్కడ పని చేసే ద్వారపాలికురాలితో మాట్లాడి పేతురును లోపలికి తీసుకువచ్చాడు.
17
ఆమె, “నీవు కూడా ఆయన శిష్యులలో ఒకడివి కదా?” అని పేతురును అడిగింది. అందుకు అతడు, “కాదు” అన్నాడు.
18
అప్పుడు చలిగా ఉండడంతో సేవకులు అధికారులు ఆ చలిమంట చుట్టూ నిలబడి చలి కాచుకుంటున్నారు. పేతురు కూడా వారితో నిలబడి చలి కాచుకుంటున్నాడు.
19
ఇంతలో ప్రధాన యాజకుడు యేసును ఆయన శిష్యుల గురించి, ఆయన చేసిన బోధల గురించి ప్రశ్నించాడు.
20
అందుకు యేసు, “నేను ప్రజలందరితో బహిరంగంగానే మాట్లాడాను. ఎప్పుడు యూదులందరు కూడుకొనే సమాజమందిరాల్లో దేవాలయాల్లోనే నేను బోధించాను. నేను రహస్యంగా ఏమి మాట్లాడలేదు.
21
నన్నెందుకు ప్రశ్నించడం? నా మాటలు విన్నవారిని అడగండి. నేనేం చెప్పానో వారికి తెలుసు” అని అతనితో అన్నారు.
22
యేసు ఇలా చెప్పినప్పుడు, అక్కడ నిలబడి ఉన్న అధికారులలో ఒకడు తన అరచేతితో యేసు చెంపమీద కొట్టి, “ఇదేనా ప్రధాన యాజకునికి సమాధానం చెప్పే పద్ధతి?” అని అడిగాడు.
23
అందుకు యేసు, “నేను తప్పు మాట్లాడితే ఆ తప్పు ఏమిటో రుజువుచేయి. కాని నేను సత్యమే మాట్లాడాను, నీవు నన్ను ఎందుకు కొట్టావు?” అన్నారు.
24
అప్పుడు అన్నా యేసును కట్లతో బంధించి ప్రధాన యాజకుడైన కయప దగ్గరకు పంపించాడు.
25
సీమోను పేతురు చలి కాచుకుంటూ అక్కడే నిలబడి ఉన్నప్పుడు వారు, “నీవు కూడా ఆయన శిష్యులలో ఒకడివి, అవునా కాదా?” అని అడిగారు. అందుకు అతడు, “నేను కాదు” అని చెప్తూ తిరస్కరించాడు.
26
ప్రధాన యాజకుని సేవకులలో ఒకడు, పేతురు చెవి నరికినవాడి బంధువైన ఒకడు, “నేను నిన్ను ఒలీవల తోటలో అతనితో చూడలేదా?” అని అడిగాడు.
27
పేతురు మరోసారి తిరస్కరించాడు, ఆ సమయంలోనే కోడి కూసింది.
28
అప్పుడు యూదా నాయకులు యేసును ప్రధాన యాజకుడైన కయప దగ్గర నుండి రోమా అధిపతి భవనానికి తీసుకెళ్లారు. అప్పటికి తెల్లవారింది కాబట్టి అపవిత్రపడకుండ పస్కాను తినాలని వారు భవనం లోనికి వెళ్లలేదు.
29
కాబట్టి పిలాతు బయట ఉన్న వారి దగ్గరకు వచ్చి, “మీరు ఇతని మీద ఏ నేరాన్ని మోపుతున్నారు?” అని వారిని అడిగాడు.
30
వారు, “ఇతడు నేరస్థుడు కాకపోతే మేము నీకు అప్పగించి ఉండేవారం కాదు!” అన్నారు.
31
పిలాతు, “అతన్ని మీరే తీసుకెళ్లి మీ ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు తీర్చండి” అన్నాడు. అందుకు యూదులు, “ఎవరికైనా మరణశిక్ష విధించే అధికారం మాకు లేదు” అని అడ్డు చెప్పారు.
32
యేసు తాను ఎలాంటి మరణం పొందుతానని ముందుగా చెప్పాడో ఆ మాటలు నెరవేరడానికి ఇలా జరిగింది.
33
తర్వాత పిలాతు భవనం లోనికి వెళ్లి, యేసును పిలిపించి ఆయనతో, “నీవు యూదుల రాజువా?” అని అడిగాడు.
34
యేసు, “అది నీ సొంత ఆలోచనా లేదా ఎవరైనా నా గురించి నీతో చెప్పారా?” అన్నారు.
Settings