నిర్గమకాండము 18:1-12
1
కొంతకాలం గడిచిన తర్వాత మిద్యాను యాజకుడు, మోషేకు మామయైన యెత్రో, దేవుడు మోషేకు అతని ప్రజలైన ఇశ్రాయేలీయులకు చేసినదంతటిని గురించి, యెహోవా ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుండి బయటకు రప్పించిన సంగతి విన్నాడు.
2
మోషే తన భార్య సిప్పోరాను పంపిన తర్వాత, అతని మామ యెత్రో ఆమెను చేర్చుకున్నాడు.
3
మోషే, “నేను పరాయి దేశంలో విదేశీయునిగా ఉన్నాను” అని చెప్పి ఒక కుమారునికి గెర్షోము అని పేరు పెట్టాడు;
4
మరొకనికి, “నా తండ్రి దేవుడు నాకు సహాయకుడు; ఫరో ఖడ్గం నుండి ఆయన నన్ను రక్షించారు” అని చెప్పి ఎలీయెజెరు అని పేరు పెట్టాడు.
5
మోషే మామయైన యెత్రో మోషే కుమారులను అతని భార్యను తీసుకుని అరణ్యంలో దేవుని పర్వతం దగ్గర బస చేస్తున్న మోషే దగ్గరకు వచ్చాడు.
6
“నీ మామనైన యెత్రో అనే నేను, నీ భార్యను నీ ఇద్దరు కుమారులను తీసుకుని నీ దగ్గరకు వస్తున్నాను” అని యెత్రో మోషేకు కబురు పంపాడు.
7
కాబట్టి మోషే తన మామను ఎదుర్కోడానికి వెళ్లి నమస్కరించి అతన్ని ముద్దు పెట్టుకున్నాడు. వారు ఒకరి క్షేమాన్ని ఒకరు తెలుసుకొని గుడారంలోకి వెళ్లారు.
8
అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల కోసం ఫరోకు ఈజిప్టువారికి చేసిన దాని గురించి, దారిలో తమకు ఎదురైన కష్టాల గురించి, యెహోవా తమను కాపాడిన విధానం గురించి మోషే తన మామకు వివరించాడు.
9
ఈజిప్టువారి చేతిలో నుండి ఇశ్రాయేలీయులను విడిపించడానికి యెహోవా చేసిన మేలులన్నిటిని విని యెత్రో ఎంతో సంతోషించాడు.
10
అప్పుడు యెత్రో, “ఈజిప్టువారి చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి ఈజిప్టువారి చేతి క్రిందనుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతించబడును గాక.
11
ఇశ్రాయేలీయుల పట్ల అహంకారంగా ప్రవర్తించిన వారికి ఆయన చేసిన దానిని బట్టి ఇతర దేవుళ్ళందరికంటే యెహోవాయే గొప్పవాడని నేనిప్పుడు తెలుసుకున్నాను” అన్నాడు.
12
అప్పుడు మోషే మామయైన యెత్రో, ఒక దహనబలిని ఇతర బలులను దేవునికి అర్పించగా, దేవుని సన్నిధిలో మోషే మామతో కలిసి భోజనం తినడానికి అహరోను, ఇశ్రాయేలీయుల పెద్దలందరితో కలిసి వచ్చాడు.
Settings