యోహాను 13:15-38
15
నేను మీ కోసం చేసినట్లే మీరు కూడ చేయాలని నేను మీకు మాదిరిని చూపించాను.
16
ఏ సేవకుడు తన యజమాని కన్నా గొప్పవాడు కాలేడు, అలాగే ఒక సందేశాన్ని తీసుకెళ్లేవాడు సందేశాన్ని పంపినవాని కన్నా గొప్పవాడు కాలేడని నేను మీతో చెప్పేది నిజం.
17
ఇప్పుడు మీకు ఈ సంగతులు తెలుసు కాబట్టి వాటిని పాటిస్తే మీరు ధన్యులు.
18
“నేను మీ అందరి గురించి చెప్పడం లేదు; మీలో నేను ఎంపిక చేసుకున్నవారెవరో నాకు తెలుసు. అయితే ‘నా ఆహారం తిన్నవాడే నాకు వ్యతిరేకంగా మడిమ ఎత్తుతాడు’ అనే లేఖనం నెరవేరడానికి అలా జరగాలి.
19
“అయితే అది జరగకముందే నేను మీతో చెప్తున్నాను ఎందుకంటే అది జరిగినప్పుడు, ‘నేనే ఎల్లకాలం ఉన్నవాడను’ అని మీరు నమ్మాలని చెప్తున్నాను.
20
నేను పంపేవాన్ని స్వీకరించేవారు నన్ను స్వీకరిస్తారు; నన్ను స్వీకరించిన వారు నన్ను పంపినవాన్ని స్వీకరిస్తారు అని నేను మీతో చెప్పేది నిజం” అని చెప్పారు.
21
యేసు ఈ మాటలు చెప్పిన తర్వాత, తన ఆత్మలో కలవరపడి ఆయన వారితో, “మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అని చెప్పారు.
22
ఆయన తమలో ఎవరిని గురించి చెప్తున్నాడోనని శిష్యులు ఒకరిని ఒకరు అనుమానంతో చూడసాగారు.
23
ఆయన శిష్యులలో ఒకడు అనగా యేసు రొమ్మును ఆనుకుని ఉన్న యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రక్కన కూర్చుని ఉన్నాడు.
24
సీమోను పేతురు ఆ శిష్యునికి సైగ చేసి, “ఆయన చెప్పేది ఎవరి గురించి అని ఆయనను అడుగు” అన్నాడు.
25
అతడు యేసు రొమ్ముకు ఇంకా దగ్గరగా ఆనుకుని, “ప్రభువా, అతడు ఎవరు?” అని ఆయనను అడిగాడు.
26
యేసు, “ఈ గిన్నెలో రొట్టె ముక్కను ముంచి నేను ఎవరికి ఇస్తానో అతడే” అని ఆయన ఒక రొట్టె ముక్కను ముంచి సీమోను కుమారుడైన ఇస్కరియోతు యూదాకు ఇచ్చారు.
27
యూదా ఆ రొట్టెను తీసుకున్న వెంటనే సాతాను అతనిలో ప్రవేశించాడు. అప్పుడు యేసు అతనితో, “నీవు చేయబోయేది త్వరగా చేయు” అన్నారు.
28
కాని యేసు అతనితో అలా ఎందుకు అన్నారో ఆ భోజనబల్ల దగ్గర ఉన్న ఎవరికీ అర్థం కాలేదు.
29
యూదాకు డబ్బు బాధ్యత ఇవ్వబడి ఉండింది కాబట్టి పండుగ కోసం అవసరమైన వాటిని కొనడానికో, పేదవారికి ఏమైనా ఇవ్వమని యేసు అతనితో చెప్తున్నాడని కొందరు అనుకున్నారు.
30
యూదా రొట్టెను తీసుకున్న వెంటనే వెళ్లిపోయాడు. అది రాత్రి సమయం.
31
అతడు వెళ్లిపోయిన తర్వాత యేసు, “ఇప్పుడు మనుష్యకుమారుడు మహిమ పొందాడు, అలాగే దేవుడు ఆయనలో మహిమ పొందుతున్నాడు.
32
దేవుడు కుమారునిలో మహిమపరచబడినట్లైతే దేవుడు తనలో ఆయనను మహిమపరుస్తారు. వెంటనే కుమారుని మహిమపరుస్తారు.
33
“నా పిల్లలారా, నేను మీతో ఇంకా కొంత సమయమే ఉంటాను. నేను యూదులకు చెప్పినట్లే ఇప్పుడు మీతో కూడా చెప్తున్నాను: మీరు నన్ను వెదకుతారు, కాని నేను వెళ్లే చోటికి మీరు రాలేరు.
34
“ఒక క్రొత్త ఆజ్ఞను మీకిస్తున్నాను: మీరు ఒకరిని ఒకరు ప్రేమించాలి; నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించాలి.
35
మీరు ఒకరి మీద ఒకరు ప్రేమ కలిగి ఉంటే, జనులందరు మీరు నా శిష్యులని తెలుసుకుంటారు” అన్నారు.
36
సీమోను పేతురు ఆయనతో, “ప్రభువా, నీవు ఎక్కడికి వెళ్తున్నావు?” అని ఆయనను అడిగాడు. అందుకు యేసు, “నేను వెళ్లే చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు, నీవు తర్వాత వస్తావు” అని అతనితో అన్నారు.
37
అయితే పేతురు, “ప్రభువా, నేను ఇప్పుడెందుకు రాలేను? నీకోసం నేను నా ప్రాణాన్ని కూడా త్యాగం చేస్తాను” అన్నాడు.
38
అప్పుడు యేసు, “నీవు నిజంగా నా కోసం నీ ప్రాణం త్యాగం చేస్తావా? నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నీవు కోడి కూయక ముందే నేనెవరో నీకు తెలియదని మూడుసార్లు అబద్దమాడుతావు.
Settings