అపొస్తలుల కార్యములు 8:1-22
1
సౌలు స్తెఫెను చావును సమ్మతించాడు. ఆ రోజు నుండి యెరూషలేములోని సంఘానికి విరోధంగా తీవ్రమైన హింస చెలరేగింది, కాబట్టి అపొస్తలులు తప్ప మిగిలిన సంఘమంతా యూదయ, సమరయ ప్రాంతాలకు చెదరిపోయింది.
2
దైవభయం గల విశ్వాసులు స్తెఫెనును సమాధి చేసి అతని కోసం ఎంతో రోదించారు.
3
అయితే సౌలు ఇంటింటికి వెళ్లి, పురుషులను స్త్రీలను బయటకు ఈడ్చుకెళ్లి వారిని చెరసాలలో వేయిస్తూ, సంఘాన్ని నాశనం చేయడం మొదలుపెట్టాడు.
4
చెదరిపోయినవారు తాము వెళ్లిన ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని బోధించారు.
5
ఫిలిప్పు సమరయలోని ఒక పట్టణానికి వెళ్లి అక్కడ క్రీస్తు గురించి ప్రకటించాడు.
6
జనసమూహాలు ఫిలిప్పు చేసిన సూచకక్రియలను చూసి, అతడు చెప్పిన మాటల మీద శ్రద్ధ పెట్టసాగారు.
7
చాలామందిలో నుండి దురాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాయి, చాలామంది పక్షవాతం కలవారు, కుంటివారు స్వస్థత పొందుకున్నారు.
8
కాబట్టి ఆ పట్టణంలో గొప్ప ఆనందం కలిగింది.
9
కొంతకాలం నుండి ఆ పట్టణంలో మంత్రవిద్యను ప్రదర్శిస్తూ తానొక గొప్పవాడినని చెప్పుకుంటూ సమరయ ప్రజలందరినీ ఆశ్చర్యపరచే, సీమోను అనే పేరు కలవాడు ఉన్నాడు.
10
అల్పులు మొదలుకొని గొప్పవారి వరకు ప్రజలందరు, “దేవుని శక్తి అంటే ఇతడే” అని చెప్తూ అతని మాటలపై శ్రద్ధచూపారు.
11
అతడు తన మంత్రవిద్యతో వారిని చాలా కాలం నుండి ఆశ్చర్యపరుస్తున్నాడు కాబట్టి వారు అతన్ని వెంబడించేవారు.
12
అయితే ఫిలిప్పు దేవుని రాజ్యసువార్తను, యేసు క్రీస్తు నామాన్ని ప్రకటించినప్పుడు వారు నమ్మారు, అలా నమ్మిన స్త్రీలు పురుషులు బాప్తిస్మం పొందుకున్నారు.
13
సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొందుకొన్నాడు. అతడు ఫిలిప్పు వెళ్లిన ప్రతి చోటికి వెంబడిస్తూ, తాను చూసిన గొప్ప సూచకక్రియలు అద్భుతాలను బట్టి ఆశ్చర్యపడ్డాడు.
14
సమరయ ప్రజలు దేవుని వాక్యాన్ని స్వీకరించారని విన్న యెరూషలేములోని అపొస్తలులు, పేతురు యోహానులను సమరయ ప్రాంతానికి పంపించారు.
15
వారు అక్కడికి చేరుకొని, నూతన విశ్వాసులు పరిశుద్ధాత్మను పొందుకోవాలని ప్రార్థించారు,
16
ఎందుకంటే వారిలో ఎవ్వరూ పరిశుద్ధాత్మను ఇంకా పొందుకోలేదు; వారు కేవలం ప్రభువైన యేసు పేరట బాప్తిస్మం మాత్రమే పొందుకున్నారు.
17
పేతురు యోహానులు తమ చేతులను వారి మీద ఉంచగానే వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు.
18
అపొస్తలులు చేతులు ఉంచగానే పరిశుద్ధాత్మను పొందుకోవడం చూసిన సీమోను, వారికి డబ్బు ఇస్తూ,
19
“నేను చేతులుంచిన ప్రతివారు పరిశుద్ధాత్మను పొందుకొనేలా ఈ అధికారం నాకు కూడా ఇవ్వండి” అని అడిగాడు.
20
అందుకు పేతురు, “నీవు దేవుని వరాన్ని డబ్బుతో కొనగలనని అనుకున్నావు కాబట్టి నీ డబ్బు నీతో నశించును గాక!
21
నీ హృదయం దేవుని ఎదుట సరియైనదిగా లేదు, కాబట్టి ఈ పరిచర్యలో నీకు భాగం లేదు.
22
నీ హృదయంలో అలాంటి ఆలోచన కలిగినందుకు క్షమిస్తాడనే నిరీక్షణతో నీ దుష్టత్వాన్ని బట్టి పశ్చాత్తాపంతో ప్రభువును వేడుకో.
బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.
Settings