హెబ్రీయులకు 11:4-32
4
విశ్వాసం ద్వారానే హేబెలు కయీను కంటే ఉత్తమమైన అర్పణను దేవునికి తెచ్చాడు. విశ్వాసం ద్వారానే అతడు నీతిమంతునిగా ప్రశంసించబడ్డాడు. దేవుడు అతని అర్పణను మెచ్చుకొన్నాడు. చనిపోయినప్పటికి విశ్వాసం ద్వారానే హేబెలు ఇంకా మాట్లాడుతున్నాడు.
5
విశ్వాసం ద్వారానే హనోకు ఈ జీవితంలో మరణాన్ని పొందకుండానే కొనిపోబడ్డాడు; “దేవుడు అతన్ని తీసుకెళ్లారు కాబట్టి అతడు కనబడలేదు.” అతడు కొనిపోబడక ముందు అతడు దేవుని సంతోషపెట్టినవానిగా ప్రశంసించబడ్డాడు.
6
విశ్వాసం లేకుండా దేవుని సంతోషపెట్టడం అసాధ్యం ఎందుకంటే, దేవుని దగ్గరకు వచ్చే ప్రతివాడు దేవుడు ఉన్నాడని, తన కోసం ఆసక్తితో వెదకేవారికి ఆయన ప్రతిఫలం ఇస్తాడని నమ్మాలి.
7
విశ్వాసం ద్వారానే నోవహు అప్పటివరకు చూడనివాటి గురించి హెచ్చరించబడి పవిత్ర భయం కలిగినవాడై తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఒక ఓడను నిర్మించాడు. తన విశ్వాసం వల్లనే అతడు లోకాన్ని ఖండిస్తూ విశ్వాసంతో కొనసాగుతూ నీతికి వారసుడయ్యాడు.
8
విశ్వాసం ద్వారానే అబ్రాహాము, తాను స్వాస్థ్యంగా పొందబోతున్న ప్రదేశానికి వెళ్లమని పిలువబడినపుడు ఆ పిలుపుకు లోబడి తాను ఎక్కడికి వెళ్తున్నాడో అతనికి తెలియకపోయినా అతడు బయలుదేరి వెళ్లాడు.
9
విశ్వాసం ద్వారానే దేవుడు తనకు వాగ్దానం చేసిన దేశంలో పరదేశిలా గుడారంలో నివసించాడు, అతనితో పాటు అదే వాగ్దానానికి వారసులైన ఇస్సాకు యాకోబులు కూడా అలాగే చేశారు.
10
ఎందుకంటే అతడు ఎదురుచూస్తున్నది పునాదులుగల పట్టణం కోసం, దానికి దేవుడే శిల్పి నిర్మాణకుడు.
11
వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడని శారా నమ్మింది కాబట్టి శారాకు పిల్లలను కనే వయస్సు దాటిపోయినా, విశ్వాసం ద్వారానే ఆమె బిడ్డను కనగలిగింది.
12
చనిపోయినవానితో సమానమైన ఈ ఒక్క మనుష్యుని నుండే ఆకాశంలోని నక్షత్రాల సంఖ్యలా, సముద్రతీరంలోని ఇసుక రేణువుల్లా లెక్కకు మించిన సంతానం కలిగింది.
13
వీరందరు చనిపోయినా, విశ్వాసం ద్వారానే ఇంకా జీవిస్తున్నారు. వాగ్దానం చేసిన వాటిని వారు పొందలేదు; వారు కేవలం దూరం నుండి చూసి వాటిని ఆహ్వానించి, ఈ భూమిపై తాము విదేశీయులమని అపరిచితులమని ఒప్పుకున్నారు.
14
అలాంటి విషయాలు చెప్పే ప్రజలు తమ స్వదేశం కోసం చూస్తున్నారని స్పష్టం చేస్తారు.
15
వారు తాము వదిలి వచ్చిన దేశం గురించి ఆలోచిస్తూ ఉంటే, వారు తిరిగి వెళ్లడానికి అవకాశం కలిగి ఉండేవారు.
16
అయితే, వారు అంతకంటే ఉత్తమమైన దేశాన్ని అంటే పరలోకసంబంధమైన దేశం కోసం ఆరాటపడ్డారు. కాబట్టి వారి దేవున్ని వారి చేత పిలిపించుకోవడానికి దేవుడు సిగ్గుపడలేదు. ఎందుకంటే ఆయన వారికి ఒక పట్టణాన్ని సిద్ధపరిచాడు.
17
దేవుడు అబ్రాహామును పరీక్షించినపుడు, విశ్వాసం ద్వారానే అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించాడు. “ఇస్సాకు మూలంగానే నీ సంతానం లెక్కించబడుతుంది” అని దేవుడు అతనితో చెప్పినప్పటికి, వాగ్దానాలను పొందిన అబ్రాహాము తన ఏకైక కుమారుని బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడు. చనిపోయినవారిని సహితం లేపడానికి దేవుడు శక్తిమంతుడని అబ్రాహాము భావించాడు, దానిని ఉపమానరీతిలో చెప్పాలంటే అతడు తన కుమారుడైన ఇస్సాకును మరణం నుండి తిరిగి పొందుకున్నాడు.
20
విశ్వాసం ద్వారానే ఇస్సాకు తన సంతానమైన యాకోబు ఏశావులను వారి భవిష్యత్తు గురించి ఆశీర్వదించాడు.
21
విశ్వాసం ద్వారానే యాకోబు తాను చనిపోయే సమయంలో యోసేపు కుమారులలో అందరిని ఆశీర్వదించి, తన చేతికర్ర మీద ఆనుకుని ఆరాధించాడు.
22
విశ్వాసం ద్వారానే యోసేపు తాను చనిపోయే సమయంలో ఈజిప్టు నుండి ఇశ్రాయేలీయుల ప్రయాణం గురించి చెప్పి, తన ఎముకలను సమాధి చేయమని ఆదేశాలిచ్చాడు.
23
విశ్వాసం ద్వారానే మోషే తల్లిదండ్రులు అతడు పుట్టిన తర్వాత మూడు నెలల వరకు దాచి ఉంచారు, ఎందుకంటే అతడు సాధారణమైన బాలుడు కాడని వారు గ్రహించారు, రాజాజ్ఞకు వారు భయపడలేదు.
24
విశ్వాసం ద్వారానే మోషే, పెరిగి పెద్దవాడైన తర్వాత ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకోడానికి నిరాకరించాడు.
25
అతడు అశాశ్వతమైన పాపభోగాలను అనుభవించేకంటే దేవుని ప్రజలతో పాటు శ్రమ పొందడాన్ని ఎంచుకున్నాడు.
26
క్రీస్తు కొరకైన అవమానాన్ని ఈజిప్టు ధనం కన్నా గొప్ప విలువైనదిగా భావించాడు, ఎందుకంటే అతడు తన బహుమానం కోసం ఎదురు చూస్తున్నాడు.
27
విశ్వాసం ద్వారానే మోషే, రాజు కోపాన్ని లెక్కచేయక, ఈజిప్టును విడిచి వెళ్లాడు; అతడు కనిపించని దేవుని చూస్తూ పట్టువదలక సాగిపోయాడు.
28
అతడు విశ్వాసం ద్వారానే, పస్కాను ఆచరించి ఆ పస్కా బలి పశువు రక్తాన్ని పూయడం వలన జ్యేష్ఠ సంతానాన్ని సంహరించే మరణ దూత, ఇశ్రాయేలీయుల జ్యేష్ఠ సంతానాన్ని ముట్టకుండా చేశాడు.
29
విశ్వాసం ద్వారానే ప్రజలు ఎర్ర సముద్రంలో ఆరిన నేలపై నడిచివెళ్లారు; అయితే ఈజిప్టువారు అలాగే నడిచి వారి వెనుక వెళ్లడానికి ప్రయత్నించి, మునిగిపోయారు.
30
విశ్వాసం ద్వారానే ఇశ్రాయేలు సైన్యం యెరికో గోడల చుట్టూ ఏడు రోజులు తిరుగగా, యెరికో గోడలు కూలిపోయాయి.
31
విశ్వాసం ద్వారానే వేశ్యయైన రాహాబు, గూఢచారులను అతిథులుగా స్వీకరించింది కాబట్టి అవిధేయులతో పాటు చంపబడకుండా రక్షించబడింది.
32
ఇంకా నేనేం చెప్పాలి? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు అనేవారి గురించి, ప్రవక్తల గురించి వివరించడానికి నాకు సమయం లేదు.
బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.
Settings